17 ఏళ్లుగా Y సెక్యూరిటీ నడుమ మాజీ టీచర్

అన్నల ఇలాకాలో హై సెక్యూరిటీ

ఓ సాధారణ ప్రభుత్వ ఉపాధ్యాయుడు నిత్యం ఆయుధాల నడుమ జీవనం సాగించారు. సర్కారు కొలువును కాదని సాయుధుడిగా మారిపోయాడు. అతని జీవితంలో చోటు చేసుకున్న మలుపులు ఏంటీ..? పలకా, బలపం, బెత్తెం పట్టుకోవాల్సిన ఆయన తుపాకుల నడుమ జీవనం సాగించాడెందుకు..?

ఎవరాయన…?

చత్తీస్ గడ్ లోని బీజాపూర్ జిల్లా కుట్రుకు చెందిన మధుకర్ రావు గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. అయితే దండకారణ్య అటవీ ప్రాంతంతో సంబంధాలు ఉన్న వారికి మాత్రం ఈయన గురించి తెలిసి ఉంటుంది. సల్వా జూడుం పెరెత్తగానే కాంగ్రెస్ నేత మహేంద్ర కర్మ పేరు ప్రతి ఒక్కరికి గుర్తుకు వస్తుంది కానీ ఆయనతో పాటు కలిసి నడిచిన మధుకర్ రావు గురించి అంతగా వెలుగులోకి రాలేదు. సల్వా జూడుం ఎత్తివేసినా ఆయన మాత్రం దండకారణ్య అటవీ ప్రాంతంలోనే రక్షణ వలయంలో జీవనం సాగిస్తూ ఓ ఆశ్రమాన్ని కొనసాగించారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మధుకర్ రావు సాయుధుడిగా మారిపోయి నక్సల్స్ వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నాడు.

సల్వా జూడుం…

దండకారణ్య అటవీ ప్రాంతంలో క్రాంతీకారీ జనతన్ సర్కార్ కార్యకలాపాలు విస్తరిస్తున్న సమయం అది. అభూజామడ్ అటవీ ప్రాంతంలో పారా మిలటరీ బలగాలు లోపలకు అడుగు పెట్టే పరిస్థితి లేని పరిస్థితులు ఆనాటివి. అలాంటి సమయంలో అక్కడి ఆదివాసీల్లోని ఓ తెగతో అనుభందం పెంచుకుని నక్సల్స్ ఏరివేతే లక్ష్యంగా పావులు కదపడం ప్రారంభించింది సల్వాజూడుం. 2005-2006 ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ నేత మహేంద్ర కర్మ నేతృత్వంలో ఏర్పాటయిన సల్వా జూడుం నక్సల్స్ వ్యతిరేకపోరాటం ప్రారంభం అయింది. ఈ సమయంలో బీజాపూర్ జిల్లా కుట్రులో ప్రభుత్వ టీచర్ గా పనిచేస్తున్న మధుకర్ రావు తన ఉద్యోగానికి రాజీనామా చేసి సల్వాజూడుం నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. నక్సల్స్ తో సల్వాజూడుం ప్రత్రక్ష్య పోరాటం చేసి సంచలనాలకు కేరాఫ్ గా మారింది. చత్తీస్ గడ్ లోని బలగాలకంటే ఎక్కువగా సల్వా జూడుం మావోయిస్టులతో పోరాటం చేసింది. బస్తర్, బీజాపూర్, దంతెవాడ తదితర దండకారణ్య అడవులు విస్తరించి ఉన్న జిల్లాల బౌగోళిక స్వరూపంపై అవగాహన ఉన్న సల్వాజూడుం నక్సల్స్ కార్యకలాపాలను నిరోధించేందుకు సాయుధ పోరాటం కూడా చేసింది. నక్సల్స్ బాధితులను అక్కున చేర్చుకుని మావోయిస్టు వ్యతిరేక పోరాటంలో పాలుపంచుకునేలా తయారు చేసింది. ప్రభుత్వాలు కూడా సల్వాజూడుంకు బాసటగా నిలిచాయన్న ప్రచారం కూడా సాగింది. ఈ నేఫథ్యంలో సల్వాజూడుంకు వ్యతిరేకంగా కోర్టు తీర్పు ఇవ్వడంతో దీని కార్యకలపాలు కొంతమేర తగ్గాయి. 2013 మే 25న రాజకీయ పార్టీ కార్యకలాపాల్లో అటెండ్ అయి తిరిగి వస్తుండగా దర్భా ఏరియాలో నక్సల్స్ నిర్వహించిన దాడిలో మహేంద్ర కర్మ హతమయ్యారు. మహేంద్ర కర్మ మరణించే వరకు కూడా జడ్ ప్లస్ సెక్యూరిటీలోనే జీవనం సాగించారు.

మధుకర్ రావు బాధ్యతలు…

అయితే మహేంద్ర కర్మ మరణానంతరం సల్వాజూడుం బాధ్యతలు మాజీ టీచర్ మధుకర్ రావు తీసుకున్నారు. వై కేటగిరి భద్రతలో కొనసాగిన ఆయన సల్వా జూడుంలో చేరిన తరువాత మావోయిస్టులు చాలా సార్లు మట్టుబెట్టేందుకు ప్రయత్నించి విఫలం అయ్యారు. బీజాపూర్ అటవీ ప్రాంత వాసి కావడంతో నక్సల్స్ వ్యూహాలకు చిక్కకుండా మధుకర్ రావు తప్పించుకున్నారు. కొన్ని సార్లు పోలీస్ స్టేషన్లలో కూడా షెల్టర్ తీసుకున్నట్టుగా దండకారణ్యంలో ప్రచారంలో ఉంది. మావోయిస్టులతో డైరక్ట్ వార్ కొనసాగించిన మధుకర్ రావు సల్వా జూడుంను నిషేధించిన తరువాత కూడా తన పంథా మార్చుకోలేదు. నిత్యం పహారా మధ్య జీవనం సాగించిన ఆయనను ఓ సారి 300 మంది నక్సల్స్ చుట్టుముట్టినా తప్పించుకున్నాడని బస్తర్ ఏరియా వాసులు చెప్తున్నారు.

ఆశ్రమం ఏర్పాటు చేసి…

వివాహం కూడా చేసుకోని మధుకర్ రావు దండకారణ్య అటవీ ప్రాంతంలోనే పంచశీల ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఆశ్రమంలో అనాథ పిల్లలతో పాటు నక్సల్స్ బాదిత కుటుంబాలకు చెందిన పిల్లలను చేర్చుకునే వారు. Y సెక్యూరిటీ మధ్యే జీవనం సాగించిన ఆయన సల్వా జూడుం ఎత్తివేత తరవాత చిన్నారులను సైద్దాంతిక నిర్మాణం చేయాలన్న లక్ష్యంతోనే పంచశీల ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. చత్తీస్ గడ్ లో నక్సల్స్ వ్యతిరేక కార్యకలాపాల కోసం నిర్మాణం చేపట్టిన సల్వాజూడుంలో మహేంద్ర కర్మతో జట్టుకట్టిన మధుకర్ రావు 2023 ఫిబ్రవరి 7న గుండెపోటుకు గురై చనిపోయారు. బీజాపూర్ జిల్లా కుట్రులోనే ఆయన అస్వస్థకు గురి కాగా ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిందని మెరుగైన వైద్యం అందించాలని సూచించడంతో వరంగల్ లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అదే రోజు సాయంత్రం వరంగల్ లో చికిత్స పొందుతున్న మధుకర్ రావు (55) తుది శ్వాస విడిచారు. అనంతరం ఆయన మృతదేహాన్ని కుట్రుకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.

You cannot copy content of this page