ప్రజా యుద్ధనౌక గద్దర్ పై సంచిక ఆవిష్కరణ

జనసాహితి ఐదు దశాబ్దాల వేడుకలు

దిశ దశ, హుజూరాబాద్ కరస్పాండెంట్:

తాడిత, పీడిత ప్రజలను తన ఆట, పాట, మాటల ద్వారా చైతన్య పర్చడంలో ప్రజా యుద్ధనౌక గద్దర్ పాత్ర చరిత్ర పుటల్లో లిఖించదగిందని ప్రముఖ రచయిత అల్లం రాజయ్య అన్నారు. బుధవారం జనసాహితి సంస్థ ఐదు దశాబ్దాల ఆవిర్భావ వేడుకలు హుజురాబాద్ లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గద్దర్ నేపథ్యంపై తయారు చేసిన ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. శ్రమ జీవుల గొంతుకగా నిలిచిన గద్దర్ ఆదర్శప్రాయమైన జీవితం గురించి సభకు హాజరైన వక్తలు వివరించారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాటలు సబ్బండ వర్గాలను ఉరకలెత్తించిందన్నారు. రాబోయే తరాలకు గద్దర్ అనగానే విప్లవోద్యమ నేపథ్యమే గుర్తుకు వస్తుందన్నారు. సామ్రాజ్యవాదాన్ని సజీవ సమాధి చేసి సమసమాజ స్థాపన కోసం ప్రజలను చైతన్యవంతులను చేయడంలో గద్దర్ కీలక పాత్ర పోషించారని వక్తలు అన్నారు. ఆధునిక సాహితీ యుగకర్తగా గద్దర్ సరికొత్త చరితను క్రియేట్ చేశారని, జన నాట్యమండలి ద్వారా వందలాది మంది కళాకారులను తయారుచేసి చివరి శ్వాస వరకూ కూడా పాటే తన ప్రాణమని గద్దర్ జీవనం సాగించారన్నాన్నారు. గొచి, గొంగడి, కాళ్లకు గజ్జెలతో యుద్ద భూమిలో దూకి రాజ్యాన్ని ప్రశ్నించిన గొప్ప సాహసికుడని వక్తలు కొనియాడారు. ఈ సమావేశంలో ఆవునూరి సమ్మయ్య, హుస్సేన్, డాక్టర్ తిరుపతయ్య, ముక్కెర రాజు, పల్కల ఈశ్వర్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబ్జి బృందం ఆలపించిన పాటలు సభికులను ఆలరించాయి.

You cannot copy content of this page