మాజీ ఎమ్మెల్యే ‘కటకం’ సంచలన నిర్ణయం
దిశ దశ, కరీంనగర్:
మాజీ ఎమ్మెల్యే… సీనియర్ నాయకుడు కటకం మృత్యుంజయం సంచలన నిర్ణయం తీసుకున్నారు. నాలుగేళ్లుగా బీజేపీలో కొనసాగుతున్న ఆయన కమలం పార్టీకి గుడ్ బై చెప్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఈ మేరకు రాజీనామా లేఖ రాసి పంపించారు. బీజేపీలో తనకు ఎలాంటి పదవులు కట్టబెట్టకున్నప్పటికీ కమలం బలోపేతం కోసం విశేషంగా కృషి చేశానని పార్టీ సభ్యత్వం ఉన్నదో లేదో తెలియదు కానీ నేను మాత్రం బీజేపీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించడం సంచలనంగా మారింది.
బాధ్యతల్లో దూకుడు…
బీజేపీ నేతగా ఉన్న కటకం మృత్యుంజయంకు తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో తిరువన్నామలై నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వహించగా, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ గా పనిచేశారు. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కొన్ని డివిజన్లలో పార్టీ ఇంచార్జ్ గా వ్యవహరించిన ఆయన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ నియోజకవర్గ ఇన్చార్జిగా, మునుగోడు ఉప ఎన్నికల్లో కొన్ని మండలాల ఇన్చార్జిగా ఆయన పార్టీ బలోపేతానికి కృషి చేశారు. ఉమ్మడి రాష్ట్రంలోనే సుదీర్ఘ కాలం డీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిన రికార్డు అందుకున్న కటకం మృత్యుంజయం కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న పరిణామాలను గమనించి బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రోద్భలంతో కాషాయం కండువా కప్పుకున్న ఆయన విషయంలో పార్టీ సరైన ప్రాధాన్యత కల్పించకలేకపోయిందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. బండి సంజయ్ కూడా పార్టీలో చేర్పించుకున్న తరువాత పార్టీలో పదవిని కట్టబెట్టే విషయంలో కూడా పట్టించుకోలేదన్నవాదనలు ఆయన వర్గీయులు వెలిబుచ్చుతున్నారు. తాజాగా బీజేపీ స్టేట్ చీఫ్ మార్పిన తరువాత కూడా ఆయన విషయంలో పార్టీ పట్టించుకోని వైఖరి అవలంభించడంతో ఆయన కినుక వహించినట్టుగా తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో కూడా కీలక పాత్ర పోషించిన ఆయన తాజాగా తెలంగాణ అమరవీరుల ఆశయ సాధన కోసం (టాస్) జేఏసీని ఏర్పాటు చేశారు.
సమరమేనా…
ఇక ఏ రాజకీయ పార్టీలో చేరకుండా ఆయా పార్టీల్లో ఉన్న ఉద్యమకారులను ఒకే వేదికపైకి తీసుకవచ్చి తొలి, మలిదశ అమరవీరుల ఆశయ సాధనే లక్ష్యంగా టాస్ ను బలోపేతం చేయాలన్న లక్ష్యంతో కటకం మృత్యుంజయం ఉన్నట్టుగా తెలుస్తోంది. అమరవీరుల ఆశయ సాధన, తెలంగాణ ఆవిర్భావం తరువాత జరుగుతున్న పరిణామాలకు ధీటుగా పోరుబాట మొదలు పెట్టి వచ్చే ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో టాస్ సత్తా ఛాటే విధంగా వ్యూహ రచన చేస్తున్నట్టు సమాచారం. మేధావులు, తటస్థులు, ఉద్యమకారులతో సుదీర్ఘ మంతనాలు జరిపి టాస్ ద్వారానే ఉద్యమాలు చేపట్టి ఉద్యమకారుల గొంతకను వినిపించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమర వీరులు, ఉద్యమ కారుల ఆశయ సాధనే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించి కార్యరంగంలోకి దూకాలని మృత్యుంజయం నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ మేరకు జాతీయ, ప్రాంతీయ నేతలతో ఇప్పటికే చర్చలు కూడా జరిపినట్టుగా తెలుస్తోంది. పాలిటిక్స్ లో తనకంటూ బ్రాండ్ ఇమేజ్ సంపాదించుకున్న మృత్యుంజయం బీజేపీకి రాజీనామా చేసి సంచలన వ్యూహాలతో ముందుకు సాగనున్నట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది.