శాంతి చర్చల కోసం వెళ్లాడా..?
ఇన్ స్టాలో పోస్ట్ షేర్ చేయడం వెనక..?
దిశ దశ, దండకారణ్యం:
మావోయిస్టులు, ప్రభుత్వం మధ్య శాంతి చర్చలు జరగాలన్న తలంపుతో ఓ యువకుడు సాహసం చేశాడా..? మాజీ నక్సలైట్ గా పరిచయం చేసుకున్న ఆ యువకుడు దండకారణ్యంలోకి నిజంగానే వెళ్లాడా..? నక్సల్స్ తో చర్చలు జరపాలన్న ఆతృత అతనికి నిజంగానే కలిగిందా..? ఇన్ స్టా అకౌంట్ లో నవంబర్ 22న షేర్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ కావడం వెనక ఉన్న ఆంతర్యం ఏంటన్నదే అంతు చిక్కకుండా పోయింది.
చర్చల కోసం…
ఇంతకు ముందు మావోయిస్టు పార్టీలో పని చేసి జనజీవనంలో కలిశానని ప్రస్తుతం పోలీస్ విభాగంలో పని చేస్తున్నానని చెప్పుకొచ్చిన ఆ యువకుడు అభూజామఢ్ అటవీ ప్రాంతంలో శాంతియుత వాతావరణం నెలకొనాలని ఆకాంక్షిస్తున్నానని వివరించాడు. ఈ విషయం గురించి చత్తీస్ గడ్ హోం మంత్రి, బస్తర్ ఐజీల దృష్టికి తీసుకెళ్లినట్టుగా చెప్పిన ఆ యువకుడు mk_muriya అనే ఐడీపై ఇన్ స్టాలో వీడియోను పోస్ట్ చేశారు. అయితే హోమంత్రి విజయ్ శర్మ, ఐజీ సుందర్ రాజ్ లు వద్దని చెప్పారని కూడా తెలిపాడు. నవంబర్ 22న పోస్ట్ చేసిన ఈ వీడియో తాజాగా వెలుగులోకి రావడంతో దండకారణ్య అటవీ ప్రాంతంలో హాట్ టాపిక్ గా మారింది. సదరు యువకుని పేరు, ఏ ప్రాంతానికి చెందిన వాడు అన్న వివరాలు మాత్రం తెలియరావడం లేదు. నక్సల్స్, ప్రభుత్వం మధ్య నెలకొన్న పోరాటం వల్ల దండకారణ్యంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయని ఈ పరిస్థితులను ఇంతటితో ఆపేయాలని భావిస్తున్నానని తెలిపాడు. ఇందుకోసమే తాను అభూజామఢ్ అటవీ ప్రాంతంలోకి వెలుతున్నానని కూడా ప్రకటించాడు. అయితే నవంబర్ 22న షేర్ చేసిన ఈ వీడియో తరువాత అతను ఇన్ స్టా అకౌంట్లో అయితే ఇతరాత్ర పోస్టులు షేర్ చేయనట్టుగా తెలుస్తోంది. అయితే సదరు యువకుడు ఇప్పటి వరకు షేర్ చేసిన పోస్టులన్ని కూడా బస్తర్ పూర్వ జిల్లాలోని జగ్దల్ పూర్, భైరంగడ్ తదితర ప్రాంతాల్లో షేర్ చేసినట్టుగా స్పష్టం అవుతోంది.
ఆచూకి ఏమైనట్టు..?
అయితే mk_muriya అనే ID అకౌంట్ ద్వారా షేర్ చేసిన సదరు యువకుని ఆచూకి ఏమై ఉంటుందన్నదే పజిల్ గా మారింది. చత్తీస్ గడ్ హోం మంత్రి, బస్తర్ ఐజీల దృష్టికి శాంతి చర్చల విషయం గురించి తీసుకెల్తే మాత్రం వద్దన్నారని వివరిస్తున్నందన అప్పటి నుండి అతని ఆచూకి కోసం అక్కడి పోలీసులు ఆరా తీసే అవకాశం ఉండేది కదా అన్న అనుమానం వ్యక్తం అవుతోంది. మరో వైపున మాజీ నక్సలైట్ అయిన ఆ యువకుడు ప్రస్తుతం పోలీసు విభాగంలో పనిచేస్తున్నట్టుగా కూడా చెప్తున్నందని నెల రోజులుగా అతని ఆచూకి లభ్యం కానట్టయితే బస్తర్ జోన్ పరిధిలోని ఆయా జిల్లాల పోలీసు అధికారులు కూడా అతని కోసం గాలించే అవకాశాలు ఉంటాయి. కానీ అక్కడి అధికార వర్గాలు మాత్రం ఈ యువకుని గురించి ఎలాంటి ప్రకనట చేయనట్టుగా తెలుస్తోంది. నిజంగానే ఆ యువకుడు అభూజామఢ్ అటవీ ప్రాంతంలోకి వెల్లి నక్సల్స్ తో శాంతి చర్చల కోసం రాయబారం నడిపేందుకు వెల్లి వారి చెరలో బందీ అయ్యాడా..? లేక మావోయిస్టులను కలవలేదా అన్న విషయంపై కూడా క్లారిటీ లేకుండా పోయింది.
ఎవరితో..?
అయితే శాంతి చర్చల అంశం గురించి చర్చించాలంటే మావోయిస్టు పార్టీ ముఖ్య నాయకులతో మాత్రమే భేటీ కావల్సి ఉంటుంది. కేంద్ర కమిటీ అయినా కనీసం రాష్ట్ర కమిటీ కీలక బాధ్యులు ఈ అంశం గురించి డిస్కషన్ చేసేందుకు ముందుకు వస్తారు. అయితే ఇన్ స్టాలో పోస్ట్ చేసి వెల్లిన సదరు యువకుడు ఏ స్థాయి నాయకత్వంతో చర్చలు జరిపేందుకు వెల్తున్నాడన్న విషయాన్ని కూడా వెల్లడించలేదు. దీంతో ఆయన చర్చలు జరిపేందుకు దండకారణ్య ప్రాంతంలో ఉన్న ఏ నాయకుల వద్దకు వెల్లాడన్నది మాత్రం తెలియడం లేదు. ప్రస్తుతం పోలీసు విభాగంలో పనిచేస్తున్న సదరు యువకున్ని పార్టీ విశ్వసిస్తుందా అన్న అనుమానం కూడా కలుగుతోంది. సాధారణ క్యాడర్ లో పనిచేసిన ఈ యువకునితే కీలక నాయకత్వం భేటీ జరుపుతుందా అన్న చర్చ కూడా సాగుతోంది. ఏది ఏమైనా మాజీ నక్సల్ శాంతి చర్చల అంశంతో తిరిగి అడవుల్లోకి పయనం అయ్యాడన్న అంశం గురించి బస్తర్ అటవీ ప్రాంతంలో హాట్ టాపిక్ గా మారింది.