దిశ దశ, పెద్దపల్లి:
పెద్దపల్లి లోకసభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దివంగత జి వెంకటస్వామి మనవడు జి వంశీ కృష్ణ అభ్యర్థిత్వాన్ని అధిష్టానం ఖరారు చేసింది. టికెట్ రేసులో నువ్వా నేనా అన్నట్టుగా సాగిన టికెట్ రేసులో ఎట్టకేలకు వంశీవైపే అధినాయకత్వం మొగ్గు చూపింది. ఇక్కడి నుండి టికెట్ ఆశించిన మాజీ ఎంపీ చెలిమెల సుగుణ కుమారి అభ్యర్థిత్వానికి మెజార్టీ సెగ్మెంట్ల నాయకులు మద్దతు ఇచ్చినప్పటికీ అధిష్టానం మాత్రం వంశీ కృష్ణకే తుది జాబితాలో అవకాశం కల్పించింది. సీఎం రేవంత్ రెడ్డి, జాతీయ నాయకత్వం అంతా కూడా గడ్డం వంశీ వైపే మొగ్గు చూపినప్పటికీ పెద్దపల్లి లోససభ పరిధిలోని మెజార్టీ సెగ్మెంట్ ఇంఛార్జీలు సుగుణ కుమారి పేరును తెరపైకి తీసుకొచ్చి ఆమెకు అండగా నిలిచారు. అదిష్టానం పెద్దలను కూడా మెప్పించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇక్కడి నుండి టికెట్ ఆశించిన కాంగ్రెస్ గోమాస శ్రీనివాస్ బీజేపీలో చేరడం ఆయన అభ్యర్థిత్వం కూడా ఖరారు కావడంతో చివరకు వంశీ కృష్ణ, సుగుణ కుమారి మధ్య తీవ్రమైన పోటీ ఏర్పడింది. కానీ తుది జాబితాలో మాత్రం స్థానిక నాయకత్వ చేసిన ప్రతిపాదనల విషయంలో అధిష్టానం పక్కనపెట్టాల్సి వచ్చింది. రాష్ట్రానికి చెందిన ముఖ్య నాయకులు కూడా ఈ విషయంలో పెద్దపల్లి పరిధిలోని ఆయా సెగ్మెంట్ల ముఖ్య నాయకులతో వంశీ కృష్ణ అభ్యర్థిత్వానికి అసలు కారణాలు ఏంటీ..? ఇందుకు మీరంతా ముందుకు వస్తారా అన్న విషయాన్ని లేవనెత్తినెట్టుగా తెలుస్తోంది. ఇందులో ఆర్థికపరమైన అంశాలు కూడా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయన్న విషయాన్ని కూడా ప్రస్తావించినట్టుగా సమాచారం.
ఆ సెంటిమెంట్ కు చెక్…
కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ నేతల్లో ఒకరైన గడ్డం వెంకటస్వామి విషయంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. కురువృద్దుని ఓటమి కోసం మహిళను బరిలో నిలిపితే ఎలా ఉంటుంది అన్న యోచన చేసింది. ఇదే సమయంలో మంథనికి చెందిన మార్పక రాజేంద్ర ప్రసాద్ ను ఆదర్శ వివాహం చేసుకున్న చెలిమెల సుగుణ కుమారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దృష్టిలో ఉండడంతో ఆమెకు అవకాశం వచ్చింది. 1998లో జరిగిన లోకసభ ఎన్నికల్లో వెంకటస్వామిపై గెలిచిన సుగుణాకుమారి 1999లో జరిగిన ఎన్నికల్లో కూడా రెండోసారి గెలిచారు. బ్రహ్మాస్త్రంపై పిచ్చుకను ప్రయోగించినట్టుగా అప్పటి టీడీపీ అధినేత చంద్రబాబు భావించిన రెండు సార్లు సక్సెస్ అయ్యారు. 2004లో వెంకటస్వామి చేతిలో సుగుణ కుమారి ఓటమి పాలైన తరువాత ఆమె క్రియాశీలక రాజకీయలకు దూరంగా ఉండిపోయారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్న వంశీ కృష్ణను కాదని మరోకరికి టికెట్ ఇవ్వాలని ప్రతిపాదనలు తెరపైకి తీసుకొచ్చిన స్థానిక నాయకత్వం సుగుణ కుమారి విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టుగా తెలుస్తోంది. వెంకటస్వామి అంతటి సీనియర్ నేతపై పై చేయి సాథించిన సుగుణ కుమారిని బరిలో నిలపాలన్న ప్రతిపాదన తీసుకొస్తే అప్పటి సెంటిమెంట్ తొలి అడుగులోనే వర్కౌట్ అవుతుందని భావించినట్టుగా స్పష్టం అవుతోంది. అధిష్టానం మాత్రం ఆమె అభ్యర్థిత్వానికి అనుకూలతను ప్రదర్శించకపోవడంతో అంచనాలు తలకిందులు అయ్యాయి. దీంతో వివేక్ తనయుడు గడ్డం వంశీ కృష్ణ వైపే అధిష్టానం మొగ్గు చూపడంతో అప్పటి సెంటిమెంట్ కు మొదట్లోనే బ్రేకులు పడ్డట్టయింది. తాతపై పోటీ చేసి రెండు సార్లు గెలిచిన సుగుణ కుమారి… వంశీ కృష్ణ అభ్యర్థిత్వానికి అడ్డంకిగా మారడంతో తాతకు ఉన్న సెంటిమెంట్ మనవడి విషయంలోనూ ఎదురవుతుందా… అన్న చర్చ కూడా జరిగింది. కానీ వంశీ కృష్ణ మాత్రం తొలి అడుగులోనే తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయించుకోవడంలో సక్సెస్ అయ్యారు.