పాడి… పంట… వరద పాలు…

మోరంచ వాసుల కన్నీటి వ్యథ

దిశ దశ, భూపాలపల్లి:

జల ప్రళయంలో చిక్కుకున్న మోరంచపల్లి శ్మశాన వైరాగ్యాన్ని తలపిస్తోంది. వరదల్లో కొట్టుకపోయిన పంటలు.. చనిపోయిన పశువులతో గ్రామం మూగబోయింది. గాఢ నిద్రలో ఉన్న ఊరిని కబలించిన తీరు చూసిన ప్రతి ఒక్కరూ కంటి తడి పెట్టుకుంటున్నారు. నమ్ముకున్న ప్రకృతే నట్టేట ముంచడంతో విషాదంలో కొట్టుమిట్టాడుతోందా పల్లె. దిక్కులు పిక్కటిల్లేలా రోధిస్తున్న ఆ గ్రామస్థులను ఓదార్చే సాహసం చేయలేని పరిస్థితి నెలకొంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోరంచపల్లిని నిండా ముంచిన వరదలు తగ్గు ముఖం పట్టడంతో గ్రామంలో అడుగు పెట్టిన ప్రతి ఒక్కరూ చలించిపోచే పరిస్థితులే కనిపిస్తున్నాయి. బుధవారం రాత్రి నింపాదిగా నిద్రలోకి జారుకున్న పల్లెను చుట్టుముట్టిన వరదలు భయకంపితులను చేశాయి. వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్న ఈ గ్రామస్థులు పాడి పంటలతోనే అనుబంధం పెనవేసుకుని జీవనం సాగిస్తున్నారు. సేద్యంలో మెలుకవలు నేర్చుకుని నాణ్యమైన పంటలను అందించే ఆ రైతన్నలను వరదలు అన్యాయం చేశాయంటూ గ్రామాన్ని చూసిన వారంతా కన్నీరు కారుస్తున్నారు. పాకలో కట్టేసిన పశువులు వరదలో చిక్కుకుని విలవిలలాడి అక్కడే పడి చనిపోయాయి.

మిగిలింది శూన్యం…

తెల్లవారుజాము నుండి వచ్చిన వరదలు దాదాపు 12 గంటలకు పైగా గ్రామాన్ని ముంచెత్తాయి. తగ్గు ముఖం పట్టిన తరువాత గమనిస్తే గ్రామస్థుల ఇండ్లలో మిగిలింది వరద బురదే తప్ప మరేమి లేదు. దుస్తులు, ధాన్యం, విత్తనాలు, ఎరువులు, బంగారం ఇలా ఒక్కటేమిటి అన్నింటిని ఊడ్చేసుకుని పోయాయి వరదలు. అన్ని పోయాయి… మేముండి ఏం చేస్తామంటూ ఆ పల్లె జనం ఏడుస్తున్న తీరు ప్రతి గుండెను కదిలిస్తోంది. ఆర్ సి సి భవనాలు తప్ప… సాధారణ ఇండ్లు కొన్ని వరదల ధాటికి నేలకూలడంతో కొంతమందికి నిలువ నీడ కూడా లేకుండా పోయింది. వరద మిగిల్చిన విషాదపు ఆనవాళ్లను తొలగించుకోవాలంటే రోజుల తరబడి శ్రమించక తప్పని పరిస్థితి తయారైంది మోరంచపల్లి వాసులకు.

కన్నీరు మున్నీరుగా…

గ్రామంలోని మహిళల పరిస్థితి అయితే మరీ దయనీయంగా మారిపోయింది. ప్రకృతి బీభత్సం వల్ల కలిగిన నష్టాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామ స్థితి గతులను పరిశీలించేందుకు వచ్చిన ఎమ్మెల్యే గండ్ర రమణారెడ్డి, జడ్పీ ఛైర్ పర్సన్ జ్యోతి రెడ్డిల ముందు మోరంచపల్లి ఆడ బిడ్డలు ఏడుస్తున్న తీరు ప్రతి ఒక్కరిని కదలించివేస్తోంది. శుక్రవారం గ్రామాన్ని సందర్శించేందుకు వెల్లిన గండ్ర దంపతుల చేతులు పట్టుకుని విలపిస్తున్న గ్రామ మహిళలను ఓదర్చడం ఎవరి తరమూ కావడం లేదు.

కొట్టుకపోయిన వంతెన

మోరంచపల్లి వాగు వరద ఉధృతిలో జాతీయ రహదారిపై వేసిన వంతెన కూడా కొట్టుకపోయింది. కొంత భాగం రోడ్డు కూడా దెబ్బతిన్నది. దీంతో భూపాలపల్లి, పరకాల రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు తాత్కాలికంగా మరమ్మత్తులు చేస్తున్నప్పటికీ భారీ వాహనాలు మాత్రం వెంటనే నడిచే అవకాశం కనిపించడం లేదు. నేషనల్ హైవే అథారిటీ అధికారులు యుద్ద ప్రాతిపాదికన ఇక్కడ పనులు చేపట్టినట్టయితే ఈ అంతరాష్ట్ర రహదారిపై రాకపోకలు పునరుద్దరించే అవకాశాలు ఉన్నాయి.

You cannot copy content of this page