దిశ దశ, దండకారణ్యం:
ఓ వైపున అమర వీరుల వారోత్సవాలు… మరో వైపున ఎన్ కౌంటర్ కు నిరసనగా బంద్ పిలుపు నేపథ్యంలో చత్తీస్ గడ్ దండకారణ్య అటవీ ప్రాంతం బలగాలు, మావోయిస్టులు ఎత్తులు పైఎత్తులతో అట్టుడికిపోతోంది. నక్సల్స్ పిలుపు నేఫథ్యంలో దండకారణ్య అటవీ ప్రాంతంలో బలగాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. మావోయిస్టుల కార్యకలాపాలను నిలవురించడమే లక్ష్యంగా పెద్ద ఎత్తున కూంబింగ్ ఆఫరేషన్ నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బలగాలను మట్టుబెట్టడమే లక్ష్యంగా నక్సల్స్ కూడా దాడులు చేసేందుకు సమాయత్తం అవుతున్నారు. తాజాగా బీజాపూర్ జిల్లా కుట్రు, బెద్రే రహదారిలోని అంబేలి కల్వర్టు సమీపంలో మావోయిస్టులు మందుపాతర అమర్చారు. అయితే కూంబింగ్ పార్టీలు, సామాన్యులు తరుచూ రాకపోకలు సాగించే ప్రాంతాల్లో మావోయిస్టులు మందుపాతరలు అమర్చే ప్రమాదం ఉందని అప్రమత్తం అయిన జిల్లా పోలీసు అధికారులు డిస్ట్రిక్ట్ రిజర్వూ గార్డ్స్ (డీఆర్జీ) బాంబ్ డిఫ్యూజ్ స్క్వాడ్, (బీడీఎస్) బలగాలను రంగంలోకి దింపాయి. రహదారిని క్షుణ్ణంగా తనిఖీ చేసుకుంటూ వెల్తున్న ఈ పార్టీలు కుట్రు, బెద్రేలోని అంబేలి వాగుపై నిర్మించిన వంతెన సమీపంలో మందుపాతరను గుర్తించారు. బీజాపూర్ బీడీఎస్ బృందం మందుపాతరను నిర్వీర్యం చేయడంతో సెర్చింగ్ ఆపరేషన్ లో పాల్గొంటున్న బలగాలు సేఫ్ అయ్యారు. కమాండ్ స్విచ్ సిస్టమ్ ద్వారా మందుపాతర అమర్చినట్టుగా పోలీసులు గుర్తించారు. డీఆర్జీ, బీడీఎస్ బలగాలు మందుపాతరను గుర్తించడంతో పెను ప్రమాదం తప్పినట్టయిందని జిల్లా పోలీసు వర్గాలు చెప్తున్నాయి.