దిశ దశ, పెద్దపల్లి:
పెద్దపల్లి లోెకసభ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య తీవ్రంగా పెరుగుతోంది. ఆశావాహులు తమ వంతు ప్రయత్నాల్లో మునిగిపోయారు. అయితే తాజాగా సరికొత్త పేరు తెరపైకి వచ్చింది. దాదాపు రెండు దశాబ్దాల తరువాత ఆమె సీరియస్ గా టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు.
మాజీ ఎంపీ
రెండు దశాబ్దాల క్రితం పెద్దపల్లి ఎంపీగా ప్రాతినిథ్యం వహించిన సిహెచ్ సుగుణ కుమారి మళ్లీ టికెట్ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. హైదరాబాద్ సిటీకి చెందిన సుగుణాకమారి డాక్టరేట్ పట్టా పొందిన నేపథ్యంలో మంథనికి చెందిన డాక్టర్ మార్పక రాజేంద్ర ప్రసాద్ ను ఆదర్శ వివాహం చేసుకున్నారు. అనూహ్యంగా పెద్దపల్లి నుండి టీడీపీ నుండి పోటీ చేసిన ఆమె రాజకీయాల్లో కురువృద్దుడు జి వెంకటస్వామిపై విజయం సాధించారు. వెంకటస్వామికి మంచి పట్టు ఉన్న పెద్దపల్లి నుండి సుగుణ కుమారీ పోెటీ చేయడమే సాహసం అనుకున్న ఆ సమయంలో ఆమె గెలవడం కూడా సంచలనంగా మారిందనే చెప్పాలి. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె పేరు ఒకటి రెండు సార్లు తెరపైకి వచ్చినప్పటికీ ఆమె మాత్రం టికెట్ కోసం అంతగా ప్రయత్నించలేదు. కానీ ఈ సారి మాత్రం సుగుణకుమారీ కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవడంతో ఆమె ఖచ్చితంగా పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా స్పష్టం అవుతోంది. అంతేకాకుండా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి శ్రీధర్ బాబులను కూడా కలిశారు. గురువారం వీరిని కలిసిన సందర్భంలో శ్రీధర్ బాబుతో ప్రత్యేకంగా మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఈ సారి తన అభ్యర్థిత్వం కోసం సహకరించాలని శ్రీధర్ బాబును కోరినట్టుగా తెలుస్తోంది. గతంలో రెండు సార్లు ఇక్కడి నుండే ఎంపీగా పోటీ చేసిన అనుభవం తనకు కలిసి వస్తుందని సుగుణ కుమారి ఆశిస్తున్నారు. ఇప్పటి వరకు ఇతర నాయకుల పేర్లు వినిపించినప్పటికీ సుగుణ కుమారి ఊసే లేదు. కానీ రెండు రోజుల నుండి సుగుణ కుమారి రీ ఎంట్రీ ఇవ్వడం చకాచకా పావులు కదుపుతుండడం చర్చనీయాంశంగా మారింది.