దిశ దశ, భూపాలపల్లి:
కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజ్ గురించి రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. శనివారం రాత్రి భారీ శబ్దంతో పిల్లర్లు కుంగిపోవడంతో ఇంజనీర్లు ఒక్కసారిగా అప్రమత్తం అయ్యారు. ఆదివారం సాయంత్రం కల్లా బ్యారేజ్ 5 ఫీట్ల వరకు కుంగిపోయిందన్న ప్రచారం జరిగింది. సోమవారం మరో పీటున్నర వరకు కుంగిపోయినట్టుగా తెలుస్తోంది. మంగళవారం నాటికి మరో ఫీటు వరకు కిందకు జారిపోవడంతో పిల్లర్ పూర్తిగా తొలగించాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. తాజాగా 20వ పీర్ శిథిలమైపోతున్నట్టుగా తెలుస్తోంది. రోజు రోజుకు పీర్ పై ఏర్పడిన పగుళ్లు విస్తరిస్తుండడంతో స్ట్రక్చర్, డెక్ భాగాలు విడిపోతున్నట్టుగా తెలుస్తోంది. ఇనుప రాడ్లు సపోర్ట్ వేయడంతో పీర్ కూలిపోకుండా అలాగే ఉందని సమాచారం. లేనట్టయితే పీర్ మొత్తం ఇప్పటికే కుప్పకూలిపోయేదని అంటున్నారు. పీర్ పొడవునా భారీ పగుళ్లు ఏర్పడడంతో అక్కడ ఉన్న స్ట్రక్చర్ అంతా కూడా వీడిపోతుండడం ఇంజనీరింగ్ అధికారులను ఆందోళన కల్గిస్తున్నట్టుగా సమాచారం.
అంచనాలో విఫలం అయ్యారా..?
ప్రధానంగా బ్యారేజ్ నిర్మాణ సమయంలో పిల్లర్స్ కోసం సాయిల్ టెస్ట్ జరిపి మరీ నిర్మాణాలు చేపట్టినప్పటికీ ఆరంభంలో ఎదురైన అవాంతరాలను అధిగమించేందుకు అధికారులు అక్కడి వరకే ఆలోచించడం వల్లే ఇప్పుడు కొత్త సమస్య ఎదురైందా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కుంగిపోయిన 20వ పిల్లర్ 7వ బ్లాక్ లో ఉందని అధికారులు చెప్తుండగా నిర్మాణ సమయంలో 4వ బ్లాక్ ప్రాంతంలో పిల్లర్లు వేసేందుకు డెప్త్ దొరకక ఇబ్బంది పడినట్టుగా కూడా తెలుస్తోంది. మహారాష్ట్ర వైపున ఉన్న ఈ బ్లాక్ లో పిల్లర్స్ వేయడానికి ఇంజనీర్లు భారీ కసరత్తు చేసినట్టుగా సమాచారం. అయితే 4వ బ్లాక్ లో ఏర్పడిన ఈ సమస్యను అధిగమించేందుకు ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు ఈ పరిస్థితి ఇతర బ్లాకులకు కూడా ఎదురవుతుందా లేదా అన్న విషయాన్ని పట్టించుకుని ఉండకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రాజెక్టు కోసం తొలిదశ పనులు జరుగుతున్న క్రమంలో మహారాష్ట్రలోని పోచంపల్లి వైపున భారీ సైజులో గుంత ఉందని దీనివల్ల బ్యారేజీ నిర్మాణానికి ఆటంకం ఏర్పడుతుందని కూడా స్థానికులు ఇంజనీరింగ్ అధికారులు సూచించినట్టుగా తెలుస్తోంది. స్థానికులు చెప్పినట్టుగానే 4వ బ్లాక్ ప్రాంతంలో ఎదురైన ఈ సమస్యను ఎదుర్కొన్న అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడంతో ఆ సమస్యను అధిగమించినట్టుగా తెలుస్తోంది. అయితే 4వ బ్లాక్ నుండి 7వ బ్లాక్ వరకూ ఇలాంటి అవరోధం ఉండి ఉంటుందని 4వ బ్లాక్ లో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సమస్యను అధిగమించినప్పటికీ 7వ బ్లాక్ లో వేసిన పిల్లర్స్ ను సహజమైన అంచనాలతోనే నిర్మించి ఉంటారని భావిస్తున్నారు. దీనివల్ల పైపైన బాగానే ఉన్న ఈ ప్రాంతంలో బ్యారేజ్ బ్యాక్ వాటర్ తో పాటు వరధ ఉధృతి కారణంగా ఇప్పుడిప్పుడు డొల్లగా అయి ఉంటుందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అలాగే వరద ప్రవాహం కారణంగా పిల్లర్స్ కింది భాగంలో ఉన్న బెడ్, ఇతర నిర్మాణాలకు సంబంధించిన కాంక్రీట్ డ్యామేజ్ కావడం వల్ల కూడా పిల్లర్స్ కుంగిపోయే ప్రమాదం లేకపోలేదని కూడా అంటున్నారు మరికొందరు. అయితే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన గోదావరి నదిలోపల డొల్ల ఏర్పడి ఉండడం వల్లే పిల్లర్స్ కుంగిపోవడానికి కారణమా లేకపోతే గ్రౌండ్ లెవల్లో పిల్లర్స్ వేసేందుకు ఎంతలోతు నుండి వేయాలి అన్న విషయంలో సరైన అంచనాలు వేయకపోవడం వల్ల ఈ సమస్య ఏర్పడి ఉంటుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.