పారా త్రోబాల్ పోటీలకు ఎంపికైన యువతి
ఆర్థిక వనరులే అడ్డంకి…
దిశ దశ, పలిమెల:
తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు… ఉపాధి కోసం తల్లి వెంట వెల్లినప్పుడు ప్రమాదానికి గురైంది. అయినా అటు చదువుల్లో, ఇటు ఆటల్లో రాణిస్తోంది. అటవీ ప్రాంతానికి చెందిన ఆ బిడ్డ అంతర్జాతీయ స్థాయి పోటీలకు వెళ్లాలంటే ఆర్థిక పరిస్థితి సహకరించడం లేదని తల్లడిల్లిపోతోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండల కేంద్రానికి చెందిన కావేరి జ్యోతి ప్రస్తుతం హన్మకొండ ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఈయర్ చదువుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్న జ్యోతి పారా త్రోబాల్ విభాగంలో అంతర్జాతీయ పోటీలకు ఎంపికయింది.
ప్రమాదానికి గురై…
జ్యోతి ఐదేళ్ల వయసులో ఉన్నప్పుడు ఉపాధి కోసం పెద్దపల్లికి వెల్లిన తన తల్లితో కలిసి వెల్లింది. రోడ్డు దాటుతుండగా లారీ ఢీ కొట్టడంతో కాలికి తీవ్ర గాయం కావడంతో కృత్తిమ కాలును అమర్చారు వైద్యులు. 9వ తరగతి వరకు మహదేవపూర్ కస్తూర్బా పాఠశాలలో చదువుకున్న ఆమె పదో తరగతి మంథనిలో పూర్తి చేశారు. ఇంటర్ ఫస్ట్ ఈయర్ నుండి డిగ్రీ వరకు వరంగల్ లో విద్యనభ్యసిస్తున్నారు. ఐదేళ్ల క్రితం ప్రశాంత్ ఇచ్చిన సలహా మేరకు ఆమె ఆసక్తిని చదువుతో పాటు క్రీడలపై కూడా పెంచుకుంది. త్రోబాల్ ను ఎంచుకున్న కావేరి జ్యోతి అద్భుతమైన ప్రదర్శన తీరు కనబరుస్తూ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు, ఈ ఏడాది సెప్టెంబర్ 21 నుండి 23 వరకు ఝార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీ తానా భగత్ ఇండోర్ స్టేడియంలో పారా త్రోబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా క్రీడలను నిర్వహించింది. ఈ గేమ్స్ కు హాజరు అయిన కావేరి జ్యోతి కంబోడియాలో జరగనున్న అంతర్జాతీయ పోటీలకు ఎంపికయింది. కేవలం ఐదేళ్ల సమయంలోనే త్రోబాల్ లో తనదైన ప్రతిభను ప్రదర్శించిన ఆమె అంతర్జాతీయ పోటీలకు ఎంపిక కావడం విశేషం. ఈ ఏడాది డిసెంబర్ లో జరగనున్న పారా త్రోబాల్ అంతర్జాతీయ పోటీలకు వెళ్లాల్సి ఉంది.
పేదరికంతో…
వ్యవసాయ కూలీలైన తల్లిదండ్రులు పంపిస్తున్న డబ్బులు, దివ్యాంగుల కోటాలో వచ్చే పెన్షన్ తోనే డిగ్రీ ఫైనల్ ఈయర్ వరకు చేరుకున్న జ్యోతి పారా గేమ్స్ వైపు కూడా అడుగులు వేశారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్న కావేరి జ్యోతి అంతర్జాతీయ పోటీలకు వెల్లేందుకు ఆర్థిక పరిస్థితులు అడ్డుపడుతున్నాయి. ఇందుకు అవసరమైన డబ్బు వెచ్చించే స్తోమత లేకపోవడంతో తాన కెరీర్ పై ఆందోళన వ్యక్తం చేస్తోంది. నిరుపేద కుటుంబానికి చెందిన జ్యోతిని ఆర్థికంగా ఆదుకునేందుకు దాతలు ముందుకు వచ్చినట్టయితే అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తానని ధీమా వ్యక్తం చేస్తోంది. క్రీడాకారులు, క్రీడాభిమానులు, ప్రభుత్వం కానీ ఆమెకు సాయం చేసేందుకు ముందుకు రావల్సిన అవసరం ఎంది. ఎక్కడో మారుమూల ప్రాంతంలో పుట్టి… చిరుప్రాయంలో ప్రమాదం కారణంగా కాలును కోల్పోయి కృత్తిమ కాలుతోనే క్రీడల్లో రాణిస్తున్న ఆమెకు బాసటగా నిలిచి మనో ధైర్యాన్ని నింపాల్సిన అవసరం ఉంది. దాతలు గూగుల్ పే లేదా, ఫోన్ పే నంబర్ +919392993323 ద్వారా జ్యోతికి సాయం అందించగలరు. అక్టోబర్ 15లోగా జ్యోతి రూ. 50 వేలు చెల్లిస్తేనే అంతర్జాతీయ పోటీలకు హాజరయ్యే అవకాశం ఉంటుంది.