Sand Mafia @ 6am to 10.30 am

దిశ దశ, పెద్దపల్లి:

ఇసుక అక్రమ రవాణాకు అనువైన సమయని ఎంచుకున్నారా..? లేక ఆ సమయంలో అయితే బావుంటుందని ఎవరైనా సూచించారో తెలియదు కానీ… ఇసుక రీచుల నుండి మాత్రం జీరో దందా యథేచ్ఛగా సాగుతోంది. ఉదయం 6 గంటల నుండి 10.30 గంటల లోగా లారీల్లో ఇసుక నింపి చకాచకా రోడ్డెక్కిస్తున్నారు. 10.30 గంటల వరకు పెద్దపల్లి జిల్లా కేంద్రం దాటించే విధంగా వ్యూహాలు రచించుకుంటున్నారు. దర్జాగా సాగుతున్న ఇసుక అక్రమ రవాణాపై విజిలెన్స్ అధికారులు కానీ, టీఎస్ఎండీసీ కానీ, రవాణా విభాగం అధికారులు కానీ పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఆ రెండు జిల్లాలు…

పెద్దపల్లి భూపాలపల్లి జిల్లాలకు చెందిన ఇసుక రీచుల కేంద్రంగా సాగుతున్న జీరో దందా వల్ల నిర్వాహకులు రూ. కోట్లు గడిస్తుంటే, సర్కారు ఖజానాకు గండి పడుతోంది. ఖమ్మంపల్లి, గోపాల్ పూర్, తాడిచర్ల ఇసుక రీచుల నుండి ఉదయం 6గంటల నుండి 10.30గంటల వరకు వే బిల్లులు లేకుండా ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఒక్కో రీచు నుండి 30 వరకు లారీలు జీరోగా తరలిపోతున్నాయని తెలుస్తోంది. హైదరాబాద్ వరకు సేఫ్ గా చేరిపోతున్న ఈ ఇసుక విక్రయాలు జరిపి లక్షల రూపాయల ఆదాయాన్ని గడిస్తున్నారు. రీచుల కేంద్రంగా సాగుతున్న ఈ అక్రమ దందా గురించి టీఎస్ఎండీసీ పట్టించుకుంటున్న పాపాన పోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మిషనరీతో లారీల్లో ఇసుక నింపుకుని వెలుతున్న ఈ లారీలు పట్టుబడిన సందర్భాలు కూడా లేవంటే ఇసుక మాఫియా ఏ స్థాయిలో Network ఏర్పాటు చేసుకుందో అర్థం చేసుకోవచ్చు.

ధరలు ఇలా..?

ఇకపోతే జీరో దందా ద్వారా విక్రయాలు చేస్తున్న ఇసుక లారీలకు ఫిక్స్ ధరలు కూడా నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఓవర్ లోడ్ తో సహా నింపేందుకు అంతర్గత ఒప్పందాలు చేసుకున్న ఈ మాఫియా నిర్భయంగా దందా కొనసాగిస్తోంది. తాడిచర్ల, ఖమ్మంపల్లి రీచుల నుండి అయితే ఒక్కో లారీకి రూ. 24 వేలు, గోపాలపూర్ ఇసుక రీచు నుండి అయితే రూ. 34 వేల ధర నిర్ణయించినట్టుగా సమాచారం. గోపాలపూర్ ఇసుక సన్నగా ఉండడంతో భవన నిర్మాణాలకు అవసరం ఎక్కువగా ఉంటుందన్న కారణంగా ధర ఎక్కువగా నిర్ణయించినట్టుగా బాహాటంగానే చెప్తున్నారు. హైదరాబాద్ చేరుకున్న తరువాత ఒక్కో లారీ ఇసుకకు లక్షల్లో ధర గిట్టుబాటు అవుతుండడంతో వ్యాపారులు రీచుల నిర్వాహాకుల ద్వారా జీరో దందా చేసేందుకు ముందుకు వస్తున్నారు.

బాధ్యతలు ఇలా…

ఇకపోతే ఉదయం 10.30 గంటల లోగా జీరో ఇసుక రవాణా చేసే లారీలు పెద్దపల్లి దాటాలన్న నిర్ణయించడమే కాకుండా ఆలస్యం అయినట్టయితే మిగతా లారీలను ఉదయం 11.30 గంటల తరువాత రోడ్డెక్కించే విధంగా ప్లాన్ చేసినట్టు కూడా తెలుస్తోంది. జీరో దందా సాగించే లారీలను తనిఖీ చేయకుండా ఉండేందుకు కూడా లారీ వాలాలు, రీచు నిర్వాహకుల మధ్య ప్రత్యేక ఒప్పందాలు జరిగినట్టుగా తెలుస్తోంది. సిద్దిపేట దాటే వరకు ఎలాంటి చెకింగ్ కాకుండా, తప్పనిసరి పరిస్థితుల్లో తనిఖీలు జరిగినా సర్దుబాటు చేసుకునే బాధ్యత రీచుల నిర్వాహాకులు చూసుకుంటారని, ఆ తరువాత ఎలాంటి ఇబ్బంది జరిగినా లారీ యజమానులో లేక ఇసుక వ్యాపారులో చూసుకోవల్సి ఉంటుందన్న ఒప్పందాలు కూడా చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు సాగుతున్న ఈ దందా దర్జాగా సాగుతున్నా దాడులు చేయడం కానీ ఓవర్ లోడ్ రవాణా అవుతున్న కేసులు కానీ, రీచుల వద్ద కట్టడి చర్యలు కానీ తీసుకోకపోవడమే ఇందుకు ప్రత్యక్ష్య సాక్ష్యమని అంటున్నారు కొందరు.

3 రీచులు @ 35 లక్షలు..?

కేవలం 4 గంటల నుండి 5 గంటలలోగా ఖమ్మంపల్లి, గోపాలపూర్, తాడిచర్ల రీచులలో రోజుకు సుమారు రూ. 35 లక్షల మేర టర్నోవర్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఆయా లారీలకు రీచు నిర్వాహకులకు మధ్య జరుగుతున్న లావాదేవీలే ఇవి కాగా, ఇతరాత్ర ఆర్థిక లావాదేవీలు అదనమని తెలుస్తోంది. దీంతో పాటు మద్యాహ్నం, సాయంత్రం వేళల్లో తరలించే లారీల ద్వారా జరిగే క్రయవిక్రయాలు కూడా ఉంటాయని, అవి అవకాశాన్ని బట్టి రోడ్డెక్కుతాయని తెలుస్తోంది.

You cannot copy content of this page