తాజా మంత్రిని కలిసిన మాజీ మంత్రి బావ రాజకీయ వర్గాల్లో కలకలం…

దిశ దశ, కరీంనగర్:

మాజీ మంత్రి గంగుల కమలాకర్ బావ శంకర్ తాజా మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిశారు. హైదరాబాద్ లో ఆయన మంత్రిని కలిసిన రావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. గ్రానైట్ ఫ్యాక్టరీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న శంకర్ గురువారం ఉదయం హైదరాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిశారు. ఈ సందర్బంగా స్లాబ్ సిస్టం రిబేట్ గురించి మంత్రి పొన్నంతో మాట్లాడానని ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారంటూ ఆయన వెల్లడించారు. అయితే స్లాబ్ సిస్టం రిబేట్ విషయం గత రెండు మూడు నెలలుగా పెండింగ్ ఉన్న అంశం కాగా ఇప్పుడు ఆ అంశం గురించి ప్రత్యేకంగా వెల్లి కలవడం వెనక ఆంతర్యం ఏంటన్న చర్చ గ్రానైట్ ఇండస్ట్రీ వర్గాల్లో సాగుతోంది.

కారణం అదేనా..?

అయితే కరీంనగర్ జిల్లా గ్రానైట్ అసోసియేషన్ లో ఇటీవల సమావేశం జరగగా ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశం కూడా తెరపైకి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ అసోసియేషన్ ఏర్పాటు చేసినప్పటి నుండి ఇదే కమిటీ కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించాలన్న ప్రతిపాదనను ఈ సమావేశంలో తీసుకవచ్చారు. ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఉన్న వారిలో ఒకరిద్దరు తమ పదువులకు రాజీనామా చేసేందుకు కూడా సిద్దంగా ఉన్నామని కూడా ముందుకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇదే సమావేశంలో నకిలీ బిల్లులు ఇవ్వ కూడదని, నాన్ లోకల్ వాళ్లకు అనుమతులు ఇవ్వకూడదని నిర్ణయించారు. ఈ కమిటీకి మాజీ మంత్రి గంగుల కమలాకర్ బావ అయిన శంకర్ అధ్యక్షునిగా, ప్రధాన కార్యదర్శిగా గంగుల సోదరుని కుమారుడు ప్రదీప్ లు వ్యవహరిస్తున్నారు. ఇంతకాలం ఈ కమిటీ బాధ్యులుగా ఉన్నారని ఎన్నికలు జరిపినట్టయితే కొత్త వారిని ఎన్నుకునే అవకాశం ఉంటుందన్న ఆలోచనతో ఫ్యాక్టరీస్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ బలంగా వినిపిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే అధ్యక్షుడు శంకర్ మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలివడం ప్రాధాన్యత సంతరించుకున్నట్టయింది.

You cannot copy content of this page