జడ్పీ మాజీ ఛైర్ పర్సన్ తుల ఉమ
దిశ దశ, వేములవాడ:
వేములవాడ బీజేపీ టికెట్ ఆశించి భంగపడిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు తుల ఉమ మళ్లీ పూర్వశ్రామనికే చేరుకుంటున్నారు. కాషాయం జెండాను వీడుతున్నట్టుగా ఓ రాజీనామా లేఖను విడుదల చేసిన తుల ఉమ బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు హైదరాబాద్ బయలు దేరారు. బీసీ బిడ్డనైన తన టికెట్ నిరాకరించి దొరల కాళ్ల దగ్గర మోకారిల్లారంటూ ఓ రేంజ్ లో కామెంట్ చేసిన తుల ఉమ బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు. మద్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో గులాభి కండువా కప్పుకోనున్నారు.
క్యాడర్ లో నైరాశ్యం…
గత రెండు రోజులుగా దొరతనానికి వ్యతిరేకంగా తుల ఉమ చేసిన వ్యాఖ్యలు వేములవాడ నియోజకవర్గంలో చర్చనీయాంశం అయ్యాయి. ఉమక్కకు టికెట్ వస్తే గెలుపునకు కృషి చేయాలని భావించిన క్యాడర్ లో, బీజేపీ అధిష్టానం అమె అభ్యర్థిత్వాన్ని చివరి నిమిషంలో నిరాకరించడంతో స్థానికంగా సింపతీ పెద్ద ఎత్తున వచ్చింది. వేములవాడలో బీసీ కార్డు పెద్ద ఎత్తున వినిపిస్తున్న క్రమంలో తుల ఉమ కూడా తిరిగి బీసీలతో కలిసి నడుస్తారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అయ్యాయి. మరో వైపున అలిగి వెల్లిన కూతురు తండ్రి పంచన చేరుతుందంటూ రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి. మరో వైపున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆది శ్రీనివాస్ తో పాటు ఆ పార్టీ ముఖ్యనేత కూడా ఆమెను కలిసి సానుభూతి ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఆమెతో టచ్ లోకి వచ్చి సొంత పార్టీలోకి రావాలని కూడా కోరారు. మంత్రి కేటీఆర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ లు ఉమతో ఫోన్లో మాట్లాడడమే కాకుండా, పార్టీ అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహరావు కూడా ఇంటికి వెళ్లి కలిశారు. రెండు రోజులుగా కూడా ‘దొర’ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఉమ ఆదివారం నాడు కూడా తాన భవిష్యత్తుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, తాను ఫలానా పార్టీలో చేరుతున్నానని జరుగుతున్న ప్రచారం అంతా కూడా తప్పేనని ఎవరూ నమ్మవద్దని కోరారు. దీంతో తుల ఉమ భారీ స్కెచ్ వేసి వేములవాడలో తన సత్తా చాటుకుంటారా లేక బీసీ కార్డు నినాదంతో ముందుకు సాగి అగ్రవర్ణ నేతలకు చుక్కలు చూపిస్తారా అన్న చర్చ సాగింది. కానీ అనూహ్యంగా సోమవారం తుల ఉమ తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సమాయత్తం అయ్యారు. ఈ మేరకు 20 మంది పార్టీ శ్రేణులతో కలిసి ప్రగతి భవన్ కు బయలుదేరారు. తుల ఉమ తీసుకున్న సడన్ డెసిషన్ ఆమె వెన్నంటి నడిచిన వారిలో తీవ్ర నైరాశ్యాన్ని నింపిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. నిన్నటి వరకు ఎత్తిన గళానికి అనుగుణంగా పనిచేస్తారనుకుంటే ఇలా వ్యవహరించారంటేన్న షాకు నుండి ఆమె అనుచరులు తేరుకోలేకపోతున్నారు.
తుల ఉమ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి రాసి పంపిన పూర్తి పాఠం ఇదే…
శ్రీయుత గౌరవనీయులైన కిషన్ రెడ్డి గారికి రాష్ట్ర అధ్యక్షులు బీజేపీ తెలంగాణ.
విషయం: బీసీ బిడ్డనైన నాకు అన్యాయం చేసినందున బిజెపి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పదవికి రాజీనామా…
భారతీయ జనతా పార్టీలో చేరిన నాటినుండి పార్టీ తలపెట్టిన ప్రతీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో నావంతు కృషి చేశాను. పార్టీకి నేను చేసిన సేవను గుర్తించి నన్ను వేములవాడ ఎమ్మెల్యే అభ్యర్ధిగా ఖరారు చేశారు కానీ చివరి నిమిషంలో బీ ఫాం వేరే వాళ్ళకి ఇచ్చి నన్ను అవమానించారు. ఇది నా ఒక్కదానికి జరిగిన అవమానం కాదు నా గొల్ల కురుమ జాతికి జరిగిన అవమానం, యావత్ తెలంగాణ రాష్ట్రంలోని గొల్ల కురుమల ఆగ్రహానికి మీ నిర్ణయం కారణమైంది. బీజేపీ పార్టీలో పార్టీకోసం పనిచేసే కమిట్మెంట్ ఉన్న కార్యకర్తలు ఉన్నారు వాళ్ళందరి ఉత్సాహాన్ని మీ తప్పుడు నిర్ణయాలతో నీరుగారుస్తున్నరు. నాతో పాటు ఎందరో బీసీ నాయకులకు మీరు అన్యాయం చేశారు. అసలు బీ ఫాంలే సరిగా ఇవ్వలేని మీరు బీసీ నినాదంతో ముందుకుపోతా అనడం విడ్డూరంగా ఉంది. తెలంగాణ ఉద్యమంలో తెగించి కోట్లాడి స్వరాష్ట్రాన్ని సాధించుకున్న ఉద్యమకారురాలిగా, ఓ బీసీ బిడ్డగా వేములవాడ నియోజకవర్గ ప్రజలకు, ఉమ్మడి కరీంనగర్ ప్రజలకు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా కూడా సేవ చేసే భాగ్యం లభించింది. ఈ ప్రాంత ప్రజలతో నాకు ఉన్న అనుబంధాన్ని ఈ ఎమ్మెల్యే టిక్కెట్లు తెంపలేవు. నా ప్రజాసేవలో నేను ప్రజలకు మరింత చేరువవుతాను. మహిళా సాధికారత, మహిళలకు చట్టసభల్లో సముచిత స్థానం అని చెప్పే మీరు ఓ బీసీ మహిళనైన నన్ను ఇలా అవమానించడం బాధించింది. ఇంతటి అన్యాయం చేసిన పార్టీలో నేను కొనసాగాలేను. బీజేపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుత్వానికి రాజీనామా చేస్తున్నాను. నా వెన్నంటి ఉన్న నాయకులు, కార్యకర్తలు, ప్రజల అభిప్రాయం మేరకు త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటాను. నా వెన్నంటి ఉన్న నా గొల్ల కురుమలకు, బడుగు బలహీనవర్గాల ప్రజలకు, నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులకు, ఈ ప్రాంత ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటాను.
ధన్యవాదాలు!
తుల ఉమ