సారా దందాలో ఇరుక్కపోయింది
మాజీ ఎంపీ మధుయాష్కి సంచలన వ్యాఖ్యలు
దిశ దశ, జగిత్యాల:
ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై నిజామాబాద్ ఎంపీ మధూయాష్కి గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్రమాలు, అవినీతికి కేరాఫ్ గా ఆకుటుంబం మారిందని మండిపడ్డారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇఫ్తార్ విందుకు హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఎమ్మెల్సీ కవిత బతుకమ్మ ముసుగులో బతుక నేర్చి కోట్లు గడించి సారా దందాలో కవిత ఇరుక్కుపోయారన్నారు. బెల్టు షాపులతో నిరుద్యోగులు ఉద్యోగాలు లేక తాగుడుకు బానిసై తల్లిదండ్రుల ఆస్థులు తాకట్టు పెడ్తుంటే, ఆడపడుచుల తాళిబొట్లు తెగిపడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నేరస్థుడు ఇచ్చిన స్టేట్ మెంట్ కు నేనెందుకు స్పందించాలని అంటున్న కవిత నిజాయితీ ఉంటే రాజీనామ చేసి విచారణకు సహకరించాలని మధూయాష్కి గౌడ్ డిమాండ్ చేశారు. ఆడబిడ్డవై ఉండి సారా దందాలో ఇరుక్కోవడం ఎంత వరకు సమజంసమని ప్రశ్నించిన ఆయన విచారణ ఎదుర్కొకుండా ఉండేందుకు సుప్రీం కోర్ట్ కు ఎందుకు వెళ్లినట్టన్నారు. ముఖ్యమంత్రి లిక్విడ్ స్కాం కాళేశ్వరం పేరిట కోట్లు గడిస్తున్నారని, కొడుకు లీక్స్, వివిధ కంపెనీల పేరిట అక్రమాలకు పాల్పడుతున్నారని, కూతురు లిక్కర్ స్కామ్ లు చేస్తున్నారంటూ మధూయాష్కి మండిపడ్డారు. తెలంగాణ పదం, వాదంతో అధికారంలోకి వచ్చిన పార్టీ ఆ పదాన్ని తీసేసిందంటే మట్టిలో కొట్టుకపోవడం ఖాయమంటూ వ్యాఖ్యానించారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు కలిసి ఈవీఎంలు మేనేజ్ చేయడంతోనే జగిత్యాలలో గెలవాల్సిన జీవన్ రెడ్డి ఓడిపోయి ఉంటారని, ధర్మపురి అభ్యర్థి లక్ష్మణ్ కుమార్ గెలిచినట్లు వార్తలు వచ్చినా సీఎం కెసిఆర్ ఆదేశాల మేరకు అప్పటి కలెక్టర్, రిటర్నింగ్ అధికారి ఫలితాల్ని తారుమారు చేశారని ఆరోపించారు. రీ కౌంటింగ్ చేయకుండా, లాఠీ ఛార్జి చేసి బయటకు పంపించి ఏకపక్షంగా వ్యవహరించి కొప్పుల ఈశ్వర్ గెలిచినట్లు ప్రకటించారన్నారు. రీ కౌంటింగ్ జరిగితే లక్ష్మణ్ కుమార్ గెలవడం ఖాయంమని, స్ట్రాంగ్ రూమ్ తాళం చెవులు లేవని చెప్పడం వెనక కుట్ర జరగిందని మధూయాష్కి అన్నారు. కాంగ్రెస్ గెలిచే స్థానాల్లో బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కై ఈవీఎంలను మేనేజే చేశారని, చేస్తారని దుయ్యబట్టారు. నిత్యం ప్రజల్లో ఉండే జీవన్ రెడ్డి ఎలా ఓడిపోతారని ఆయన ప్రశ్నించారు.