పాతవి వదిలేసి కొత్త హామీలా..?

బీఆర్ఎస్ మేనిఫేస్టో మోసపూరితం

ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ జోజిరెడ్డి ధ్వజం

దిశ దశ, కరీంనగర్:

రెండుఎన్నికల మేనిఫేస్టోలో ఇచ్చిన హామీలను వదిలేసి కొత్త హామీలకు తెరలేపడం వెనక కేవలం ప్రజలను మోసం చేయడమే తప్ప మరోటి లేదని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కరీంనగర్ ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి జోజిరెడ్డి అన్నారు. సోమవారం కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… మరోసారి తెలంగాణా ప్రజానీకాన్ని మోసగించేందుకే కొత్త హామీలు ఇస్తున్నారని మండిపడ్డారు. 2014, 28 ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చని బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మేపరిస్థితి లేదన్నారు. ఈ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టడం ఖామని జోజిరెడ్డి స్పష్టం చేశారు. 9 ఏళ్లుగా అధికారంలో ఉండి చేయలేని పనులు ఇకముందే చేస్తామంటే ప్రజలు నమ్మరన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. నిరుద్యోగ భృతి అమలు ఏమైందో చెప్పాలని, నిజాయితీగా ప్రజా సేవ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సుముఖంగా లేరన్నారు. ఉద్యోగాల భర్తీ కోసం ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పినా నేటికీ ఆ ఊసే ఎత్తిన దాఖలాలే లేవని జోజిరెడ్డి అన్నారు. రేషన్ కార్డులు ఉన్నవారికి ఉచితాలంటూ తాయిలాలు ప్రకటించిన ప్రభుత్వం ముందుగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని, అలాగే కుటుంబ సభ్యుల పేర్లు కార్డుల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికలప్పుడు రేషన్ కార్డులు కేవలం ఆ నియోజకవర్గ ప్రజలకు మాత్రమే అమలు చేశారంటే తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల స్టంట్లు ఎలా చేస్తుందో గమనించాలన్నారు. ఇప్పటికే పలుమార్లు కొత్ రేషన్ కార్డుల కోసం మీ సేవ ద్వారా దరఖాస్తులు చేసినా వారికి కొత్త కార్డులు మాత్రం ఇవ్వలేదని, ఇప్పుడు మాత్రం రేషన్ కార్డులు ఉన్న వారికి ఉచితాలంటూ ప్రకటన వర్షం గుప్పిస్తోందని జోజిరెడ్డి ధ్వజమెత్తారు. స్వరాష్ట్రంలో కాంట్రాక్ట్, ఔట్ సోర్పింగ్ ఉద్యోగాల విధానమే ఉండదని అందరినీ రెగ్యూలరైజ్ చేస్తామని ఇచ్చిన హామీ ఎందుకు అమలుకు నోచుకోలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు దోపిడీకి గురవుతున్నారని, కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు, ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగు నీరు, డబుల్ ఇండ్లు, దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడు ఎకరాల భూమి, రైతులకు ఉచిత ఎరువులు, పురుగు మందులు ఇలా ఎన్నో హామీలను తుంగలో తొక్కిన తెలంగాన ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వచ్చేందుకు కొత్తకొత్త పథకాలంటు ప్రజలను మోసం చేసేందుకు కుట్ర చేస్తోందని ఏఐఎఫ్బీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆరోపించారు. స్వరాష్ట్రం సాధించుకున్న తరువాత అద్భుతమైన ఫలితాలు సాధించామని ఢంకా బజాయించి చెప్తున్న ప్రభుత్వం అన్నిరంగాల వారి సంక్షేమాన్ని విస్మరించిందని దుయ్యబట్టారు. కేవలం మూడో సారి అధికారంలోకి రావాలన్న ఉత్సుకత మాత్రమే బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో కనిపిస్తోంది తప్ప ప్రజా సంక్షేమ మాత్రం మచ్చుకైనా ఆగుపించడం లేదంటూ జోజిరెడ్డి వ్యాఖ్యానించారు.

You cannot copy content of this page