Vemulawad: అన్న సత్రం టార్గెట్ రూ. 100 కోట్లు: మంత్రి పొన్నం ప్రభాకర్

దిశ దశ, వేములవాడ:

వేములవాడ రాజన్న క్షేత్రంలో నిత్యాన్న దానం కోసం రూ. 100 కోట్లు సమీకరించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. శ్రీ రాజ రాజేశ్వర స్వామి ఆలయంలో ఆరుద్ర నక్షత్ర సోమవారి పౌర్ణమి పురస్కరించుకుని మంత్రి పొన్నంతో పాటు ప్రభుత్వ విప్ లు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ… నిత్యాన్న సత్రం కోసం రూ. 35  కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని, రూ. 20 కోట్లు సమీకరించడం జరిగిందన్నారు. మరో రూ. 80 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో జిల్లాలోని ప్రజా ప్రతినిధులు ముందుకు సాగాల్సి ఉందన్నారు. రాజన్న క్షేత్రంలో నిత్యం అన్నదానం చేయాలని కృత నిశ్చయంతో ఉన్నామని మంత్రి అన్నారు. హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన డోనర్లను కూడా కలిసి అన్న సత్రం కోసం నిధులను సమీకరించే పనిలో నిమగ్నం అవుతామన్నారు. శ్రీశైలం మాదిరిగా మ్యూజికల్ ఫౌంటెన్ ఏర్పాటు, వేములవాడ నుండి ఏసీ బస్సును ప్రారంభించాలని భావిస్తున్నామన్నారు. దాతలు కూడా తమకు చేతనైనట్టుగా బియ్యం, కూరగాయలు, నిత్యవసరాలు కూడా అందించాలని, డబ్బులు ఇవ్వాలనుకునే వారు బ్యాంకు ద్వారా చెల్లించవచ్చన్నారు.

డబ్బులు పెట్టి… 

వీఐపీ ప్రోటోకాల్ ద్వారా ఉచితంగా రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ మంత్రి పొన్నం ప్రభాకర్, విప్ లు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లు సోమవారం డబ్బులు చెల్లించి టికెట్లు కొనుగోలు చేశారు. రాజన్న ఆలయంలో కొడె మొక్కుతో పాటు అభిషేకం టికెట్లు కొనుగోలు చేశామని మంత్రి ప్రకటించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో మాదిరగా వేములవాడలో కూడా వీఐపీ బ్రేక్ దర్శనాల కోసం టికెట్ కొనుగోలు చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.

అన్నదానం కోసం…

మంత్రి పొన్నం ప్రభాకర్ తన కుటుంబ సభ్యుల తరుపున రూ. 40 లక్షల రూపాయలు వేములవాడ రాజన్న నిత్యన్న దానం కోసం వితరణ చేస్తున్నట్టుగా ప్రకటించారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రూ. 10 లక్షలు ఇస్తున్నట్టుగా ప్రకటించారు. 

You cannot copy content of this page