ప్రాణాపాయంలో కొట్టుమిట్టాడుతున్న బాలుడు… ఆదుకోవాలని కోరుతున్న తల్లిదండ్రులు…

దిశ దశ, వేములవాడ:

కులవృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నదా కుటుంబం. రెక్కాడితే కానీ డొక్క ఆడని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఆ ఇంటి ఆశాకిరణం మృత్యువుతో పోరాడుతోంది. తమ బిడ్డను కాపాడుకునేందుకు బాసటగా నిలవాలని ఆ దంపతులు వేడుకుంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం ఆరెపల్లి గ్రామానికి చెందిన నడిగొట్ల రాజేష్, లావణ్య దంపతులకు ఇద్దరు సంతానం. వీరి కొడుకు, కూతుర్లు ఓ భవనంపై ఆడుకుంటుండగా ప్రమాదం చోటు చేసుకుంది. రాజేష్ దంపతుల కొడుకు ప్రజ్వల్(4) బిల్డింగుపై నుండి జారపడడంతో అతని తలలోకి ఇనుప రాడ్లు చొచ్చుకపోయాయి. ఈ ఘటనలో తీవ్రగాయాల పాలైన ప్రజ్వల్ కు మెరుగైన చికిత్స అందించేందుకు సికింద్రాబాద్ లోని రెయిన్ బో ఆసుపత్రికి తరలించించారు. తలలోపలి భాగంలో తీవ్రమైన గాయం అయిందని డాక్టర్లు చెప్పారు. ప్రజ్వల్ కు ఆపరేషన్ చేసి ఇనుప రాడ్లను బయటకు తీయాలని చెప్పారు. ఇందుకు రూ. 20 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పడంతో పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న రాజేష్ తన కొడుకును బ్రతికించేందుకు దాతలు సహకరించాలని అభ్యర్థిస్తున్నాడు. ఆరెపల్లితో పాటు ఇరుగు పొరుగు గ్రామాలకు చెందిన వారు కూడా తమవంతుగా చేదోడుగా నిలుస్తున్నప్పటికీ అవసరమైనంత డబ్బు మాత్రం చేతికి అందడం లేదు. కులవృత్తిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న రాజేష్ కుటుంబానికి స్థిరాస్థులు కూడా లేకపోవడంతో నాలుగేళ్ల బాబును కాపాడుకునేందుకు దాతలు ముందుకు రావాలని స్థానికులు అభ్యర్థిస్తున్నారు. దాతలు తమవంతు సాయం అందించినట్టయితే ప్రజ్వల్ ఆపరేషన్ కు అయ్యే డబ్బు ఆసుపత్రికి చెల్లించి తమ బిడ్డను కాపాడుకుంటామని రాజేష్ దంపతులు చెప్తున్నారు. దాతలు తమవంతుగా సాయం అందించేందుకు 8185828485 నంబర్ ద్వారా గూగుల్ పే లేదా, ఫోన్ పే ద్వారా డబ్బులు పంపించాలని కోరుతున్నారు. నిరుపేద కుటుంబం అయినందున ప్రజ్వల్ ను బ్రతికించుకునేందుకు వేములవాడ ప్రాంత వాసులు తమవంతుగా బాసటగా నిలుస్తున్నప్పటికీ చాలినంత డబ్బు జమ కాలేదని ఆరెపల్లి వాసులు తెలిపారు. దాతలు తమవంత ధాతృత్వాన్ని చాటుకోవాలని కోరుతున్నారు.

You cannot copy content of this page