ఏడుసార్లు కత్తితో దాడి చేసినా… వెనక్కి తగ్గని యాదయ్య…

 

చైన్ స్నాచర్లను పట్టుకున్న హెడ్ కానిస్టేబుల్

దిశ దశ, హైదరాబాద్:

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు సార్లు కత్తితో దాడి చేసినా వెనక్కి తగ్గలేదు… వారిని వదిలి పెట్టలేదు. ఓ వైపు రక్తం వస్తున్నా వారిని మాత్రం విడిచి పెట్టలేదు. ఇదేదో థ్రిల్లర్ సినిమా కథ కాదు… ఓ హెడ్ హెడ్ కానిస్టుబుల్ చేసిన విరోచిత పోరాటం. భారత దేశ అత్యున్నత పురస్కారమైన రాష్ట్రపతి గ్యాలంటరీ అవార్డుకు ఎంపికైన హెడ్ కానిస్టేబుల్ యాదయ్య దేశ పోలీసు యంత్రాంగానికే రోల్ మోడల్ గా నిలిచారు.

అసలేం జరిగిందంటే…

2022 జులై 25న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. సైబారాబాద్ కమిషనరేట్ పరిధిలోని మాదాపూర్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ మెడలోంచి బంగారు గొలుసు ఎత్తుకెళ్లేందుకు అగంతకులు ప్రయత్నించారు. అయితే చైన్ స్నాచర్స్ ప్రయత్నాన్ని నిలువరించే ప్రయత్నం చేసిన ఆ మహిళ బంగారు గొలుసును కొంత భాగాన్ని తన చేతిలోనే కాపాడుకోగలింది. ఈ ఘటన జరిగిన తరువాత బైకులపై తిరుగుతూ కాలనీల్లో కాలినడకన వెల్తున్న వారే లక్ష్యంగా సంచరిస్తున్న ఈ ముఠాను పట్టుకునేందుకు పోలీసు అధికారులు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. మాదాపూర్ సీసీఎస్ పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న యాదయ్యతో పాటు మరో ఇద్దరు పోలీసు సిబ్బంది రెండు బైకులపై చైన్ స్నాచర్స్ ను వెతికే పనిలో నిమగ్నం అయ్యారు. ఈ క్రమంలో అనుమానితులను గుర్తించిన సీసీఎస్ టీమ్ వారిని వెంబడించి ఎట్టకేలకు పట్టుకుంది. ఈ క్రమంలో బైకుపై వెల్తున్న చైన్ స్నాచర్స్ లో ఒకరు యాదయ్యపై కత్తితో దాడి చేశారు. తమను పట్టుకునేందుకు వచ్చిన పోలీసుల నుండి తప్పించుకుని పారిపోవాలని భావించి హెడ్ కానిస్టేబుల్ యాదయ్యపై ఎదురు దాడికి దిగారు. దొంగ కత్తితో యాదయ్య ఛాతితో పాటు పలు ప్రాంతంలో మొత్తం ఏడు సార్లు దాడి చేసినా అతను మాత్రం పట్టువీడలేదు. ఓ వైపు తన శరీరం నుండి రక్తం కారుతూ… విపరీతమైన నొప్పి వస్తున్నా ఆయన మాత్రం వెనక్కి తగ్గలేదు. ఇంతలో అతనితో పాటు డ్యూటీలో ఉన్న సీసీఎస్ సిబ్బంది చైన్ స్నాచర్లను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. నిందితుల నుండి సమాచారం సేకరించిన పోలీసులు వారు ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారని తెలుసుకుని అక్కడ సోదాలు చేయగా ఆయుధాలు కూడా స్వాధీనం అయ్యాయి. చైన్ స్నాచింగ్ చేసేందుకు ఏర్పడిన ఈ అంతరాష్ట్ర ముఠాను యాదయ్య ప్రదర్శించిన ధైర్య సాహసంతోనే పట్టుకున్నారు. ఆ తరువాత యాదయ్యకు సర్జరీలు చేయించిన తరువాత కోలుకుని తిరిగి విధుల్లో చేరారు. వివిధ రాష్ట్రాలలో చైన్ స్నాచింగులకు పాల్పడుతున్న ఈ ముఠాను పట్టుకోవడంలో ప్రాణాలకు సైతం లెక్కచేయకుండా వ్యవహరించిన యాదయ్యకు దేశంలోనే అత్యున్నతమైన గ్యాలంటరీ అవార్డు ఇవ్వాలన్న ప్రతిపాదనలు భారత ప్రభుత్వానికి పంపించారు పోలీసు ఉన్నతాధికారులు. ఈ ఏడాది గ్యాలంటరీ అవార్డు గ్రహీతగా యాదయ్యను ఎంపిక చేస్తూ భారత ప్రభుత్వం ఉత్తర్వులు వెలవరించింది. విధి నిర్వహణలో అత్యున్నతమైన ప్రదర్శన చూపిన యాదయ్య గ్యాలెంటరీ అవార్డుకు ఎంపిక కావడం పట్ల పోలీసు అధికారులు అతన్ని అభినందించారు.

You cannot copy content of this page