కాంగ్రెస్ లో చేరిన ‘సంతోషం’

దిశ దశ, కరీంనగర్:

మాజీ ఎమ్మెల్సీ, కరీంనగర్ జిల్లా సీనియర్ నేత సంతోష్ కుమార్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. రెండు మూడు నెలలుగా సమీకరణాలు జరిపిన ఆయన తిరిగి సొంత గూటికి చేరారు. ఉమ్మడి జిల్లాలో సంతోషన్న అన్న బ్రాండ్ ఇమేజ్ సంపాదించుకున్న టి సంతోష్ కుమార్ అనూహ్య పరిణామాలతో ఎమ్మెల్సీ అయ్యారు. అయితే తెలంగాణ ఆవిర్భావం తరువాత గులాభి కండువా కప్పుకున్నప్పటికీ ఆ పార్టీలో తగిన ప్రాధాన్యం లేకపోవడంతో ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. తాజాగా గురువారం న్యూ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంఛార్జి మాణిక్ రావు థాక్రే సమక్షంలో పూర్వాశ్రమంలోకి చేరిపోయారు.

బీజేపీ గాలానికి చిక్కుకుండా…

అయితే ఇటీవలే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన సంతోష్ కుమార్ ను బీజేపీలో చేరాలన్న ప్రతిపాదనలు వచ్చాయి. బీజేపీకి చెందిన ముఖ్యనేతకు చెందిన షాడో టీమ్ సంతోష్ కుమార్ కు కాషాయ కండువా కప్పాలని ప్రయత్నించింది. ఈ సారి ఎమ్మెల్యేగా బరిలో నిలవాలన్న ఆలోచన ఉన్నదన్న విషయాన్ని గమనించిన కమలనాథులు ఆ బంపర్ ఆఫర్ కూడా ఇచ్చినప్పటికీ బీజేపీ జాతీయ నాయకత్వ తొలి జాబితా ప్రకటించడం, సంతోష్ కుమార్ మనసంతా కూడా కాంగ్రెస్ వైపే ఊగిసలాడడంతో కాషాయం కండువా కప్పుకునేందుకు సాహసించలేకపోయారు. చివరి క్షణం వరకు కూడా బీజేపీ నాయకులు సంతోష్ కుమార్ ను తమ పార్టీలో చేర్పించుకోవాలని, జాతీయ నాయకత్వంతో మాట్లాడి కరీంనగర టికెట్ ఇప్పిస్తామంటూ ఆయనకు హామీ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ వారి ప్రయత్నాలు మాత్రం సఫలం కాలేదనే చెప్పాలి.

స్పీడ్ బ్రేకర్లను దాటి…

మరో వైపున కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సంతోష్ కుమార్ కు సీనియర్ నాయకులు అభ్యంతరాలు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినప్పటికీ మండలిలో కాంగ్రెస్ పక్షాన్ని అంతా కూడా గులాభి గూటిలో చేర్చారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టుగా ప్రచారం జరిగింది. అప్పటి పరిస్థితుల్లో తాను ఒంటరిని అయ్యానని, తనకు కాంగ్రెస్ నేతలు అండగా నిలబడలేదన్న వాదనలు సంతోష్ కుమార్ వినిపించారు. అయినప్పటికీ కాంగ్రెస్ నాయకులు అభ్యంతరాలు చెప్పడంతో సంతోష్ కుమార్ భవితవ్యం ఏంటోనన్న చర్చ మొదలైంది. ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేస్తారని సంతోష్ కుమార్ వర్గీయులు చెప్పుకొచ్చారు. ఆయన కూడా వ్యక్తిగత అనుబంధం ఉన్నవారితో సమీకరణాలు నెరపడం మొదలు పెట్టారు. దీంతో సంతోష్ కుమార్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం ఖాయం అన్నకున్నారు. ఇదే సమయంలో అధికార పార్టీకి చెందిన ముఖ్య నాయకుడు ఒకరు సంతోష్ కుమార్ ను ‘స్క్రాప్’ అంటూ వ్యాఖ్యానించారన్న ప్రచారం సాగింది. దీంతో సంతోష్ కుమార్ మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పావులు కదిపారు. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు సంతోష్ కుమార్ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. అయితే సంతోష్ కుమార్ చేరికతో మళ్లీ కరీంనగర్ అభ్యర్థి ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సమీక్షించడం మొదలు పెట్టింది. ఇప్పటికే ఇక్కడి నుండి టికెట్ ఆశిస్తున్న ఎమ్మెస్సార్ మనవడు రోహిత్ రావు, జైపాల్ రెడ్డి, పురుమళ్ల శ్రీనివాస్, కోమటి రెడ్డి నరేందర్ రెడ్డిలు ఏఐసీసీ, పీసీసీ పెద్దలను ప్రాపకం చేసుకునే పనిలో నిమగ్నం అయ్యారు. వీరిలో ఎవరో ఒకరి పేరు ప్రకటించే అవకాశాలు ఉన్నాయనకుంటున్న క్రమంలో అనూహ్యంగా మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో అశావాహుల్లో ఆందోళన మొదలైంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆశావాహుల జాబితాలో సంతోష్ కుమార్ పేరు కూడా చేరడంతో కరీంనగర్ అభ్యర్థి ఎంపిక అంశం మళ్లీ మొదటికొచ్చినట్టయింది.

You cannot copy content of this page