పసి హృదయాల్లో కసి నింపుతున్నామా..? పెద్దలంటే ఏహ్య భావం కల్పిస్తున్నామా..?

దిశ దశ, చందుర్తి:

ఉమ్మడి కుటుంబ వ్యవస్థను చేజేతులారా నాశనం చేసుకుంటున్న నేటి సమాజం భవిష్యత్తు తరాలకు అందిస్తున్న సందేశం ఏంటీ..? కుటుంబ వ్యవస్థపై గౌరవాన్ని ఇనుమడింప జేయాల్సిన పెద్దలు వ్యవహరిస్తున్న తీరు వల్ల పసి హృదయాల్లో ఎంతటి కసిని నింపుతున్నామో తెలుసా..? తల్లిదండ్రుల ఆదరణలో పెరిగి పెద్దవారై మెట్టినింటికి చేరిన తరువాత అదే తన కుటుంబమనుకోకుండా నడుచుకుంటున్న తీరు తమ వారసులపై పడుతోందన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవల్సిన ఆవశ్యకతను తెలియజేస్తోంది ఈ ఘటన. తొలి గురువుగా ఉండే అమ్మ తన బిడ్డలకు చందమామా రావే జాబిల్లి రావే అని పాడుతూ గోరు ముద్దలు తినిపిస్తూ పెద్దలపై గౌరవ భావం కల్గించే విధంగా చొరవ తీసుకోవల్సిన అవసరం ఉంది. పూర్వ కాలంలో అయితే తాతల నుండి మనవలు, మనవరాళ్ల వరకు కూడా ఒకే కుటుంబం అన్న భావనతో కాలం వెల్లదీశారు. కానీ ఇటీవల కాలంలో ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తూ కలివిడిగా ఉండడం కంటే విడివిడిగా ఉండడానికే మక్కువ చూపుతున్నారు. అభిప్రాయ బేధాలు ఎన్ని ఉన్నా పెద్ద వారిని ఆదరించే తీరు నాటి తరానిదైతే వారిని చీత్కరించుకుంటున్న తీరు నేటితరంలో కొంతమంది అలవర్చుకున్నారు. ఇలా వ్యవహరిస్తున్న తల్లిదండ్రుల ప్రభావం తమ పిల్లలపై పడుతోందన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా పెద్దలపై ప్రదర్శిస్తున్న కోపతాపాలు చిరు హృదాయాల్లో బలంగా నాటుకపోతున్నాయి. నెట్టింట వైరల్ అవుతున్న ఈ ఘటన నేటితరం చిన్నారుల్లో పేరెంట్స్ కల్పిస్తున్న భావన ఎంత దారుణంగా ఉందో స్పష్టం అవుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి నర్సింగాపూర్ ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థి పరీక్షా పత్రంలో రాసిన సమాధానం అన్ని వర్గాలను విస్మయ పరిచింది.

ప్రశ్నలు ఇలా… సమాధానం అలా…

ఇంగ్లీష్ పరీక్షా పత్రంలో అమ్మకు నచ్చినవి ఏంటీ..? నచ్చనివి ఏంటీ అన్న ప్రశ్నలు వరసగా ఉన్నాయి. అమ్మకు నచ్చినవి సన్ ఫ్లవర్, బ్లాక్ కలర్ అని రాసిందా చిన్నారి. అమ్మకు నచ్చనవి ఏంటన్న ప్రశ్నకు గ్రాండ్ ఫాధర్, గ్రాండ్ మథర్ అని రాసింది. నాలుగో తరగతి చదువున్న విద్యార్థి తన తల్లి ఇంట్లో నడుచుకుంటున్న ప్రభావం ఎంతమేర పడి ఉంటే ఏకంగా పరీక్షా పత్రాల్లో రాసి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల కాలంలో కొంతమంది పేరెంట్స్ తమతో కలిసి జీవనం సాగిస్తున్న పెద్దల గురించి తమ పిల్లలను దూరంగా ఉంచే ప్రయత్నం చేయడం, వారంటే అసహ్యించుకునే విధంగా చెప్పడం వంటి అంశాలు కూడా చిన్నారులపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. చిన్నారుల ముందు పెద్దలను తులనాడుతున్న తీరు కూడా చిన్నారులు గమనించి వారి మనసుల్లో వ్యతిరేకతను నాటుకునే విధంగా మసలుకుంటుండడం కూడా ఈ పరిస్థితికి కారణమని చెప్పకతప్పదు.

ఆ వయసుకు చేరితే…

తమ కడుపుల పుట్టిన బిడ్డల ముందు పెద్దల పట్ల ఇష్టారీతిన వ్యవహరిస్తుండడం, చిన్నారుల్లో కల్మశం నింపడంలో సఫలం అవుతున్నామనుకుంటున్న పేరెంట్స్ తమ భవిష్యత్తును కూడా ఊహించకుంటే వాస్తవిక ప్రపంచం కళ్ల ముందే కనిపించే అవకాశం ఉంటుందని అంటున్న వారూ లేకపోలేదు. తమ పిల్లల్లో తాతయ్య, నాయనమ్మ, అమ్మమ్మలను అసహ్యంచుకునే విధంగా వ్యవహరిస్తే అదే పరిస్థితి తాము వృద్దాప్యానికి చేరుకున్న తరువాత ఎదురైతే ఎలా ఉంటుందన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవల్సిన అవసరం ఉంది. ఆ పిల్లలే పెద్ద వారై తమ వారసులకు పెద్దలతో దూరంగా ఉంచే పరిస్థితి ఎదరుయినప్పుడు ఎంతటి బాధను అనుభవిస్తారో అర్థం చేసుకోవల్సిన ఆవశ్యకత కూడా ఉంది. ఏది ఏమైనా నర్సింగాపూర్ విద్యార్థి పరీక్షా పత్రంలో రాసిన సమాధానంతో అయినా తల్లిదండ్రులు తమ పిల్లల్లో ప్రేమానురాగాలు పెంచే ప్రయత్నం చేయాల్సి ఉందన్నది స్పష్టం అవుతోంది.

You cannot copy content of this page