అర్థరాత్రి ఆగమాగం… బయట వాన… ఇండ్లలో నీరు…

స్మార్ట్ సిటీ సొగసు చూడతరమా..?

దిశ దశ, కరీంనగర్:

స్మార్ట్ సిటీగా అభివృద్ది చేశామని చెప్పుకుంటున్నా కరీంనగర్ వాసుల కష్టాలు మాత్రం తీరడం లేదు. నగర అందాలను చూపిస్తూ మైమరిపిస్తున్నా… వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు విరుద్దంగానే కనిపిస్తున్నాయి.  నగరం నడిబొడ్డున ఉన్న ఇండ్లలోకి చిన్నపాటి వర్షానికి వరద నీరు వచ్చి చేరితే శివారు ప్రాంతాల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ముకరంపుర, మంకమ్మతోట పరిసర ప్రాంతాల వాసులు బుధవారం కంటి మీద కునుకు లేకుండా జాగారం చేయాల్సి వచ్చింది. బుధవారం సాయంత్రం నుండి మొదలైన వర్షం తెల్లవారు జాము వరకూ కొనసాగింది. దీంతో డ్రైనేజీల నుండి దిగువ ప్రాంతాలకు వెల్లిపోవల్సిన వరద నీరు నేరుగా నివాస గృహాల్లోకి వచ్చి చేరింది. ఏటా వర్షాకాలంలో ఇదే పరిస్థితి నెలకొంటోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద నీరు ఇండ్లలోకి రావడంతో సామాన్లను సర్దుకుని వరద నీరు తగ్గు ముఖం పట్టే వరకూ కాలం వెల్లదీశారు స్థానికులు. నగర వాసులు వినియోగించే నీటితో పాటు వర్షాల వల్ల వచ్చే నీరు సాఫీగా దిగువ ప్రాంతాలకు వెల్లేందుకు అవసరమైన చర్యలు తీసుకోవల్సి ఉంటుంది. ఇందుకు అనుగుణంగానే నిర్మాణాలు డిజైన్ చేయాల్సి ఉంటుంది. కానీ కరీంనగరంలో మాత్రం వరద నీరు ఇండ్లలోకి చొచ్చుక వస్తోందంటే అసలు కారణాలు ఏంటన్న విషయాన్ని బల్దియా యంత్రాంగం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.


You cannot copy content of this page