పొన్నం ప్రభాకర్ రాజకీయ జీవితం...
దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ లోని మంకమ్మతోటకు చెందిన ఆయన నాలుగు దశాబ్దాలుగా ఎత్తిన జెండా నీడనే ముందుకు సాగుతున్నారు. పార్టీ పదవులు వరించినా చట్ట సభకు ఎన్నిక కావాలన్న కలలు సాకారం చేసుకున్న విద్యార్థి ఉద్యమ కారుడు. అసెంబ్లీలో అడుగు పెట్టాలనుకున్న ఆయనకు అనూహ్యంగా లోకసభలో అడుగు పెట్టే ఛాన్స్ వచ్చింది. ఆ తరువాత ఆయన చేసిన ప్రయత్నాలేవి సక్సెస్ కాలేదు. అయినా వెనకడుగు వేయకుండా అసెంబ్లీలోకి అడుగుపెట్టిన తొలిసారే మంత్రిపదవి అందుకున్నారు. స్కూటర్ పై తిరుగుతూ విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్న ఆ నాయకునిపై దాడులు జరిగిన సందర్భాలూ లేకపోలేదు.
పొన్నం ప్రభాకర్…
విద్యార్థి దశ నుండే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్న పొన్నం ప్రభాకర్ ఎస్సారార్ కాలేజీ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఓ సారి ప్రత్యర్థి వర్గం ఆయనపై చేసిన దాడి నుండి తప్పించుకున్న తీరు గురించి నేటికీ ఆ తరానికి చెందిన వారు చెప్పుకుంటుంటారు. ప్రత్యర్థి విద్యార్థి వర్గానికి చెందిన వారు పొన్నంపై ముప్పేట దాడి చేసినా ఎదురుదాడికి దిగి చాకచక్యంగా తప్పించుకున్నారు. విద్యార్థి దశ నుండి కాంగ్రెస్ అనభంద విద్యార్థి సంఘం ఎన్ఎస్ యూఐలో చేరిన పొన్నం దశాబ్దాల పాటు విద్యారంగ సమస్యలపై పోరాటాలు చేశారు. ఎలాంటి కమ్యూనికేషన్స్ లేని కాలంలో కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంతటా పర్యటించి ఎన్ఎస్ యూఐకి పటిష్టమైన పునాదులు వేశారు. జువ్వాడి చొక్కారావు శిష్యుడిగా ఎదిగిన పొన్నం ఆరేళ్ల పాటు కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఎన్ఎస్ యూఐ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తించారు. సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తూ మారుతీ వ్యాన్ లో ఊరూవాడ అనకుండా తిరుగుతూ ప్రభాకర్ విద్యా రంగ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేశారు. ఎలాంటి రాజకీయ నేపథ్యంలోని కుటుంబంలో పుట్టిన పొన్నం ప్రభాకర్ సొంతగా తనకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారని ఆయనను విమర్శించే వారూ అంటుంటారు.
ఎమ్మెల్యే కావాలని ఆశించి…
ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసిన పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే కావాలన్న ఆకాంక్షతో కరీంనగర్ లో పట్టు నిలుపుకునే ప్రయత్నం చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీలో సమీకరణాల నేపథ్యంలో టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర్య అభ్యర్థి ఒంటరి పోరాటం చేసిన పొన్నం ఏకంగా 25 వేల పైచిలుకు ఓట్లు సాధించడంతో అధిష్టానం దృష్టిలో పడ్డారు. అప్పటికే ఏఐసీసీ ముఖ్య నేతల గుర్తింపు పొందిన పొన్నం ఎమ్మెల్యే ఎన్నికల్లో ఆయన సాధించుకున్న ఓట్ల గురించి పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. 2009లో కరీంనగర్ ఎపీంగా గెల్చిన ఆయన ఉమ్మడి రాష్ట్ర ఎంపీల ఫోరం కన్వీనర్ గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో కరీంనగర్ నుండి మరోసారి చట్ట సభలకు ఎన్నిక కావాలని ప్రయత్నించినా సక్సెస్ కాలేకపోయినా… పట్టు వదలని విక్రమార్కుడిలా ముందుకు సాగారు. తెలంగాణ ఆవిర్భావం కోసం ఎంపీగా తనవంతు బాధ్యతలు నిర్వర్తించడంలో సఫలం అయిన పొన్నం విభజన బిల్లు లోకసభలో ఆమోదంపొందడంలో ముఖ్య భూమిక పోషించారు. అధిష్టానం పెద్దలను మెప్పించి ఒప్పించడంలో ప్రధాన పాత్ర పోషించిన ఆయన బిల్లుపై చర్చ జరుగుతున్న క్రమంలో పెప్పర్ స్ప్రే దాడికి కూడా గురయ్యారు. అయినప్పటికీ వెనకడుగు వేయకుండా స్వరాష్ట్ర కల సాకారంలో తనవంతు బాధ్యతలు నిర్వర్తించిన పొన్నం… బిల్లు పాస్ కాగానే ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీకి పాదాభివందనం చేసి తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన తల్లిగా అభివర్ణించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ గా పని చేసిన ఆయన ఎన్నికల సమయంలో పలు కమిటీల్లోనూ బాధ్యతలు చేపట్టారు.
హుస్నాబాద్ వైపు పయనం…
తాజా ఎన్నికల్లో పొన్నం ప్రభాకర్ భవితవ్యం ఎలా ఉండబోతోంది… కరీంనగర్ నుండి పోటీ చేస్తారా లేదా..? ఆయన మళ్లీ చట్ట సభలోకి అడుగుపెడ్తారా లేదా అన్న చర్చ సాగుతున్న క్రమంలో అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారు. కరీంనగర్ కన్నా తనకు హుస్నాబాద్ బెటర్ అని భావించిన పొన్నం ఆ దిశగా అడుగులు వేసి సక్సెస్ అయ్యారు. హుస్నాబాద్ టికెట్ ఇవ్వాలని కోరుతూ పీసీసీకి దరఖాస్తు చేసుకున్న ఆయన అందరి అంచనాలను తలకిందులు చేశారు. అప్పటికే హుస్నాబాద్ నుండి టికెట్ ఆశిస్తున్న అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి సొంతగూటికి చేరడంతో పొన్నం నిర్ణయం సరైంది కాదన్న వాదనలు తెరపైకి తీసుకొచ్చారు. తనపై వస్తున్న విమర్శలను పట్టించుకోకుండా హుస్నాబాద్ లో తన పట్టు నిలుపుకునేందుకు పావులు కదుపుతూ ముందుకు సాగారు. ఇక్కడి నుండి టికెట్ ఆశిస్తున్న ప్రవీణ్ రెడ్డికి పెద్ద ఎత్తున ఓటు బ్యాంకు ఉన్నందున పొన్నంకు టికెట్ వస్తుందా రాదా అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే టికెట్ రేసులో దూకుడుగా వ్యవహరించిన పొన్నం ప్రభాకర్ వైపే అధిష్టానం మొగ్గు చూపింది. టికెట్ దక్కిన తరువాత ఓ వైపున ప్రచారం చేస్తూనే మరో వైపున పార్టీలో నెలకొన్న అసమ్మతిని చల్లార్చడంలోనూ సఫలం అయ్యారు. ఇక్కడి నుండి టికెట్ ఆశించిన అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి మద్దతు కూడగట్టుకోవడంలో మంత్రాంగం నెరిపి సక్సెస్ అయిన పొన్నం ఎమ్మెల్యేగా గెలిచి తాను హుస్నాబాద్ ను ఎంచుకోవడం సరైందేనని చేతల్లోనే చూపించారు. తొలిసారే అసెంబ్లీలోకి అడుగుపెట్టినప్పటికీ విద్యార్థి ఉద్యమాలు, పార్టీతో పెనవేసుకున్న అనుభందం వంటి అంశాలతో పాటు బీసీ నేత కావడంతో ఆయనకు మంత్రివర్గంలో స్థానం కల్పించారు. ఇతర పార్టీల నుండి పిలుపు వచ్చినా పొన్నం ప్రభాకర్ మాత్రం కాంగ్రెస్ పార్టీ పంచనే ఉంటూ తనదైన ముద్ర వేసుకున్నారు. గులాభి కండువా కప్పుకోవడం ఖాయం అన్న రీతిలో ప్రచారం జరిగినా ఆయన మాత్రం కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని కుండబద్దలు కొట్టారు. ఇదే ఆయనకు కలిసి వచ్చి మంత్రిని చేసిందని పొన్నం అనుచరులు అంటున్నారు.