దిశ దశ, జగిత్యాల:
ఓ ప్రాజెక్టు అసంపూర్తి నిర్మాణం కారణంగా గ్రామం అంతా జలమయం అయిపోయింది. సకాలంలో గేట్లు బిగించినట్టయితే ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదని గ్రామస్థులు అంటున్నారు. జగిత్యాల జిల్లా బీర్ పూర్ సమీపంలో నిర్మిస్తున్న రోళ్ల వాగుకు భారీ వరద పెరగడంతో నృసింహుల పల్లెకు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరింది. ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వరద నీరు రోళ్లవాగుకు చేరడం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులో నీటి నిలువ ఉంచే అవకాశం లేకపోవడంతో గ్రామంలోని వీధులు నీటితో నిండిపోయాయి. రూ.130 కోట్లతో ఆధునికీకరణ పనులు చేపట్టినప్పటికీ సకాలంలోపనులు పూర్తి కాలేదని, ప్రాజెక్టు గేట్లు అమర్చకపోవడంతో వరద నృసింహుల పల్లెలోకి వచ్చి చేరుతోందని గ్రామస్థులు తెలిపారు. గ్రామంలోకి వరద ఉధృతి మరింత పెరగకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.