యువ శాస్త్రవేత్తను బలితీసుకున్న వరదలు…

దిశ దశ, వరంగల్:

చత్తీస్ గడ్ రాయ్ పూర్ కు వెల్తున్న ఆమెను వరదలు విగతజీవిగా మార్చాయి… యువ శాస్త్రవేత్తగా ఎన్నో అద్భుతాలు చేయాలని కలలు కన్న ఆమెను ప్రకృతి కబళించింది… చదువుల్లో బంగారు పతకాలు పొందిన బంగారు తల్లిని ఆకేరు వాగు బలి తీసుకుంది. హృదయ విదారకంగా జరిగిన ఈ ఘటన తెలంగాణ రాష్ట్రాన్నే కలిచివేసింది. ప్రాణాలతో బతికి ఉంటుందని.. తిరిగి తమ ముందు కనిపిస్తుందన్న ఆమె కుటుంబ సభ్యుల ఆశలన్ని అడియాశలయ్యాయి. చివరి శ్వాస వదిలిన ఆ శాస్త్రవేత్త మృత్యువు తన కౌగిట బంధించిందని తెలిసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఖమ్మం జిల్లా కారెపల్లి గంగారం తండాకు చెందిన నూనావత్ అశ్విని, ఆమె తండ్రి మోతిలాల్ లు ఆదివారం ఉదయం కారులో బయలు దేరారు. న్యూ ఢిల్లీలో సెంటిస్ట్ గా పనిచేస్తున్న అశ్విని రాయిపూర్ లో జరగనున్న కాన్ఫరెన్స్ కు హాజరయ్యేందుకు వెల్తున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమానం ఎక్కించేందుకు తండ్రి కూడా ఆమె వెంట బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని పురుషోత్తమాయగూడెం సమీపంలోని ఆకేరు వాగు వరద నీటిలో చిక్కుకుంది. ఉధృతి వల్ల కారు కొట్టుకపోవడంతో గల్లంతయ్యారు తండ్రి, కూతుర్లు. అశ్వరావుపేట కాలేజీలో బీఎస్సీ అగ్రికల్చర్ డిగ్రీ చేసిన అశ్విని, పీజీ పూర్తి చేసి పీహెచ్డీ చేస్తున్నారు. డిగ్రీ, పీజీల్లో గోల్డె మెడల్స్ సాధించిన అశ్విని జాతీయ స్ధాయి వ్యవసాయ శాస్త్రవేత్తల రిక్రూట్ మెంట్ బోర్డు పరీక్షల్లో మొదటి స్థానంలో నిలిచారు. జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్ లో శాస్త్రవేత్తగా ఎంపికయ్యారు. ప్రస్తుతం ఇక్రిశాట్ లో పీహెచ్డీ పరిశోధనలు చేస్తున్నారు. అయితే ఆదివారం ఉదయం ఆకేరు వాగులో గల్లంతయిన అశ్విని మృతదేహం వంతెనకు కొద్ది దూరంలో లభ్యం అయింది. ఆమె తండ్రి మోతిలాల్ ఆచూకి కోసం ఇంకా గాలిస్తున్నారు.

అవే చివరి మాటలు…

కొద్దిసేపటి క్రితమే ఇంటి నుండి బయలు దేరిన కూతురును సాగనంపిన ఆ తల్లి తన బిడ్డ ఎక్కడకు చేరుకుందోనని అనుకుంటున్న క్రమంలో ఫోన్ మోగింది. ఫోన్ రిసివ్ చేసుకున్న అశ్విని తల్లి హతాశురాలు అయింది. ‘‘అమ్మా నేను నాన్న కారులో వెల్తుంటే వరద ఉధృతిలో చిక్కుకపోయాం… మెడలోతు వరకు నీళ్లలో చిక్కుకున్నాం’’ అంటూ చెప్పిన వెంటనే ఫోన్  స్విచ్ఛాప్ అయింది. తన కూతురు పరిశోధనల్లో ప్రతిభా చూపుతుందని   కలలు కన్న ఆ తల్లి …బిడ్డ నుండి వచ్చిన ఫోన్ లో సమాచారం విన్న తరువాత కన్నీరుమున్నీరుగా విలపించింది. తన భర్త కూడా అదే కారులో చిక్కుకోవడం… ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని ఆశించిన బిడ్డ ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టు ఫోన్ చేసి చెప్పడంతో అశ్విని తల్లి ఓ వైపున రోధిస్తూనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది.

You cannot copy content of this page