దండకారణ్యంలో మావోయిస్టుల ఏరివేత
దిశ దశ, దండకారణ్యం:
బస్తర్ అటవీ ప్రాంతంలోకి బలగాలు చొచ్చుకు పోతున్న నేపథ్యంలో మావోయిస్టు పార్టీ కీలక నాయకత్వం సేఫ్టీ జోన్ వైపు అడుగులు వేస్తోంది. ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించినప్పుడు నక్సల్స్ రహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు బలగాలు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఒకప్పుడు అటవీ ప్రాంతం వైపు వెళ్లడానికే వెనకడుగు వేసిన బలగాలు బస్తర్ ఫారెస్ట్ ఏరియాలో పెద్ద ఎత్తున బేస్ క్యాంపులను ఏర్పాటు చేశాయి. బస్తర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా బలగాలు మోహరించి మావోయిస్టులను ఏరివేసే దిశగా గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. ఇటీవల కాలంలో నిర్భందం కూడా తీవ్ర రూపం దాల్చడంతో సేఫ్టీ జోన్ గా భావించిన బస్తర్ ప్రాంతాన్ని వదిలిపెట్టక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో వేలాది మంది జవాన్లు చెట్లు, గుట్టలు ఇలా అన్ని ప్రాంతాలను గాలిస్తూ మావోయిస్టులను కట్టడి చేస్తున్నారు.
కీకారణ్యాల్లోనూ…
బలగాల ఒత్తిళ్లు తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో మావోయిస్టులు కొత్త షెల్టర్ జోన్లను ఎంచుకోక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. కీకారణ్యాలుగా ఉన్న నారాయణపూర్, దంతెవాడ సరిహద్దు ప్రాంతాల్లో షెల్టర్ తీసుకున్నప్పటికీ అక్కడికి కూడా బలగాలు చొచ్చుకపోతున్నాయి. ఈ ప్రాంతంలో ఆపరేషన్ జలశక్తి పేరిట గతంలో పలు ఎన్ కౌంటర్లు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. వర్షాకాలంతో పాటు వేసవి కాలంలో కూడా అడవులు దట్టంగా విస్తరించుకుని ఉన్నప్పటికీ బలగాల నక్సల్స్ షెల్టర్ జోన్లను గుర్తించి ఏరివేత చేపడుతున్నాయి. బస్తర్, దంతెవాడ, బీజాపూర్ కాంకేర్, నారాయణపూర్ తో పాటు మిగతా అటవీ ప్రాంతం అంతా కూడా బేస్ క్యాంపుల విస్తరించాయి. ఒకప్పుడు బేస్ క్యాంపులే లక్ష్యంగా మావోయిస్టులు దాడులు చేస్తే ఇప్పుడు మావోయిస్టుల షెల్టర్ జోన్లే లక్ష్యంగా బలగాలు కూంబింగ్ చేపడుతున్నాయి. గతంలో బలగాలపై పై చేయి సాధించిన నక్సల్స్ ఇప్పుడు వారి నుండి తప్పించుకునేందుకు వ్యూహ రచన చేయాల్సిన పరిస్థితి నెలకొంది. వందల సంఖ్యలో ఉన్న మావోయిస్టులను ఏరి వేసేందుకు వేల సంఖ్యలో జవాన్లు సెర్చింగ్ ఆఫరేషన్ నిర్వహిస్తుండడం మావోయిస్టుల కార్యకలాపాలకు ఎక్కడికక్కడ కట్టడి చేసుకోవల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
సరిహద్దుల వైపు…
మావోయిస్టు పార్టీ నక్సల్స్ బలగాల కంట పడకుండా ఉండేందుకు సేఫ్టీ జోన్లను అన్వేషించుకోవల్సిన పరిస్థితి తయారైంది. దీంతో బస్తర్ పూర్వ జిల్లాలోని అటవీ ప్రాంతాలకంటే సరిహద్దు ప్రాంతాలే సేఫ్ అని భావించి కేంద్ర కమిటీతో సహా ముఖ్య నాయకత్వం ఆయా రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలను ఎంచుకున్నటుగా స్ఫష్టం అవుతోంది. తెలంగాణ, చత్తీస్ గడ్ సరిహధ్దుల్లోని పూజారి కంకేర్, కర్రి గుట్టల్లో మావోయిస్టు నాయకత్వం డెన్ లను ఏర్పాటు చేసుకుంది. అయితే తెలంగాణ వైపు నుండి బలగాలు చొచ్చుకవచ్చినట్టయితే వారిని ఎక్కడికక్కడ కట్టడి చేసేందుకు అటవీ ప్రాంతంలో బూబిట్రాప్స్ తో పాటు బాటిల్ బాంబ్స్, ల్యాండ్ మైన్స్ ను ఏర్పాటు చేశాయి. అయితే తెలంగాణ గ్రే హౌండ్స్ బలగాలు, సరిహధ్దు జిల్లాల పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండడంతో మావోయిస్టుల వ్యూహంలో చిక్కుకోక ముందే వాటిని గుర్తించారు. అయితే కర్రి గుట్టల్లో షెల్టర్ తీసుకుంటున్న మావోయిస్టులను ఏరివేసేందుకు తెలంగాణ బలగాలు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించి మావోయిస్టు నాయకుడు అన్నె సంతోష్ అలియాస్ సాగర్ ను ఎన్ కౌంటర్ చేశాయి. తాజాగా కర్రిగుట్టల సమీపంలోని పూజారి కాంకేర్ ఏరియాలో తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే దామోదర్ అలియాస్ చొక్కారావుతో పాటు మరికొంతమంది నక్సల్స్ షెల్టర్ తీసుకున్నారన్న సమాచారం అందుకున్న చత్తీస్ గడ్
బలగాలు ఆ ప్రాంతంలో సెర్చింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ సమాచారం అందుకున్న దామోదర్ అక్కడి నుండి వెల్లిపోయిన తరువాత బలగాలు అక్కడకు చేరుకున్నాయి. అయితే ఈ ప్రాంతంలో బంకర్ ను గుర్తించాయి బలగాలు. అక్కడ లేట్ మిషన్ తో పాటు ఇతరాత్ర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. మరో వైపున బీజాపూర్ జిల్లా బట్టిగూడలో ట్రైనింగ్ క్యాంపును గుర్తించిన బలగాలు అక్కడ చేపట్టిన నిర్మాణాలను ధ్వంసం చేశాయి.
ఒడిషా సరిహద్దుల్లో…
మరో వైపున ఒడిషా సరిహద్దుల్లో కూడా మావోయిస్టులు షెల్టర్ జోన్ ఏర్పాటు చేసుకున్నట్టుగా గుర్తించిన బలగాలు ఆ ప్రాంతంలో కూడా గాలింపు చర్యలకు శ్రీకారం చుట్టాయి. చత్తీస్ గడ్ లోని గరియాబంద్ జిల్లా కుల్హారిగుడా అటవీ ప్రాంతలో మావోయిస్టు కేంద్ర కమిటీ నాయకత్వం డెన్ ఏర్పాటు చేసుకున్నదని సమాచారం అందుకోగానే బలగాలు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఒడిసా, చత్తీస్ గడ్ రాష్ట్రాలకు చెందిన జవాన్లు రెండు రోజులకు పైగా కుల్హారిఘాట్ అడవుల్లో గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ ఘటనలో కేంద్ర కమిటీ సభ్యుడు చలపతితో పాటు 15 మంది మరణించినట్టు రాయ్ పూర్ ఐజీ ప్రకటించారు. అయితే ఈ ఘటనలో మొత్తం 27 మంది వరకు నక్సల్స్ చనిపోయారని ప్రచారం జరుగుతోంది. ఆ అటవీ ప్రాంతంలో కూంబింగ్ పార్టీలు ఇంకా గాలింపు చర్యలు చేపడుతూనే ఉన్నాయని మంగళవారం సాయంత్రం కూడా ఎదురు కాల్పులు జరిగినట్టుగా తెలుస్తోంది. ఆపరేషన్ కగార్ పేరిట నక్సల్స్ ఏరివేత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బలగాలు నక్సల్స్ ఏరివేత లక్ష్యంగా బస్తర్ పూర్వ జిల్లాలోని నలు దిక్కులుగా విస్తరించిన అటవీ ప్రాంతంతో పాటు ఆయా రాష్ట్రాల సరిహధ్దు అడవుల్లోనూ గాలింపు చర్యలు చేపడుతున్నాయి. దీంతో మావోయిస్టు నాయకత్వంతో పాటు క్యాడర్ మరింత సేఫ్టీ ఏరియాలను ఎంచుకోవల్సిన ఆవశ్యకత ఏర్పడింది.