16వ శతాబ్దపు విప్లవ వీరుని కోసం నేటి విప్లవ యోథుడు పోరాటం చేస్తున్నారు. ల్యాండ్ మాఫియాను వ్యతిరేకిస్తూ నాటి నుండి నేటి వరకూ ఆదర్శంగా ఉన్న ఆ యోధుడి పేరిట విశ్వ విద్యాలయం ఏర్పాటు చేయాలంటున్నారు. ఈ క్రమంలోనే తన ప్రాణాలకు ముప్పు ఉందని రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు.
మరో పోరాటం వైపు…
ప్రజాయుద్ద నౌక గద్దర్ మరో పోరాటానికి శ్రీకారం చుట్టారు. జనగామ జిల్లాలోని బాల సాయిబాబా ట్రస్ట్ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ భూముల్లో 16వ శతాబ్దపు విప్లవకారుడు సర్దార్ సర్వాయిపాపన్న పేరిట విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. జనగామ జిల్లా గూడెం సమీపంలోని 59 ఎకరాల భూమి బాల సాయిబాబా ట్రస్ కు చెందినదని, ఈ భూమిపై రియాల్టర్ల కన్నుపడడంతో దురక్రామణలకు గురవుతోందని గద్దర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ భూమిని కాపాడి అందులో భావితరాలను తీర్చిదిద్దేందుకు యూనివర్శిటీని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. గత కొంతకాలంగా జనగామ ప్రాంతంలో తిరుగుతున్న గద్దర్ ఈ భూముల వివరాలను సేకరించి వాటిని సంరక్షించేందుకు నడుం బిగించారు.
రక్షణ కోసం…
అయితే మాఫియాగా మారిన కొందరి చేతిలో తనకు ప్రాణ హాని ఉందని గద్దర్ వ్యక్తం చేయడం సంచలనం కల్గిస్తోంది. ఈ మేరకు జనగామ కలెక్టర్ శివ లింగయ్య, డీసీపీ సీతా రాములలకు వినతి చేశారు. ఇప్పటికే బాల సాయిబాబా ట్రస్ట్ భూముల వివరాలు ఇవ్వాలని కోరుతూ స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. బాల సాయిబాబ ట్రస్ట్ భూములను ఆయన కుటుంబ సభ్యులు విక్రయించినట్టుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రజాయుద్దనౌక రంగంలోకి దిగడం చర్చనీయాంశంగా మారింది.
విప్లవవీరుని కోసం…
జనగామ జిల్లా ఖిలాషాపూర్ కు చెందిన సర్దార్ సర్వాయ్ పాపన్న 16వ శతాబ్దపు మేటి విప్లవకారుల్లో ఒకరు. ప్రపంచ పోరాట చరిత్రలోనే ఆయన పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉంది. జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసిన పాపన్నకు మరణ శిక్ష విధించడంతో ఆయన జగిత్యాల సమీపంలోని పొలాసకు చేరుకున్నారు. అక్కడ పేరు మార్చుకుని జీవనం సాగిస్తూ పేదల పక్షపాతిగా పోరాటం చేయసాగాడు. ఈ క్రమంలో పొలాస రాజులు పాపన్నను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. పొలాస జైలులో ఉన్న మిగతా ఖైదీలకు యుద్ద తంత్ర విద్యలు నేర్పి జైలు గోడలు బద్దలు కొట్టి తప్పించుకుంటారు. అక్కడి నుండి నేరుగా కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని గుట్టలను స్థావరాలుగా చేసుకుని రాజ్యాన్నే స్థాపించారు. మల్లయుద్దంలో ఆరి తేరిన పాపన్న ఔరంగజేబును ఓడించి గోల్కొండ ఖిల్లాను కైవసం చేసుకున్నారు. ఆయన చరిత్ర అంతర్జాతీయ సమాజంలో కూడా లభ్యం కావడం, ఆయన తైల వర్ణ చిత్రం లండన్ లో ఉందంటే పాపన్న స్పెషాలిటీ ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. ఆనాటి విప్లవ వీరుని పేరిట యూనివర్శిటీ స్థాపించాలన్న డిమాండ్ తో నేటి విప్లవ యోధుడు పోరుబాట పట్టడం విశేషం.