కారు దిగి కరం చెంతకు చేరిన మాజీ ఎమ్మెల్యే కోనప్ప…

దిశ దశ, మంచిర్యాల:

రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బలాన్ని పెంచుకునే దిశగా అధిష్టానం పావులు కదిపుతున్న తీరుపై కినుక వహిస్తున్నారు కొంతమంది నాయకులు. మంగళవారం బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తుల సమీకరణాలపై నిర్ణయం వెలువడిన తరువాత కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే సంచలన నిర్ణయం తీసుకున్నారు. సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కొనప్ప బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం ఆయన జిల్లా పార్టీ అధ్యక్షునిగా వ్యవహరిస్తుండగా సోదరుడు కృష్ణ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోనప్పపై బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్పీ పోటీ చేశారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థిగా బరిలో నిలిచిన ప్రవీణ్ కుమార్ కారణంగానే ఓటమి పాలయ్యారని కోనప్ప వర్గీయులు అంటున్నారు. బీఎస్పీ ఓట్లు చీల్చుకోవడంతోనే బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీష్ విజయం సాధించారని సిర్పూర్ క్యాడర్ లో బలంగా నాటుకపోయింది. ఈ క్రమంలో బీఎస్పీతో పోత్తు పెట్టుకుంటున్నట్టు గులాభి బాస్ ప్రకటించడంతో కోనప్ప కారు దిగాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డిని కలవడంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమైపోయింది.

పూర్వాశ్రమంలోకే…

కోనప్ప మొదట కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. 2004లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టిన ఆయన 2009లో జరిగిన జనరల్ ఎన్నికల్లో, 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో కావేటి సమ్మయ్యపై ఓటమి పాలయ్యారు. 2014లో బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన తరువాత గులాభి కండువా కప్పుకున్నారు. అయితే తాజాగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడం ఇష్టం లేని కోనప్ప బీఆర్ఎస్ పార్టీకి బైబై చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే తిరిగి తన పూర్వాశ్రమంలోకి చేరేందుకు నిర్ణయించుకున్నట్టుగా స్పష్టం అవుతోంది. తూర్పు జిల్లా బీఆర్ఎస్ పార్టీలో బలమైన నాయకుడిగా ఉన్న కోనప్ప బీఆర్ఎస్ పార్టీని వీడడం మాత్రం కొంతమేర నష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

You cannot copy content of this page