తుప్రాన్ లో పుట్టిన విప్లవ తుపాన్

పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే…

అడివిలో ఆకులమ్మ చిగురాకుల ముద్దాడే…

దిశ దశ, హైదరబాద్:

బండెనక బండి కట్టి… పదహారు బండ్లు కట్టి… ఏ బండ్లే పోతవు కొడుకో నైజాము సర్కరోడా… నాజీల మించినవురో నైజాము సర్కరోడా… అని గళ మెత్తినా… పొద్దు తిరుగుడు పువ్వు… పొద్దును ముద్దాడే… తొలి పొద్దును ముద్దాడే… అని ప్రకృతితో విప్లవోద్యమకారులను పోల్చినా… నిండు అమాస నాడూ ఓ లచ్చ గుమ్మడి… ఆడ బిడ్డ పుట్టినాదే ఓ లచ్చ గుమ్మడి అని సెంటిమెంట్ జాడ్యపు జీవితాల్లో మగ్గుతున్న వారిని తట్టి లేపినా… ఇలా ఒక్కటేమిటీ… సభ్యత ముసుగులో సమజంలో సాగుతున్న తప్పిదాల పరంపరను తన గళం.. తన పదంతో కాళికి గజ్జె కట్టిన తీరు ఆరు దశాబ్దాల తరాల ముందు సాక్షత్కారించింది. జన నాట్యమండలి గద్దరన్న నోటి నుండి జాలు వారిన పాటల ప్రవాహంలో ఆశు కవిత్వమే ఎక్కువ. గద్దరన్న అంటే ఓ ఆట… ఓ పాట… అణగారిన వర్గాల గొంతుక… పుట్టిన ఊరు తుప్రానే అయినా విప్లవంలో తుపానులా కబడ్దార్ అంటూ నినదించిన దళిత బిడ్డ. అగ్రవర్ణాల అణిచివేత తీరును ఎదురొడ్డాలని పిలుపునిచ్చిన గుమ్మడి విఠల్… విప్లవ ప్రస్థానంలో ఎర్ర సిరాతో తన చరితను తానే లిఖించుకున్నారు. జీర బోయిన ఆ గొంతు నుండి వచ్చే పాటలు సమజాన్ని తట్టి లేపుతూ.. తప్పిదాలను ఎత్తి చూపుతూ సరికొత్త మార్గాన్ని ఎంచుకునే దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చాయి. శ్రీకాకుళంలో చీమల దండై ఎర్ర జెండా ఎత్తేందుకు నడుం బిగించిన ఆ నాటి యువత సాయుధ పోరు బాట పట్టకముందే చారుమజుందార్, కానూ సన్యాల్ లాంటి భారత తొలితరం విప్లవ కారుల అడుగు జాడల్లో నడిచి విప్లవ చరిత్రను తిరగరాశారనే చెప్పాలి.

శవాల స్వాధీన కమిటీలో…

విప్లవ పంథాలో సాయుధ పోరుబాట పట్టిన గద్దర్ శవాల స్వాధీన కమిటీకి ప్రాతినిథ్యం వహించారు. సాయుధ పోరులో అసువులు బాసిన అమరుల శవాల స్వాధీన కమిటీని ఏర్పాటు చేయగా ఇందులో సభ్యుడిగా కొనసాగగా, 1998లో 36 ప్రజా సంఘాలతో ఏర్పడిన బూటకపు ఎన్ కౌంటర్ల వ్యతిరేక కమిటీలో, 1999 డిసెండర్ 2న జరిగిన కొయ్యూర్ ఎన్ కౌంటర్ కు వ్యతిరేకంగా నిజాం కాలేజీలో బహిరంగ సభ నిర్వహించారు. అలాగే చర్చల్ల జనశక్తి పార్టీ ప్రతినిధిగా పాల్గొన్న రియాజ్ ఎన్ కౌంటర్ విషయంలో ప్రభుత్వ విధానాన్ని ఏకీ పారేశారు. పౌర హక్కుల సంఘం నేత ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ కిడ్నాప్ చేయడాన్ని నిరసిస్తూ పోరు చేసి ఆయన్ని క్షేమంగా విడిపించడంలోనూ కీలక పాత్ర పోషించారు గద్దర్. గిరిజనుల పోరాటాలు… పోడు సాగు చేసుకుంటున్న కుటుంబాల ఆరాటాలపై కూడా తనదైన బాణిలో విప్లవాలు నెరిపిన నేర్పరితన ఆయనకే చెల్లుతుంది. విప్లవ భావుకతను ఇనుమడింపజేసుకున్న నాటి తరంలో కొంతమంది కేవలం గద్దరన్న స్వరం నుండి వచ్చిన పాటలతో అణగారిన వర్గాల దుస్థితి గురించి అర్థం చేసుకున్న అడవి బాట పట్టారంటే ఆయన పాటల ప్రభావం సమాజంలో ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

అడవి నుండి అమెరికా వరకూ…

ఆయన నోట పాట వచ్చిందంటే ఆ తూట ఎవరిని ఎక్కు పెడుతుందో అర్థం కాకుండా పోయేంది. సాధారణ జీవనం సాగిస్తున్న అడవి బిడ్డల నుండి మొదలు సామ్రజ్యవాద అమెరికా దేశ ఎత్తులను కూడా చీల్చి చెండాడిన చరిత ఆయనది. అదిగో అదిగో చూడు అమెరికోడు వస్తుండు… బాంబుల సంచులతోని అమెరికోడు వస్తుండంటూ… కోకాకోలా పెప్సిలాంటి కూల్ డ్రింక్ కంపెనీల దోపిడీని కూడా ప్రజలకు అర్థమయ్యే రీతిలో వినిపించిన విప్లవయోధుడు. అమరత్వం పొందిన అన్నల గురించి ఏ స్థాయిలో వివరించారో… వారిని కన్న అమ్మల కడుపుకోతల గురించి కూడా అదే స్థాయిలో గళమెత్తిన తీరులో ఆయనకు ఆయనే సాటి. విప్లవ పంథాలో ముందుకు సాగిన వారిలో మర్క్సిజం… లెనినిజం గురించి ప్రసంగాలు చేసే వారు వామపక్ష ఉద్యమాలలో చాలా మంది ఉన్నారు. కానీ శ్రమ జీవుల హక్కుల గురించి… పెత్తందారి వ్యవస్థ తీరు గురించి పాట ద్వారా తెలంగాణా సమాజాన్ని మేలుకొలిపిన వారిలో గద్దర్ మొదటి వరసలో నిలుస్తారు. ఆయన తరువాతే మిగతా వారు స్థానం సంపాదించుకుంటారు తప్ప గద్దర్ ను మించిపోయేంత కళను ప్రదర్శించిన వారు ఎవరూ లేరని చెప్పడం అతిశయోక్తి కాదేమో.

ఆనాడు…

విప్లవోద్యమాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న 1980 నుండి 2000 సంవత్సరం వరకు వామ పక్ష విప్లవాల గురించి చెప్పేందుకు ఎవరూ ముందుకు వచ్చేవారు కాదు. ఆ సమయంలో తనను ప్రభుత్వం టార్గెట్ చేసుకుంటుందని తెలిసీ కూడా అంతర్జాతీయ మీడియా ముందు కూడా సర్కారు తీరును చీల్చిచెండాడే వారు. భాగ్యనగరంలో ఉంటున్నా విప్లవ భావజాలాన్ని అలవర్చుకున్న ఆయనకు లక్షల కోట్లు సంపాదించుకునే అవకాశం ఉన్నా తన పంథాను వీడకుండా… ఆర్థిక వనరుల సమీకరణకంటే అవస్థలు పడుతున్న అణగారిన బిడ్డల కోసమే పోరాటం చేశారు. దళిత కుటుంబంలో పుట్టిన గద్దర్ సైద్దాంతికత విషయంలో ధృఢ సంకల్పంతో ఉన్నారు తప్ప ఏనాడూ విప్లవ పంథా మార్గాన్ని వీడేందుకు సాహసించలేదు.

You cannot copy content of this page