ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు…
దిశ దశ, హైదరాబాద్:
పోలీసు అధికారుల చుట్టే తిరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు ఇక పొలిటికల్ లీడర్ల చుట్టూ తిరగనుంది. పోలీసు అధికారుల ప్రమేయం ఉందన్న కోణంలో జరిగిన దర్యాప్తు ఇక రాజకీయ నాయకుల కేంద్రీకృతంగా సాగనుంది. ఈ కేసులో ఇద్దరు ముఖ్య నేతలు చెప్పినట్టుగానే తాము నడుచుకున్నామని, వారి ఆదేశాల మేరకే ట్యాపింగుకు పాల్పడ్డామని ఇప్పటి వరకు అరెస్ట్ అయిన పోలీసు అదికారులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఇన్వెస్టిగేషన్ చేయాలని నిర్ణయించుకున్నారు పోలీసు అధికారులు. ఇందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు ముఖ్య నాయకులకు నోటీసులు ఇచ్చేందుకు పోలీసు అధికారులు సన్నద్దమవుతున్నట్టు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన ఈ ఇద్దరు నేతలను ప్రశ్నించనున్న దర్యాప్తు బృందం వారి భాగస్వామ్యం ఉందని తేలితే అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది.
36 మంది బడా వ్యాపారులను…
ఫోన్ ట్యాపింగ్ చేసిన వారిలో ప్రముఖ బంగారు ఆభరణాల వ్యాపారులు, బిల్లర్డు కూడా ఉన్నారని విచారణలో నిందితులు చెప్పినట్టుగా తెలుస్తోంది. మొత్తం 36 మందికి సంబంధించిన ఫోన్ ట్యాపింగులు చేసి వారి నుండి భారీగా డబ్బులు వసూలు చేశామని కూడా నిందితులు దర్యాప్తు అధికారుల ముందు కన్ఫెస్ అయ్యారని సమాచారం. ఆయా వ్యాపారుల వివరాలను సేకరించేందుకు హైదరాబాద్ సిటీ పోలీసులు స్పెషల్ టీమ్స్ ను రంగంలోకి దింపినట్టుగా తెలుస్తోంది. వీరి నుండి ఎంత మొత్తంలో డబ్బులు వసూలు చేశారు..? ఎవరెవరు ఫోన్లు చేశారు..? ఎవరి ద్వారా హెచ్చరికలు పంపించారోనన్న విషయాలపై కూపీ లాగే పనిలో పడినట్టుగా తెలిసింది. ఇప్పటి వరకు ఓ మంత్రి రాసలీలకు సంబంధించిన ఎపిసోడ్ తో పాటు మరో మంత్రి అనుచరుల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసి వారిని కూడా బెదిరింపులకు పాల్పడినట్టుగా పోలీసు అధికారులు విచారణలో గుర్తించారు.
టచ్ లోకి వచ్చారా..?
ప్రణిత్ రావుతో పాటు మరో ఇద్దరు పోలీసు అధికారులు తిరుపతన్న, భుజంగరావులను అరెస్ట్ చేసిన తరువాత నిందితుల జాబితాను దర్యాప్తు అధికారులు అప్ డేట్ చేశారు. ఇప్పటి వరకు సింగిల్ అక్యూజ్డ్ గా ఉన్న ప్రణిత్ రావుతో పాటు మరికొందరి పేర్లను కూడా చేర్చారు. ఈ మేరకు ఎఫ్ఐఆర్ మార్చిన పోలీసులు ప్రణిత్ రావు, భుజంగరావుల పేర్లను చేర్చారు. మరో వైపున విదేశాల్లో ఉన్న వారి కోసం లుక్ ఔట్ సర్క్యూలర్ నోటీసులు కూడా పోలీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావు ఓ పోలీసు ఉన్నతాధికారికి వాట్సప్ కాల్ ద్వారా టచ్ లోకి వచ్చారని ప్రచారం జరుగుతోంది. తాను క్యాన్సర్ చికిత్స కోసం వచ్చానని, జూన్, జులై నెలల్లో తిరిగి హైదరాబాద్ కు వస్తానని ప్రభకార్ రావు తెలిపినట్టుగా పోలీసు వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఎలా చెప్తే మీరెలా చేస్తున్నారో… అప్పటి ప్రభుత్వం ఎలా చెప్తే అలా తాము నడుచుకున్నామని సదరు పోలీసు అధికారితో అన్నట్టుగా సమాచారం. మనం మనం పోలీసులం కదా… మనం మనం ఒకటి అయినప్పటికీ తమ ఇళ్లలో సోదాలు చేయడం ఏంటని ఆయన ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. అయితే సదరు పోలీసు అధికారిక కూడా తనకు ఏదైనా చెప్పదల్చుకున్నట్టయితే అఫిషియల్ మెయిల్ ద్వారా సమాధానం పంపాలని ఆ పోలీసు ఉన్నతాధికారి సూచించడంతో సమాధానమేమీ చెప్పుకుండానే ఫోన్ కట్ చేసినట్టుగా పోలీసు వర్గాల సమాచారం. అయితే ఇంత వరకు మాత్రం ప్రభాకర్ రావు నుండి ఎలాంటి లిఖిత పూర్వక సమాధానం తెలంగాణ పోలీసు అధికారులకు రానట్టుగా తెలుస్తోంది. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న చర్చ సాగుతోంది. హైదరాబాద్ కు వచ్చి ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి పూర్తి వివరణ ఇస్తారా లేక అక్కడే ఉండిపోతారా అన్నా తర్జనభర్జనలు కూడా మెదలయ్యాయి. విజిటింగ్ వీసాలో వెల్లినందున ఆరు నెలలకు మించి అక్కడే ఉండే అవకాశాలు లేవని ఖచ్చితంగా ఇండియాకు వస్తారన్న నమ్మకంతోనే రాష్ట్ర పోలీసు అధికారులు ఉన్నారు.