దిశ దశ, కరీంనగర్:
మాజీ మంత్రి గంగుల కమలాకర్ కు మరో బిగ్ షాక్ తగిలింది. ఇంతకాలం అన్నీ తానై వ్యవహరించిన నందెల్లి మహిఫాల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం ఆయన ఇంటి నుండి అదుపులోకి తీసుకున్న పోలీసులు కొత్తపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కరీంనగర్ జిల్లా ఒలంపిక్ అసోసియేషన్, అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షుడు, రాష్ట్ర అథ్లెటిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షునిగా కూడా వ్యవహరిస్తున్న నందెల్లి మహిపాల్ ను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. గంగుల కమలాకర్ మంత్రిగా ఉన్నప్పుడు డిఫ్యాక్టోగా మహిపాల్ వ్యవహరించారన్న ప్రచారం కూడా ఉండేది. అయితే ఆయన భూ దందాలకు సంబంధించిన వ్యవహారంలో అరెస్ట్ చేసినట్టు తెలిపారు. కొత్తపల్లి పోలీసుల కథనం ప్రకారం… క్రైం నంబర్ 68/2024, సెక్షన్ 467,468,471,420, 386, 506, 120B r/w 34 కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ3గా ఉన్న నందెల్లి మహిపాల్ ను మంగళవారం రాత్రి కరీంనగర్ కోర్టులో హాజరు పరిచారు. ఆయనకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో నందెల్లి మహిపాల్ ను కరీంనగర్ జిల్లా జైలుకు తరలించారు.
తహసీల్దార్ పై కూడా…
ఈ కేసులో కరీంనగర్ పోలీసులు బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఇప్పటివరకు భూదందాలకు పాల్పడిన సివిలియన్లపై మాత్రమే కేసు నమోదు చేశారు. కానీ ఈ కేసులో మాత్రం అప్పుడు కొత్తపల్లి తహసీల్దార్ గా పని చేసిన చిల్ల శ్రీనివాస్ ను ఏ9 నిందితునిగా చేర్చడం సచలనం కల్గిస్తోంది. బాధితుడు ఎర్రం కనకారెడ్డికి 2008 వ సంవత్సరంలో సర్వేనెంబర్ 776,777,778లో 15 గుంటల భూమిని విక్రయించగా ఇందుకు సంబంధించిన కేసు కోర్టులో విచారణలో ఉంది. అయినప్పటికీ తహసీల్దార్ శ్రీనివాస్ మ్యూటేషన్ చేశారని పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. ఈ కేసులో చిట్యాల కిష్టమ్మ, గుండ రాజమల్లు
, గంగాధర కనకయ్య, నక్క పద్మ, తాటిపాముల రాజు, కొత్తకొండ శ్రీను @ మైకల్ శ్రీను
లపై కూడా కేసు నమోదు చేశారు.
