బై బై… ఇక సెలవు కామ్రేడ్

నింగికి ఎగిసిన విప్లవ కెరటం

చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి

ప్రజాయుద్ద నౌక ఇక లేరు

దిశ దశ, హైదరాబాద్:

ప్రజా యుద్ద నౌక గద్దర్ అలియాస్ విఠల్ జీవన ప్రయాణం ఆగిపోయింది. విప్లవోద్యమంలో తనకంటూ బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న గద్దర్ కొద్ది సేపటి క్రితం మరణించారు. ఆయన మరణంతో ఎర్ర జెండా కన్నీటి పర్యంతం అవుతోంది. వామపక్ష ఉద్యమం ప్రస్థానంలో సాంస్కృతిక విప్లవానికి జీవం పోసింది గద్దరన్నే. 1969లో ఎర్ర జెండా ఎత్తిన ఆయన పీడిత, తాడిత ప్రజల పోరుబాట పట్టిన ఆయన కొండపల్లి సీతారామయ్యతో పీపుల్స్ వార్ పార్టీలో కదం తొక్కారు. జనజీవనంలో ఉన్నా ఆయన మనసంతా విప్లవ ఉద్యమం వైపే కొట్టుమిట్టాడేదని సన్నిహితులు చెప్తుండే వారు. ఓ సారి ఆయనను పీపుల్స్ వార్ బహిష్కరించింది. 1989లో పీపుల్స్ వార్ కు చెన్నారెడ్డి స్వేఛ్ఛా వాయువులు కల్పించారు. ఆ సమయంలో స్మారక స్థూపాలు, సభలు నిర్వహించింది పీపుల్స్ వార్ పార్టీ. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో ఆయన కీలక భూమిక పోషించారు. 2005 శాంతి చర్చల సమయంలో కూడా గద్దర్ ప్రత్యక్ష పర్యవేక్షణ చేశారు.చర్చల అనంతరం శాంతి చర్చల్లో పాల్గొన్న ఓ మావోయిస్టు నేతను అజ్ఞాతంలోకి పంపుతున్న క్రమంలో నిఘా వర్గాలకు చిక్కొద్దని దారి మళ్లిస్తూ అటవీ ప్రాంతాల్లో తిరిగారు. ఈ క్రమంలో తెల్ల వారడంతో గద్దర్ ను గుర్తించిన పల్లె జనం ఆయనతో పాటలు పాడించుకునే వరకూ వదిలిపెట్టలేదు.

గ్రీన్ టైగర్స్ కలకలం

గద్దర్ లక్షంగా గ్రీన్ టైగర్స్ హెచ్చరికలు చేసిన సందర్భాలు సంచలనంగా మారాయి. మాజీ ఎమ్మెల్యే హయగ్రీవాచారిని నక్సల్స్ హతం చేసిన తర్వాత గ్రీన్ టైగర్స్ పేరిట గద్దర్ పై కాల్పులు జరిపారు. ఆయన బాడీలో ఓ బుల్లెట్ అలాగే ఉంది.

ఉద్యమ ప్రస్థానంలో…

ధూంధాం పేరిప స్వరాష్ట్ర కల సాకారం అయ్యేందుకు కళాకారులను ఒకే వేదికపైకి తీసుకొచ్చిన చరిత్ర ఆయనది. స్వరాష్ట్ర కల కోసం ప్రతి ఒక్కరూ పోరుబాట పట్టడానికి గద్దర్ గళమే కారణమన్న అభిప్రాయాలూ లేకపోలేదు.

అప్పుడేం జరిగిందో…?

శాంతి చర్చల అనంతరం ఓ సారి నల్లమల అడవుల్లో ఆర్కే అలియాస్ రామకృష్ణను పోలీసు బలగాలు చుట్టు ముట్టాయి. ఈ సమయంలో గద్దర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జి వెంకటస్వామి వద్దకు చేరుకుని భారీ ఎన్ కౌంటర్ ను నిలువరించారనే చెప్పాలి. ఏపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న ఆర్కే విషయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. దీంతో జి వెంకటస్వామి జోక్యం చేసుకోవడంతో ఆర్కే ఎన్ కౌంటర్ జరగలేదన్న ప్రచారం కూడా ఉంది. అయితే చివరి అంకంలో గద్దర్ ప్రత్యక్ష రాజకీయాల్లో తన ముద్ర వేసుకునే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాను కలవడం, ఆ తర్వాత ప్రజాశాంతి పార్టీలో చేరడం… సొంత పార్టీ పెట్టడం జరిగింది.

You cannot copy content of this page