బ్యాంకు ఉద్యోగులకే టోకరా ఇచ్చిన ఘనుడు
పట్టుకున్న పోలీసులు
దిశ దశ, మంచిర్యాల:
ఇప్పటి వరకు బ్యాంకులకు వచ్చే అమాయకుల దృష్టి మరల్చి డబ్బులు ఎత్తుకెళ్లే వారి గురించి విన్నాం… కానీ బ్యాంకు ఉద్యోగులను సైతం బురిడి కొట్టించిన ఘటనలు కూడా జరుగుతున్నాయి. తాజాగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగిన ఇలాంటి ఘటనకు పాల్పడిన నిందితున్ని మంచిర్యాల టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ముఖానికి మాస్కు ధరించిన ఓ యువకుడు HDFC బ్యాంకులోకి ఎంటర్ అయ్యాడు. క్యాష్ కౌంటింగ్ మిషన్ రిపేర్ చేస్తానని చెప్పడంతో నమ్మారు బ్యాంకు ఉద్యోగులు. క్యాషీయర్ వెంటనే తన వద్ద ఉన్న కౌంటింగ్ మిషన్ అప్పగించాడు. దానిని బాగు చేసినట్టుగా కొద్ది సేపు నటించిన ఆ యువకుడు సార్ ఓ 50 వేల క్యాష్ ఇవ్వండి కౌంటింగ్ మిషన్ చెక్ చేయాల్సి ఉందని చెప్పడంతో అతని చేతిలో డబ్బులు ఉంచాడు. కొద్ది సేపు కౌంటింగ్ మిషన్ పనితీరును పరిశీలిస్తున్నట్టుగా నటించి అక్కడి నుండి ఉడాయించాడు. అగంతకుని ఆచూకి కనిపించకపోవడంతో హుటాహుటిన పోలీస్ స్టేషన్ కు వెల్లి ఫిర్యాదు చేశారు. ఆగస్టు 3వ తేదిన మంచిర్యాల ఐబీ చౌరస్తాలోని HDFC బ్యాంకులో ఈ ఘటన చోటు చేసుకుంది. మంచిర్యాల టౌన్ పోలీసులు క్రైం నంబర్ 510/2024గా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం ఆరంభించారు. ఎట్టకేలకు పోలీసులు నిందితున్ని పట్టుకుని అరెస్ట్ చేయడంతో వెరైటీ దొంగ కటకటాల పాలయ్యాడు. నిందితుడు రోహిత్ బాబులాల్ ప్రకాష్ కాలే (30) ప్రస్తుతం సికింద్రాబాద్ మచ్చ బొల్లారంలోని సూర్యానగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడుని పోలీసులు తెలిపారు. మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లా వనికి చెందిన నిందితుని కుటుంబం గత కొంతకాలంగా సికింద్రాబాద్ లో నివాసం ఉంటోంది. రోహిత్ తన తండ్రి, అన్నతో కలసి నిజామాబాదు జిల్లాలోని పోలీస్ స్టేషన్ లలో ప్రింటింగ్, జిరాక్స్ మెషిన్ లను బాగుచేసేందుకు వెల్లేవాడు. ఈ క్రమంలోనే తన అన్న వద్ద సాంకేతిక పరిజ్ఞానం నేర్చుకొన్నాడు. అయితే అతని తండ్రి అనారోగ్యంతో మరణించడంతో ఏ పనిచేయకుండా కాలం వెల్లదీస్తున్న రోహిత్ తనకు ఉన్న కేతిక పరిజ్ఞానంతో మోసాలకు పాల్పడాలని భావించాడు. గతంలో మెదక్ ప్రాంతంలో కూడా ఇదే విధంగా క్యాష్ కౌంటింగ్ మిషన్లను రిపేరు చేస్తానని చెప్పి డబ్బులు ఎత్తుకెళ్లినట్టు పోలీసుల విచారణలో తేలింది. నిందితుడు రోహిత్ ను మంచిర్యాల ఇన్స్ పెక్టర్ బన్సీలాల్, సెక్టార్ ఎస్ఐ వినిత, పోలీసు సిబ్బంది పట్టుకున్నారు.