దండకారణ్యంలో మహిళా ఫైటర్స్ ఎంట్రీ
అసెంబ్లీ ఎన్నికల్లో నక్సల్ కట్టడిలో కీలక పాత్ర
దిశ దశ, దండకారణ్యం:
ఆయా రాష్ట్రాల్లో మావోయిస్టుల ఏరివేత కోసం ఇప్పటి వరకు మెన్ ఫోర్స్ తో మాత్రమే భద్రతా చర్యలు చేపట్టారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆ కీకారణ్యంలో మహిళా కమెండోలు కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. అయితే తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు అక్కడి పోలీసు అధికారులు. అసెంబ్లీ ఎన్నికల్లో వీరిచే నక్సల్స్ కార్యకలాపాలు కట్టడి చేయాలని భావిస్తున్నారు.
మహిళా కమెండోలు…
మావోయిస్టు పార్టీ తిరుగులేని పట్టు సాధించుకున్న దండకారణ్యంలో వివిధ రకాలుగా బలగాలు భద్రతా చర్యలు చేపట్టాయి. కేంద్ర పారా మిలటరీ బలగాలతో పాటు స్థానిక పోలీసులు కీలక భూమిక పోషిస్తుండగా ఇటీవలె బస్తర్ ఫైటర్స్ ను కూడా తీర్చిదిద్ది రంగంలోకి దింపారు బస్తర్ పూర్వ జిల్లా పోలీసు ఉన్నతాధికారులు. వీరికి తోడుగా మహిళా కమెండోలను కూడా సుశిక్షుతులుగా తీర్చిదిద్ది మావోయిస్టుల ఏరివేత కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే వీరిచే ఈ సారి అసెంబ్లీ ఎన్నికల డ్యూటీ చేయించాలని కూడా నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా మహిళా కమెండోలకు ప్రత్యేకంగా తర్పీదు ఇచ్చిన బస్తర్ పోలీసు బాసులు పోలింగ్ ప్రక్రియ సాఫీగా జరిపించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసే పనిలో నిమగ్నం అయ్యారు. మరి కొద్ది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నాయన్న సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో బస్తర్ ఐజీ సుందర్ రాజ్ మహిళా శక్తిని తయారు చేశామని ప్రకటన చేయడం గమనార్హం. సుమారు వెయ్యి మంది మహిళా కమెండోలచే ఈసారి ఎన్నికల బందోబస్తు నిర్వహించేందుకు బస్తర్ ఐజీ కార్యాచరణ రూపొందించారు. బస్తర్ ఉమ్మడి జల్లాకు చెందిన మహిళలను మాత్రమే కమెండోలుగా ఎంపిక చేసి వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చింది చత్తీస్ గడ్ పోలీసు యంత్రాంగం. దంతెవాడ జిల్లాలో అక్కడి ప్రజలు అత్యంత భక్తి శ్రద్దలతో పూజించుకునే దంతేశ్వరీ మాతకు ప్రతిరూపాలుగా తీర్చిదిద్దామన్న భావనతో దంతేశ్వరీ ఫైటర్స్, అని సుక్మా జిల్లాలో దుర్గా ఫైటర్స్ అని పేరు కూడా పెట్టారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బస్తర్ అటవీ ప్రాంతానికి చెందిన వీరికి ఇక్కడి అటవీ ప్రాంతంపై సంపూర్ణ అవగాహన ఉంటుందన్న ఆలోచనతో పోలీసు అధికారులు ఈ ప్రాంతంలోని వారి కోసమే ప్రత్యేకంగా ఫైటర్స్ పేరిట రిక్రూట్ మెంట్ చర్యలు చేపట్టారు.
హైదరాబాద్ లో శిక్షణ…
నక్సల్స్ ఏరివేత కార్యకలాపాల్లో తెలంగాణ పోలీసులకు ప్రత్యేక గుర్తింపు ఉంది. 1980వ దశాబ్దం నుండి ఉత్తర తెలంగాణాలోని వరంగల్ జోన్ పరిధిలో గల వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల పోలీసులు నక్సల్స్ కార్యకలాపాలను ప్రత్యక్ష్యంగా చూశారు. మందుపాతరలు, క్లైమోర్ మైన్లు పేల్చడం, పోలీసులే లక్ష్యంగా నక్సల్స్ చేపట్టిన దాడులు అన్నీ ఇన్ని కావు. ఓ వైపున టార్గెట్లను హతమార్చేందుకు ఆయుధాలతో కాల్పులు జరుపుతూ మరో వైపున కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్న పోలీసులను మట్టుబెట్టేందుకు వేసిన వ్యూహాలు అన్నీ ఇన్ని కావు. కావాలని కవ్వింపు చర్యలకు పాల్పడి కాపు కాసి పోలీసు బలగాలను హతమార్చిన సంఘటనలు సర్వ సాధారణమనే చెప్పవచ్చు. ఒక దశలో స్టేషన్ నుండి కానీ ఇంటి నుండి కానీ బయటకు వెల్లిన పోలీసులు తిరిగి క్షేమంగా ఇంటికి చేరే వరకూ గ్యారెంటీ లేని జీవనం సాగించారు. భార్య శ్రీమంతం రోజునే ప్రాణాలు కోల్పోయిన పోలీసులు కూడా ఉత్తర తెలంగాణా జిల్లాల్లో ఉన్నారంటే ఆ నాటి పరిస్థితులు ఎంత దయనీయంగా ఉండేవో అర్థం చేసుకోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో నక్సల్స్ ఏరివేత కోసం ప్రత్యేక చర్యలు తీసుకునే పనిలో అప్పటి పోలీసు అధికారులు నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా గ్రే హౌండ్స్ ను ఏర్పాటు చేసి యువతను రిక్రూట్ చేసుకున్నారు. వీరికి ఆర్మీ శిక్షణ ఇప్పించడంలో అప్పటి పోలీసు ఉన్నతాధికారులు స్పెషల్ సిలబస్ తయారు చేశారు. గుట్టల్లో ట్రెక్కింగ్ చేయడం నుండి మొదలు వాగులు వంకలు దాటడం, నక్సల్స్ మందుపాతరలను, డంపులను గుర్తించడంతో పాటు ఇలా అన్ని రకాల అంశాలపై సంపూర్ణ శిక్షణ ఇచ్చారు. ఒక దశలో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కొత్తగా రిక్రూట్ అయ్యే పోలీసుల్లో చురుగ్గా ఉన్నవారిని ఖచ్చితంగా గ్రేహౌండ్స్ లో నియమించుకోవడంతో పాటు జిల్లాలకు అలాట్ అయిన తరువాత కూడా కొంతకాలం నక్సల్స్ ఏరివేత ఆపరేషన్లలో పనిచేయాలన్న ఖచ్చితమైన నిభందనలు పెట్టారు. శిక్షణ ముగించుకుని జిల్లాలకు చేరుకున్న కానిస్టేబుళ్లచే విధిగా డిస్ట్రిక్ట్ గార్డ్ డ్యూటీ చేయించే వారు. వీరు రోజుల తరబడి ఆహారం జోలికి వెళ్లకుండా కూడా ఉండేందుకు అవసరమైన ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. ఉత్తర తెలంగాణ పోలీసు అధికారులు ఈ విదానంతో సక్సెస్ కావడంతో సరిగ్గా ఇలాంటి శిక్షణే బస్తర్ మహిళా ఫైటర్స్ కు హైదరాబాద్ లో ప్రత్యేకంగా ఇప్పించినట్టుగా తెలుస్తోంది.
ముల్లును ముల్లుతోనే…
అయితే చత్తీస్ గడ్ పోలీసు అధికారులు దండాకరణ్యంలో మావోయిస్టుల ఎత్తులకు పై ఎత్తులు వేసే ప్రక్రియలో శ్రీకారం చుట్టారు. ఇంతకాలం ఇతర ప్రాంతాల నుండి వచ్చిన బలగాలను మట్టుబెట్టుతుండడంతో ప్రభుత్వంపై పైచేయి సాధించుకున్నామని మావోయిస్టులు ఆదివాసీలకు గొప్పగా చెప్పుకుంటున్నారు. రెండున్నర దశాబ్దాలకు పైగా బస్తర్ అడవి బిడ్డలతో మమేకమైన మావోయిస్టులు చెప్తున్నదే నిజమని నమ్ముతున్నందున ఇందుకు విరుగుడు కనిపెట్టాలని భావించిన పోలీసు అధికారులు ముల్లును ముల్లుతోనే తీయాలి… వజ్రాన్ని వజ్రంతోనే కోయాలన్న నానుడిని చేతల్లో చూపిస్తున్నట్టుగా ఉంది. బస్తర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ఏరివేత కోసం కేంద్ర పారామిలటరీ బలగాలే కాకుండా స్థానిక యువత భాగస్వామ్యం కూడా అవసరమని గుర్తించింది. ఇందుకోసం మొదట్లో కొంతమందిని రిక్రూట్ చేసుకున్నప్పటికీ అనుకున్నమేర సఫలం కాలేకపోయారు పోలీసు అధికారులు. దీంతో బస్తర్ ప్రాంతంలోని వారిని పెద్ద ఎత్తున నియామకం చేసుకుని రంగంలోకి దింపినట్టయితే ఇక్కడి అటవీ ప్రాంతంపై సంపూర్ణ అవగాహనతో వారు ఏరివేతలో సఫలం అవుతారని భావించారు. అంతేకాకుండా ఈ ప్రాంతానికి చెందిన వారిని మావోయిస్టులు మట్టుబెట్టినట్టయితే ఆ ప్రాంతంలోని ఆదివాసీల్లో తమవారిని హతమార్చారన్న ఆగ్రహం వ్యక్తం అయ్యేఅవకాశాలు ఉన్నాయి. దీంతో మావోయిస్టులపై వ్యతిరేకత మొదలయినట్టయితే వారికి సహాయ నిరాకరణ స్టార్ట్ అవుతుందని దీనివల్ల మావోయిస్టుల కార్యకలాపాలు క్రమక్రమంగా తగ్గిపోతాయని అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా ఉపాధి లేకుండా ఉన్న యువత కూడా తమ కుటుంబాలను పోషించేందుకు బస్తర్ ఫైటర్స్ వైపు అడుగులు వేసినట్టయితే మావోయిస్టు పార్టీ రిక్రూట్ మెంట్ కూడా గణనీయంగా తగ్గిపోతుందని కూడా భావిస్తున్నారు. ఏది ఏమైనా ఈ సారి మాత్రం బస్తర్ పోలీసు అధికారులు మహిళా కమెండోలచే ఎన్నికల బందోబస్తు నిర్వహించాలని నిర్ణయించడం మాత్రం సంచలనంగా మారింది.