కీకారణ్యాలు… గోదావరి పరవళ్ల నడుమ జన్మించిన ఆయన సివిల్ సర్విసెస్ అధికారిగా ఎంపికై దేశంలోనే అత్యున్నతమైన బాధ్యతలు నిర్వర్తించారు. పదవి విరమణ తరువాత రాష్ట్ర మంత్రిగా కూడా పని చేసిన ఆయన తిరిగి రాని లోకాలకు వెళ్లారు. ఉమ్మడి వరంగల్ లోని నూతన ములుగు జిల్లా పరిధిలోని ఏటూరునాగారంలో జన్మించిన కె విజయరామారావు(85) సోమవారం తుది శ్వాస విడిచారు.
సీబీఐ డైరక్టర్ గా
1959 బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా సెలెక్ట్ అయిన కె విజయ రామారావు మొదట చిత్తూరు జిల్లా ఏఎస్పీగా బాధ్యతలు నిర్వర్తించారు. హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనర్ గా కూడా పనిచేసినప్పుడు 1984 ఆగస్టులో సంక్షోభం నెలకొంది. రాష్ట్రంలో వివిధ హోదాల్లో సేవలందిస్తున్న విజయరామారావు భారత ప్రధానిగా పివి నరసింహరావు బాధ్యతలు తీసుకున్న తరువాత అరుదైన అవకాశం వచ్చింది. దేశంలోనే అత్యున్నతమైన సీబీఐ డైరక్టర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ సమయంలో హవాలా కుంభకోణం, బాబ్రీమసీదు విధ్వంసం, ఇస్రో గూఢాచార్యం, ముంబాయి బాంబు పేలుళ్ల వంటి సంచలానత్మక కేసులతో పాటు పివి నరసింహరావుపై వచ్చిన అభియోగాలకు సంబంధించిన కేసులపై కూడా దర్యాప్తు చేశారు. అప్పటి కోర్టు ఆదేశాలతో సీబీఐ పీవి నరసింహరావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఆదేశించండంతో సీబీఐ కేసులు నమోదు చేయాల్సి వచ్చింది. సర్వీసులో ఉంటూనే లా డిగ్రీ పూర్తి చేసిన ఆయన రిటైరయిన తర్వాత పోలీస్ మాన్యువల్ రాసి కూడా రికార్డు క్రియేట్ చేశారు. టీడీపీలో చేరిన విజయరామారావు ఖైరతాబాద్ నుండి శాసనసభకు ఎన్నికై రోడ్లు భవనాల శాఖ మంత్రిగా వ్యవహరించారు.
బాల్యం అలా… వివాహం ఇలా…
విజయ రామారావు అమ్మమ్మ గారిది నెల్లూరు జిల్లా వెంకటగిరి కావడంతో ఆయన విద్యాభ్యాసం అక్కడే జరిగింది. ఆ తరువాత మద్రాసు యూనివర్శిటీలో బీఏ ఆనర్స్ పూర్తి చేసిన ఆయన 1958లో కరీంనగర్ ఎస్సారార్ కాలేజీలో కొంతకాలం లెక్చరర్ గా పని చేశారు. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ ప్రిన్సిపల్ గా చేసిన ఈ కాలేజీలో ఆయన అధ్యాపకునిగా సేవలందించారు. ఇదే సమయంలో ఆయన ఐపీఎస్ కు ఎంపిక కావడంతో లెక్చరర్ ఉద్యోగం వదిలేశారు. కరీంనగర్ సీనియర్ నాయకులు, ఇటీవలే దివంగుతులు అయిన వెలిచాల జగపతి రావు సోదరిని విజయరామారావు వివాహం చేసుకున్నారు. ఉద్యోగ ప్రస్థానంలో తొలి అడుగు కరీంనగర్ నుండే విజయరామారావు ప్రారంభిస్తే వైవాహిక అనుభంధం కూడా కరీంనగర్ జిల్లాతోనే పెనవేసుకున్నారు. దట్టమైన కీకారణ్యంలో జన్మించి దేశ అత్యున్నతమైన సీబీఐ పదవిలో కొనసాగిన విజయరామారావు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం హైదరాబాద్ లో మరణించారు. ఆయన మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.