మాజీ పీసీసీ అధ్యక్షులు కేరాఫ్ ఉద్యమ పార్టీ

మరో నేత చేరికకు రంగం సిద్ధం

దిశ దశ, హైదరాబాద్:

ఓ ఉద్యమ పార్టీలోకి మరో జాతీయ పార్టీకి చెందిన రాష్ట్ర అధ్యక్షులు వలస వెళ్లడం అరుదేనని చెప్పాలి. జాతీయ పార్టీకి ప్రాతినిథ్యం వహించిన నేతలు బీఆర్ఎస్ లోకి క్యూ కడుతుండడం చర్చనీయాంశంగా మారింది. శతాధిక వయసు ఉన్న పార్టీకి బైబై చెప్పి పాతికేళ్ల ప్రాయానికి కూడా చేరని ఉద్యమ పార్టీలో జాయిన్ అవుతుండడం విశేషం.

కేకే TO పొన్నాల…

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షునిగా పని చేసిన కె కేశవరావు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ గా, రాజ్యసభలో పార్టీ నేతగా వ్యవహరించారు. గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గా కేకే తనయ గద్వాల విజయలక్ష్మి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మరో పీసీసీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయన కూడా రాజ్యసభకు గులాభి పార్టీ తరపున ఎన్నికయ్యారు. డీఎస్ తనయుడు అరవింద్ బీజేపీలో చేరడం కవితపై నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం ఊపందుకున్న క్రమంలో కేసీఆర్ తో కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడింది. దీంతో డీఎస్ పై చర్యలు తీసుకోవాలని కవిత అధినేత కేసీఆర్ కు లేఖ రాశారు. అయితే కేసీఆర్ మాత్రం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా హోల్డ్ లో పెట్టారు. అరవింద్ వెంట వెళ్లిన డీఎస్ హోంమంత్రి అమిత్ షాను కలవడంతో ఆయన బీజేపీలో చేరుతారని భావించారంతా. కానీ డీఎస్ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. తాజాగా ఆయన కుటుంబంలో నెలకొన్న పరిణామాల దృష్ట్యా తటస్థంగా ఉన్నారు.

ఇప్పుడు పొన్నాల

తెలంగాణ తొలి పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం అయింది. శుక్రవారం కాంగ్రెస్ పార్టీని వీడిన పొన్నాల ఇంటికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శనివారం వెళ్లి మంతనాలు జరిపారు. బీఆర్ఎస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించిన కేటీఆర్ పొన్నాల లక్ష్మయ్యకు సముచిత స్థానం ఉంటుందని హామీ ఇచ్చారు. ఇందుకు పొన్నాల కూడా సానుకూలత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. మంగళవారం జనగామలో జరగనున్న కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో పొన్నాల గులాభి కండువా కప్పుకోనున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో మరో పీసీసీ అధ్యక్షుడు కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరడం ఖాయం అయిపోయింది. ముచ్చటగా ముగ్గురు పీసీసీ అధ్యక్షులు బీఆర్ఎస్ పార్టీలోకే వలస వెళ్లడం విశేషమనే చెప్పాలి.

You cannot copy content of this page