రాష్ట్రంలో లొంగిపోయేందుకు ముందుకు వస్తున్న మావోయిస్టులు
మల్టీజోన్ -1 పోలీసుల స్పెషల్ ఎఫర్ట్స్…
దిశ దశ, వరంగల్:
చత్తీస్ గడ్ లోని దండకారణ్యంలో మావోయిస్టుల ఏరివేత యుద్ద వాతావరణాన్ని తలపిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది మార్చి నాటికల్లా మావోయిస్టులను అంతమొందించాలన్న లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆపరేషన్ కగార్ ప్రారంభించాయి. ఈ నేఫథ్యంలో బస్తర్, మాఢ్, ఒడిషాలోని మల్కాన్ గిరి, ఝార్ఖండ్ లోని ప్రభావితా ప్రాంతాల్లో బలగాలు నిర్విరామంగా సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు గణనీయంగా తగ్గిపోగా ఇటీవల కాలంలో జరిగిన వేర్వేరు ఎన్ కౌంటర్లలో పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఇద్దరితో సహా పలువురు ముఖ్య నాయకులు చనిపోయారు. మావోయిస్టుల కోసం సరిహధ్దు అటవీ ప్రాంతాల్లో బలగాలు వేట కొనసాగిస్తున్న తీరుతో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో చత్తీస్ గడ్ రాష్ట్రంలో పని చేస్తున్న అజ్ఞాత నక్సల్స్ అడవులు వీడి జనజీవనంలో కలిసేందుకు ముందుకు వస్తున్నారు. అయితే వీరిలో ఎక్కువ శాతం మంది లొంగిపోయేందుకు తెలంగాణ వైపు అడుగులు వేస్తుండడం విశేషం.
14 మంది లొంగుబాటు…
తాజాగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో నిర్వహించిన లొంగుబాటు మేళాలో 14 మంది చత్తీస్ గడ్ క్యాడర్ కు చెందిన మావోయిస్టులు లొంగిపోయారు. మల్టీజోన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డితో పాటు వరంగల్ కమిషనరేట్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల పోలీసు అధికారుల ముందు లొంగిపోయారు. AOBSZC రాష్ట్ర కమిటీ పరిధిలోని గాలికొండ ACM మాడావి ఆంద అలియాస్ రాజేష్, కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ ఉదయ్ ప్రొటెక్షన్ టీంలో పనిచేసిన సోడియం కోసి, వివిధ డివిజన్ కమిటీల్లో సభ్యులుగా పనిచేసిన మరుకం హిడుమే, మడుకం జోగి అలియాస్ కోవాసి జోగి, పోడియం భూమిక అలియాస్ సోడి కోసి అలియాస్ వెన్నెల, సోడి భద్రి అలియాస్ భద్రి, మడవి పూజే, హేమ్లా సోనూ, సోడి రమేష్ అలియాస్ భీమా మిలీషియా సభ్యులు అట్టం భద్ర, కోవాసి ఇడుమ, కోర్సా లాలు, హేమ్లా సుక్కు అలియాస్ అర్జున్, కోర్సా సుక్కులు లొంగిపోయారి. వీరందరికి సత్వర సాయం కింది రూ. 25 వేల చొప్పున సాయం అందించిన ఐజీ వీరిపై ఉన్న రివార్డులను 24 గంటల్లోగా అందించేందుకు చొరవ తీసుకుంటున్నామని ప్రకటించారు. ప్రధానంగా మల్టీజోన్ పరిధిలోని ఆయా కమిషనరేట్లు, జిల్లాల్లో మావోయిస్టుల లొంగుబాటు కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని వెళ్లడించారు. ‘‘పోరు కన్న ఊరు మిన్న’’, మన ఊరికి తిరిగి రండి, ఆపరేషన్ చేయూత పేరిట లొంగుబాట్లను ప్రొత్సహించేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నామని ఐజీ చంద్రశేఖర్ రెడ్డి వివరించారు. దేశంలోనే అత్యున్నతమైన సరెండర్ పాలసీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే అమలు చేస్తున్నందున ఇతర రాష్ట్రాలకు చెందిన నక్సల్స్ లొంగిపోయేందుకు ఇక్కడకు వస్తున్నారన్నారు. లొంగిపోయిన వారికి పునరావసం కల్పించడమే కాకుండా అనారోగ్యానికి గురైన వారికి చికిత్స అందించేందుకు కూడా చొరవ తీసుకుంటున్నామని ఐజీ తెలిపారు.
250 మంది…
తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టుల ఉనికి నామమాత్రంగానే ఉన్నప్పటికీ లొంగుబాట్ల పరంపరం మాత్రం కొనసాగుతూనే ఉంది. ఈ ఏడాది జనవరి నుండి ఇప్పటి వరకు తెలంగాణ పోలీసుల ముందు 250 మంది మావోయిస్టు పార్టీ శ్రేణులు సరెండర్ కావడం విశేషం. వీరిలో ఒక రాష్ట్ర కమిటీ సభ్యురాలు ఉండగా 12 మంది నక్సల్స్ ను అరెస్ట్ చేశారు సరిహద్దు జిల్లాల పోలీసు అధికారులు. వీరిలో చాలా మంది కూడా చత్తీస్ గడ్ రాష్ట్రానకి చెందిన వారే ఉండడం గమనార్హం. 2024 నుండి ఇప్పటి వరకు రాష్ట్రంలో జరిగిన ఎదురు కాల్పుల ఘటనల్లో 18 మంది నక్సల్స్ మరణించగా, వీరిలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నారు.