రాష్ట్రంలో అటవీ శాఖ యంత్రాంగంపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అటవీ ఉద్యోగుల స్వీయ రక్షణ చర్యలతో పాటు అడవుల సంరక్షణ కోసం ప్రత్యేకంగా ఫారెస్ట్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆప్ ఫారెస్ట్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. రాష్ట్రంలో 30 పోలీస్ స్టేషన్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని, ఒక్కో స్టేషన్లో 18 మంది సిబ్బంది ఉండాలని ప్రతిపాదించారు. అయితే వీరికి ఎలాంటి ఆయుధాలు ఇవ్వాలి, వాటి వినియోగం తదితర అంశాలకు సంబందించిన విషయాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఇప్పుడు పంపించిన ప్రతిపాదనల మేరకు స్టేషన్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే మిగతా అంశాలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
జాయింట్ స్టేషన్లా..?
అయితే అటవీ శాఖ ఆద్వర్యంలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన ఫారెస్ట్ స్టేషన్లలో పోలీసు, ఫారెస్ట్ అధికారుల సమన్వయంతో సిబ్బంది నియామకం చేస్తారా లేక అటవీ అధికారులే వెపన్ ట్రైనింగ్ అవుతారా అన్నవిషయంపై ఇంకా చర్చలు సాగుతున్నట్టు సమాచారం. భద్రాద్రి జిల్లాలో రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ రావు ను గొత్తి కోయలు హత్య చేయడంతో పోలీసు ఉన్నతాధికారులు కూడా ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ యంత్రాంగానికి అండగా నిలవాలని ఆదేశించారు. అయితే గతంలోనే రెండు శాఖల సమన్వయంతో జాయింట్ ఆపరేషన్లు నిర్వహించినప్పటికీ సుధీర్ఘ కాలం అడవుల పరిరక్షణ కోసం పనిచేసే పరిస్థితులు లేకుండా పోయాయి. తాజాగా అటవీ శాఖ ఉన్నతాధికారులు చేసిన ప్రతిపాదనల నేపథ్యంలో ఫారెస్ట్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు వచ్చినప్పటికీ అందులో నియామకాలు ఎలా చేపట్టాలి, వెపన్స్ ప్రొటెక్షన్ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలి తదితర అంశాలపై నిర్ణయాలు తీసుకోవల్సి ఉంది.