దక్షిణాదిన మరో పార్టీ…

తెలంగాణాలో ప్రాంతీయ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా ఆవిర్భవించి జాతీయ పార్టీగా అప్ గ్రేడ్ కాగా దక్షిణాది రాష్ట్రాల్లో మరో ప్రాంతీయ పార్టీ పుట్టుకొచ్చింది. కర్నాటకలోని బళ్లారి ప్రాంతంలో బలమైన నేతగా ఎదిగిన గాలి జనార్దన్ రెడ్డి కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. గనుల అక్రమ తవ్వకాల విషయంలో ఆరోపణలు ఎదుర్కొవడం, కేసులు నమోదు కావడంతో బీజేపీకి దూరమైన గాలి జనార్దన్ రెడ్డి తిరిగి క్రీయాశీలక రాజకీయాల నెరిపేందుకు రంగంలోకి దిగినట్టు స్పష్టం అవుతోంది. ఆయన సోదరులిద్దరు కూడా కర్నాటక రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నప్పటికీ గాలి జనార్దన్ రెడ్డి మాత్రం దూరం దూరంగానే ఉన్నారు. అయితే తాజాగా జనార్దన్ రెడ్డి సొంత పార్టీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. కర్ణాటకలో మంత్రిగా కూడా పని చేసిన గాలి జనార్దన రెడ్డి కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో తమ పార్టీ తరుపున అభ్యర్థులను నిలపనున్నట్టు కూడా ఆయన వెల్లడించారు. ఆయన గంగావతి నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని చెప్పారు. తాను ఇంత కాలం బీజేపీకి దూరంగానే ఉన్నానని తన తమ్ముళ్లు కలిసి వచ్చే విషయం వారి ఇష్టమేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు గాలి. బీజేపీతో తనకు ఎలాంటి సంబందం లేదని, ఆ పార్టీ సభ్యుడిని కూడా కాదని ఆయన స్పష్టం చేశారు.

అప్పుడే అంగీకరించలేదు…

చిన్న వయసులో ఉన్నప్పుడే తాను ఓటమిని అంగీకరించలేకపోయానని, అప్పుడు గోలిల ఆట ఆడుతున్నప్పుడు ఓడిపోతే అంగికరించే వాడిని కాదని రాజకీయాల్లో ఓటమిని ఎలా అంగీకరిస్తానని ప్రశ్నించారు. తన ఆలోచనలకు తగ్టట్టుగా కల్యాణ రాజ్య ప్రగతి పార్టీని ప్రారంభిస్తున్నాన్నారు. పల్లెపల్లెకు, గడప గడపకూ వెళ్లి పార్టీని బలోపేతం చేస్తానని, ప్రజల ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుందన్నారు. తన పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కర్ణాటక సంక్షేమ రాజ్యంగా మారుతుందని కూడా జోస్యం చెప్పారు.

పుష్కరం తరువాత

బళ్లారి ప్రాంతంలోని ఒబుళాపురం మైనింగ్​ కంపెనీకి సంబంధించిన కేసులో కోర్టు ఆంక్షలను గురించి ఆయన మాట్లాడుతూ… 12 ఏళ్ల పాటు వనవాసం చేశానన్నారు. బళ్లారికి వెల్లొచ్చని కోర్టు అనుమతించినా అడ్డుకున్నారని ఆరోపించారు. తనకు అండగా ఉంటామని శ్రేయోభిలాషులు, బళ్లారి ప్రజలు మాట ఇచ్చినందు వల్లే రాజకీయ పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నట్లు గాలి జనార్దన రెడ్డి వివరించారు. కర్నాటక మాజీ సీఎం యాడియూరప్ప అంటే తనకు ఎనలేని గౌరవమని చెప్పిన గాలి పొలిటికల్ పార్టీ ఏర్పాటు గురించి మాత్రం ఆయనతో చర్చించలేదన్నారు. తిరిగి పొలిటికల్ సీనారియోలోకి ఎంట్రీ ఇవ్వడం వెనక ఆంతర్యం ఏంటీ అన్నదే అంతుచిక్కకుండా పోయింది. దక్షిణాదిన బీజేపీకి అత్యంత అంగ, ఆర్థిక బలంగా కొంతకాలం నిలిచి జాతీయ స్థాయిలో చర్చకు తెరలేపిన గాలి జనార్దన్ రెడ్డి కొత్త పార్టీ పెట్టడానికి కారణాలు ఏంటీ అన్న చర్చలు సాగుతున్నాయి. కొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన క్యాడర్, లీడర్ ను ఎలా తయారు చేసుకుంటారోనన్న తర్జన భర్జనలు సాగుతున్నాయి. అయితే కొత్త పార్టీ తరుపున అభ్యర్థులను బరిలో నిలపనున్నందున అభ్యర్థుల తల రాతలు మారే ప్రమాదం కూడా లేకపోలేదన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. గతంలో కేవలం బళ్లారి ప్రాంతంలోనే తన పట్టు నిలుపుకున్న గాలి జనార్దన్ రెడ్డి ఇప్పుడు రాజకీయ పార్టీతో రాష్ట్రం అంతటా ఎలాంటి ప్రభావం చూపనున్నారన్నదే ప్రశ్నార్థకంగా మారింది.

You cannot copy content of this page