దిశ దశ, వరంగల్:
మావోయిస్టుల ఏరివేత కోసం అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న బలగాలు వరదల కారణంగా సరిహద్దుల్లో చిక్కుకపోయాయి. దాదాపు ఐధు రోజుల క్రితం నక్సల్స్ ఏరివేత కోసం తెలంగాణాకు చెందిన గ్రే హౌండ్స్ బలగాలు కాలినడకన సెర్చింగ్ ఆపరేషన్ చేసేందుకు బార్డర్ ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్లాయి. ఈ క్రమంలో భారీ వర్షాలు ప్రారంభం కావడంతో వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లాయి. దీంతో అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న గ్రే హౌండ్స్ బలగాలు సరిహధ్దు అడవుల్లో చిక్కుకపోయాయి. ఓ వైపున వర్షం… మరో వైపున బరదమయమైన అడవుల్లో కాలినడకన మైళ్ల కొద్ది నడుచుకుంటూ ప్రయాణించిన బలగాలు స్టేఫ్టీ జోన్ కు చేరుకోవాలని ప్రయత్నించినప్పటికీ సఫలం కాలేకపోయాయి. ములుగు జిల్లా వాజేడు ఏరియాలోని ఎలిమిడి అడవుల్లో కూంబింగ్ ఆపరేషన్ చేపట్టిన బలగాలు భారీ వర్షాలను గమనించి వెనుదిరిగాయి. అయితే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు మార్గమధ్యలోని పెనుగోలు వాగు ఉధృతంగా ప్రవహించడంతో గమ్యానికి చేరుకోలేకపోయారు. ఈ సమాచారం అందుకున్న పోలీసు ఉన్నతాధికారులు వీరిని వాగును దాటించేందుకు హెలిక్యాప్టర్ ను రంగంలోకి దింపారు. సోమవారం మద్యాహ్నం హెలిక్యాప్టర్ ద్వారా గ్రే హౌండ్స్ బలగాలను క్షేమంగా బయటకు తీసుకరావడంలో పోలీసు అధికారుల సక్సెస్ అయ్యారు.
అస్వస్థత…
భారీ వర్షాలతో పాటు అటవీ ప్రాంతం అంతా కూడా జలమయం కావడంతో కూంబింగ్ కోసం వెల్లిన బలగాల్లో కొంతమంది అస్వస్థతకు గురైనట్టుగా తెలుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తోడు బురదగా మారిన అటవీ ప్రాంతంలో షూ కూడా మార్చుకునే పరిస్థితి లేకుండా పోయింది. నీరంతా షూస్ లో చేరడంతో కొంతమంది పాదాలు చెడిపోయినట్టుగా తెలుస్తోంది. కనీసం నడిచే పరిస్థితి కూడా లేకుండా ఉన్న వారిని ఎత్తుకుని మరీ హెలిక్యాప్టర్ ఎక్కించడంతో పాటు సేఫ్ జోన్ కు చేరుకున్న తరువాత కూడా దించాల్సి వచ్చింది. వాజేడు మండలం మండపాక గ్రామం వరకు హెలిక్యాప్టర్ లో తరలించిన తరువాత అక్కడి నుండి ప్రత్యేక వాహనాల్లో గ్రే హౌండ్స్ పోలీసులను ములుగు జిల్లా కేంద్రానికి తరలించారు. వాతావరణంలో వచ్చిన మార్పుల ప్రభావంతో కూడా మరికొంతమంది అనారోగ్యం బారినపడినట్టుగా తెలుస్తోంది.