అడ్డాలు మార్చి… ఆఫర్లు ప్రకటించి…

సరిహధ్దుల్లో జూదం కేంద్రాలు…

దిశ దశ స్పెషల్ ఆపరేషన్

తెలంగాణాలో పేకాట ఆడే పరిస్థితి లేకుండా పోవడంతో సరిహద్దుల్లో జూదం కేంద్రాలు ప్రారంభం అయ్యాయి. ఇంతకు ముందు గడ్చిరోలి, చంద్రపూర్ జిల్లాల్లో జూదం కేంద్రాలు నిర్వహించగా అక్కడి అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో నిర్వాహాకుల కన్ను మరో ప్రాంతంపై పడింది. తెలంగాణ ప్రాంత పేకాటరాయుళ్ల కోసం స్పెషల్ అడ్డాలు ఏర్పాటు చేసేశారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన కొంతమంది మహారాష్ట్రకు చెందిన మరికొందరిని మచ్చిక చేసుకుని యథేచ్ఛంగా పేకాట క్లబ్బులు నడిపిస్తున్నారు. వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలతో పాటు సిద్దిపేట పరిసర ప్రాంతాలకు చెందిన వారి కోసం ప్రత్యేకంగా అడ్డాలు ఏర్పాటయినట్టుగా స్పష్టం అవుతోంది.

ఎక్కడంటే..?

ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి కూత వేటు దూరంలోని మహారాష్ట్ర బార్డర్ లో ఈ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. లైసెన్స్ తీసుకున్న క్లబ్ కాకుండా ఎలాంటి అనుమతులు లేకుండానే పేకాట క్లబ్ నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆయా జిల్లాల నుండి జూదగాళ్లను తరలించే అద్దె కార్లకు రెంట్ చెల్లించడంతో పాటు డ్రైవర్లకు స్పెషల్ ఆఫర్లు కూడా ప్రకటిస్తూ పేకాట రాయుళ్లను తెలంగాణా నుండి మహారాష్ట్రకు తరలించే పనిలో నిర్వహాకులు నిమగ్నం అయినట్టుగా సమాచారం. దీంతో ఆయా జిల్లాలకు చెందిన పేకాట ప్రియులు ఆదిలాబాద్ జిల్లా మీదుగా సరిహద్దులు దాటి దర్జాగా వెల్లి వస్తున్నారు. రూ. కోటికి పైగానే ఈ క్లబ్బుల్లో పేకాట పేరిట నగదు చేతులు మారుతున్నట్టు అంచనా. ఆదిలాబాద్ జిల్లా సరిహధ్దుల్లోని పెన్ గంగా సాక్షిగా క్లబ్బులు సాగుతున్నాయి. ఇవే కాకుండా యావత్మల్, లాథూర్, రాయిగఢ ప్రాంతాల్లో కూడా క్లబ్బులు ఏర్పాటు చేసి తెలంగాణకు చెందిన పేకాట ప్రియులను ఆకర్షించే పనిలో పడ్డట్టు సమాచారం. అక్కడ నిర్వహిస్తున్న క్లబ్బులపై ఆయా ప్రాంతాల పోలీసు అధికారులు కానీ అధికార యంత్రాంగం కానీ దాడులు చేయకపోవడంతో సెక్యూరిటీ ఉందన్న ధీమాతో తెలంగాణాలోని ఆయా జిల్లాలకు చెందిన కార్లు పెన్ గంగా వైపు పరుగులు పెడుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా మీదుగా వెలుతున్న పేకాట ప్రియులకు రాచ మర్యాదలు చేస్తున్నారు. మందు విందులతో వారిని మచ్చిక చేసుకుంటున్న నిర్వాహాకులు తెలంగాణా నుండి క్లబ్బుల వేదికగా కోట్లాది రూపాయాల టర్నోవర్ చేస్తున్నారు. ఈ సరిహధ్దుల్లో అనుమతి లేకుండా ప్రారంభం అయిన ఓ క్లబ్ కు దేశ ఔన్నత్యాన్ని చాటిన మహనీయుని పేరు పెట్టుకున్న తీరు విస్మయానికి గురి చేస్తోంది.

అప్పుడలా…

గతంలో చంద్రపూర్ జిల్లా రాజూర, గడ్చిరోలి జిల్లా సిరొంచా తాలుకాలలొ పేకాట క్లబ్బులు నిర్వహించిన సంగతి విధితమే అప్పుడు సరిహధ్దు ప్రాంతాల్లో రామగుండం కమిషనరేట్ పోలీసులు గస్తీ ముమ్మరం చేసి జూదం ఆడుతున్నవారిపై కన్నెర్రజేశారు. సరిహధ్దుల్లో వాహనాల తనిఖీలు చేపట్టి వారిని కట్టడి చేయడంతో పాటు తెలంగాణా మీడియాల్లో పేకాట క్లబ్బుల గురించి కథనాలు రావడంతో ఆయా జిల్లాల అధికార యంత్రాంగం రెండు జిల్లాల్లో పేకాట క్లబ్బులకు అనుమతి ఇవ్వడానికి నిరాకరించింది. అయితే ఇప్పుడు నిర్వహాకులు మరింత సేఫ్ జోన్ గా ఉన్న యావత్మల్, లాథూర్, రాయిగఢ్ ప్రాంతాల్లో జూదం కేంద్రాలను స్టార్ట్ చేశారు. వీటీలో పెన్ గంగా సమీపంలో ఇటీవల ప్రారంభం అయిన ఓ క్లబ్బు నిర్వాహకులు అక్కడి ప్రభుత్వం అనుమతి తీసుకోకుండానే నిర్వహిస్తున్నట్టుగా సమాచారం. అయితే ఇప్పుడు కూడా ఆదిలాబాద్ జిల్లా పోలీసు అధికారులు సరిహద్దులను కట్టడి చేసినట్టయితే పేకాట కేంద్రాల నిర్వహాణకు బ్రేకులు పడే అవకాశాలు ఉంటాయి.

You cannot copy content of this page