వరల్డ్ ఛాంపియన్ షిప్ ఫార్ములా ఈ రేసులో భాగంగా హుస్సేన్ సాగర తీరాన నిర్వహించిన రేసు విజయవంతంగా ముగిసింది. ఇవాళ మధ్యాహ్నం జరిగిన ఈ రేసులో ఎలక్ట్రిక్ కార్లు ఒకదానికి మించి మరొకటి పోటీపడ్డాయి. గంటకు 322 కిలోమీటర్ల వేగంతో రేసర్లు దూసుకెళ్లారు. ఈ రేసులో 11 టీమ్‌లు 22 మంది డ్రైవర్లు పాల్గొన్నారు. ఈ రేసులో జీన్ ఎరిక్ విన్నర్‌గా నిలిచారు. రెండో స్థానంలో నిక్ క్యాసిడీ, మూడో స్థానంలో సెబాస్టియన్ బ్యూమీ నిలిచారు. ఈ సందర్భంగా విన్నర్‌కు మంత్రి కేటీఆర్ బహుమతి అందజేశారు.
ఫార్ములా -ఈ రేసింగ్ లీగ్‌లో పలువురు ప్రముఖులు సందడి చేశారు. గ్యాలరీ నుంచి తమ ఫేవరెట్ జట్టు అయిన భారత్‌కు చెందిన మహీంద్రాకు సపోర్ట్ చేశారు. సినీ నటుడు నాగార్జున, రామ్‌చరణ్, నాగ చైతన్య, అఖిల్, నవదీప్, సిద్ధు జొన్నలగడ్డ, దర్శకుడు నాగ్ అశ్విన్, సినీ నిర్మాత అల్లు అరవింద్, క్రికెటర్లు యజ్వేంద్ర చాహల్, దీపక్ చాహర్, శిఖర్ ధవన్, మాజీ క్రికెటర్ సచిన్, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ రేసింగ్‌ను వీక్షించారు. భారత్‌కు రావడం చాలా సంతోషంగా ఉందని ఎఫ్ఐఏ ప్రెసిడెంట్ మహమ్మద్ సులేమాన్ తెలిపారు.
ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకమైన ఫార్ములా-ఈ రేసు హైదరాబాద్ వేదికగా జరగడం ఆనందకరమని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. నెక్లెస్ రోడ్డులో ఫార్ములా ఈ కార్లు వేగంగా దూసుకుపోతుంటే చూడటానికి ఎంతో బాగుందన్నారు. నగరంలోని యువత, మోటార్ స్పోర్ట్స్ ఔత్సాహికులు రేసును వీక్షించేందుకు తరలివస్తున్నారని కేటీఆర్ చెప్పారు. ఈ కార్యక్రమంతో హైదరాబాద్‌కు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుందని ఆకాంక్షించారు. రేస్ కారణంగా నగరవాసులకు కొంత అసౌకర్యం కలుగుతున్న విషయం వాస్తవమే.. కానీ, ఓపికతో మన్నించి సహకరిస్తున్నందుకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల ప్రవేశపెట్టిన మూడు డబుల్ డెక్కర్ బస్సుల సంఖ్యను రానున్న రోజుల్లో 30కి తీసుకెళ్లేలా చూస్తున్నామని కేటీఆర్ తెలిపారు.