దిశ దశ, భూపాలపల్లి:
మహారాష్ట్రలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ప్రభావం తీవ్రంగా ఉంది. నిన్నటి నుండి ప్రాణహిత నది ఉగ్రరూపం దాల్చడంతో భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద వరద ఉధృతి తీవ్రంగా పెరిగిపోతోంది. ఆదివారం ఉదయం 6 గంటల వరకు మేడిగడ్డ బ్యారేజీకి ఇన్ ఫ్లో 3,73,500 క్యూసెక్కుల వరద నీరు రాగా, 10 గంటలకల్లా 4,87,010 క్యూసెక్కులకు పెరిగింది. సాయంత్రం 6 గంటలకు 5,52,600 క్యూసెక్కులకు, సోమవారం తెల్లవారు జామున 3 గంటలకు 7,55,910 క్యూసెక్కులకు పెరిగింది. ఈ రోజు ఉదయం 6 గంటల వరకు 8,19,500, 8 గంటల వరకు 8,68,850కి చేరింది. దీంతో ప్రాణహిత నుండి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణాలోని భూపాలపల్లి జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతంలోని పంట చేలు జలమయం అవుతుండగా, మహారాష్ట్రంలోని సిరొంచ తాలుకాలోని పలు గ్రామాల పంటలు కూడా నీట మునిగాయి.
మహారాష్ట్రలో…
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో కూడా వరద ఉధృతి జనజీవనాన్ని స్తంభింపజేసింది. జిల్లా మీదుగా ప్రవహిస్తున్న పెన్ గంగా, వైన్ గంగాలు పెద్ద ఎత్తున పొంగిపొర్లుతున్నాయి. దీంతో గడ్చిరోలి జిల్లా కేంద్రంలోని కొన్ని ప్రాంతాలు జలమయం అయ్యాయంటే ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలోని మొత్తం 30 రహదారులు వరద నీటితో నిండిపోగా, ఐదు జాతీయ రహదారుల్లో కూడా రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాలోని నదిపరివాహక ప్రాంతాల్లో వేలాది ఎకరాల వ్యవసాయ భూములు నీట మునిగిపోయాయి. జిల్లాలోని ఆల్లపల్లి, భామ్రాఘడ్ తాలుకాల మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి. ఈ రెండు తాలుకాల్లోని సుమారు వంద గ్రామాలు జలదిగ్భంధనంలో చిక్కుకపోయాయి.