అరెస్ట్ చేసిన పోలీసులు
హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో ఇద్దరు మావోయిస్టులను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. అడవులను వదిలి జనారణ్యంలో జీవనం సాగిస్తున్న వీరి ఆచూకి పట్టుకుని మరీ పోలీసులు అరెస్ట్ చేయడం గమనార్హం. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పలు హోదాల్లో మావోయిస్టు పార్టీలో బాధ్యతలు నిర్వర్తించిన వీరు గత కొంతకాలంగా హైదరాబాద్ లో నివసిస్తున్నారని గడ్చిరోలీ పోలీసులు తెలిపారు.
2006 నుండి మిస్సింగ్
గడ్చిరోలి జిల్లా బస్వాపూర్ కు చెందిన టూగే అలియాస్ మధూకర్ 2002 నుండి పీపుల్స్ వార్ లో పనిచేస్తున్నారు. జిమ్మలగట్టు, అహేరీ ఏరియా దళాల్లో సభ్యుడిగా పనిచేసిన టూగే సిరొంచ దళ కమాండర్ గా పని చేస్తూ 2006లో మిస్సయ్యారు. చత్తీస్ గడ్ లోని బీజాపూర్ జిల్లా బండగూడెంకు చెందిన శ్యామల సిరొంచ దళంలో సభ్యురాలిగా పనిచేస్తోంది. వీరిద్దరూ ఒకే సారి అదృశ్యం గత 15 ఏళ్లుగా మిస్టరీగా మారిపోయింది. మావోయిస్టు పార్టీలోనే ఉండొచ్చని వీరిని ఇతర ప్రాంతాలకు పంపించి ఉంటారని భావించారు. దండకారణ్య అటవీ ప్రాంతంలో పార్టీ కార్యకలాపాల్లో పాలుపంచుకుంటున్నారని అనుకున్నారంతా. కానీ అనూహ్యంగా వీరు మావోయిస్టు పార్టీలో కూడా లేరని సమాచారం అందుకున్న గడ్చిరోలి పోలీసులు గత రెండేళ్లుగా ఆచూకి కోసం గాలిస్తున్నారు. టూగే ప్రైవేటు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుండగా, శ్యామల కారు షోరూంలో హౌజ్ కీపింగ్ ఉద్యోగం చేస్తుండగా పట్టుకున్నారు. రూ. 8 లక్షల రివార్డు ఉన్న టూగేపై 9 హత్య, 2 దోపిడీ, 4 లూటీ, 8 ఎదురుకాల్పులు, ఒక హత్యాయత్నం కేసులు ఉన్నాయని గడ్చిరోలీ పోలీసులు వివరించారు. రూ. 2 లక్షల రివార్డు ఉన్న శ్యామలపై 5 ఎదురు కాల్పులు, ఒక దోపిడీ, ఒక లూటీ కేసులు నమోదు అయి ఉన్నట్టు వివరించారు.
అడవులు ఎందుకు వదిలినట్టో…?
సిరొంచ దళ కమాండర్ టూగే, ఆయన భార్య దళ మొంబర్ శ్యామలలు అడవులు వదిలేయడానికి కారణాలు ఏంటన్నదే అంతుచిక్కకుండా పోయింది. వీరు మావోయిస్టు పార్టీ విధానాలు నచ్చక అడవి బాట వీడారా లేక మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో మహారాష్ట్ర పోలీసులు ఆరా తీస్తున్నట్టు సమాచారం. పార్టీ విధానాలు నచ్చనట్టయితే లొంగిపోయి జనారణ్యంలో కలిసే అవకాశం ఉండేది కానీ వీరూ అనూహ్యంగా అదృశ్యం కావడం వెనక ఉన్న మిస్టరీ ఏంటన్న తర్జనభర్జనలు సాగుతున్నాయి. ఏకంగా 15 ఏళ్లు పోలీసుల కళ్లుగప్పి ఎలా జీవనం సాగించారు, కనీసం వారి ఉనికి కూడా బయటపడకుండా ఉండడం వెనక ఆంతర్యం ఏంటన్నదే అంతుచిక్కకుండా పోయింది. పార్టీ బాధ్యతలు అప్పగించడం వల్లే వీరు హైదరాబాద్ లో డెన్ ఏర్పాటు చేసుకున్నారా లేక ఎవరికీ చెప్పా పెట్టకుండా బయటకు వచ్చారా అన్నది తేలాల్సి ఉంది. ఒక వేళ మావోయిస్టు పార్టీ నాయకత్వాన్ని కాదని అదృశ్యం అయిన వీరి గురించి పార్టీ కూడా ఓ ప్రకటన విడుదల చేసేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే పోలీసులు మాత్రం వీరి మిస్సింగ్ మిస్టరీ ట్రేస్ చేసే పనిలో నిమగ్నం అయినట్టుగా సమాచారం. ఇంత కాలం ఏఏ ప్రాంతాల్లో షెల్టర్ తీసుకున్నారు, పార్టీ కార్యకలాపాల నిర్మాణంలో పాలు పంచుకుంటూ జీవనం సాగించారా లేక సాధారణ జీవనం గడిపారా అన్న విషయంపై కూడా ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఏది ఏమైనా 15 ఏళ్లుగా అటు పార్టీకి టచ్ లో లేకుండా ఇటు మహారాష్ట్ర ప్రభుత్వానికి చిక్కకుండా టూగే, శ్యామల దంపతులు ఎలా ఉండగలిగారన్న విషయంపై పోలీసు వర్గాల్లో దృష్టి సారించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.