పెద్దోళ్ల హోటళ్లో పేకాట రాయుళ్లు… దాడి చేసి పట్టుకున్న పోలీసులు

దిశ దశ, కరీంనగర్:

పెద్దోళ్ల హోటళ్లు పేకాట రాయుళ్ళకు అడ్డాగా మారిపోయాయా..? కీలక నేతల అండదండలు ఉన్న చో్ట పేకాట ఆడితే ఏమీ కాదన్న ధీమాతో జూదగాళ్లు ఉన్నారా..? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది కరీంనగర్ లో. ఆదివారం కరీంనగర్ లోని ఓ ప్రముఖ హోటల్ లో పోలీసులు దాడులు చేయడంతో అసలు గుట్టు వెలుగులోకి వచ్చింది. కరీంనగర్ ప్రతిమ హోటల్ లోని రూం నంబర్ 211లో పేకాట రాయుళ్లను పోలీసులు పట్టుకున్నారు. ఈ దాడుల్లో 11 మంది జూదగాళ్లు, రూ. లక్షా 31, 200 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పోలీస్ కమిషనరేట్ మెయిన్ ఎంట్రన్స్ కు ఎదురుగానే ఉన్న ఈ హోటళ్లో పేకాట రాయులు దర్జాగా గేమింగ్ యాక్టు నిర్వహించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

అక్కడైతే సేఫా..? 

ప్రముఖులకు చెందిన వారే ఈ హోటల్ లో భాగస్వామ్యులుగా ఉండడంతో పోలీసులు అటువైపు కన్నెత్తి చూడరన్న ధీమాతో జూదగాళ్లు నిర్భయంగా ఆట ఆడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. కరీంనగర్ లోని మరిన్ని హోటల్స్ లో కూడా ప్రముఖుల అండదండలు ఉన్నాయంటూ పేకాట నిర్వహిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. నగరంలోని కొన్ని హోటళ్లలో కేవలం గేమింగ్ యాక్టు పేరిటనే రూ. లక్షల్లో నగదు టర్నోవర్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. తమను అడ్డుకునే వారే లేరని, ఇక్కడ ఆడితే పోలీసుల దాడులు కూడా ఉండదన్న నమ్మకం కల్పించడం వల్లే ఈ హోటల్స్ జూదగాళ్లకు అడ్డాలుగా మారిపోయాయన్న విమర్శలు వస్తున్నాయి.

బాధ్యత లేదా..? 

జూదం ఆడించే విషయంలో పోలీసులు వచ్చి దాడులు చేసే వరకూ అడ్డుకునే వారు లేకపోవడం విస్మయం కల్గిస్తోంది. హోటల్ నిర్వహాకులు పేకాట ఆడే వారికి రూమ్స్ అద్దెకు ఇవ్వకూడదన్న విషయాన్ని ఎలా విస్మరించారన్నదే ప్రశ్నార్థకంగా మారింది. గతంలో పుష్పాంజలి రిసార్ట్స్ లో జూదం నిర్వహిస్తున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు దాడులు జరిపిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఇతర పేకాట అడ్డాలపై ఎందుకు దాడులు చేయలేదన్నదే అంతుచిక్కకుండా పోయింది. హోటల్స్ మేనేజ్ మెంట్ కూడా ఒకే గదిలో పెద్ద ఎత్తున ఉంటున్న విషయాన్ని సీసీ కెమెరాల ద్వారా కనిపెట్టి వారిని అడ్డుకునే అవకాశం ఉన్నా ఎందుకు పట్టించుకోలేదన్నదే ప్రశ్నార్థకంగా మారింది. సాధారణంగా ఒక హోటల్స్ లో డబుల్, త్రిపుల్ బెడ్ రూమ్స్ ఉంటాయి. వాటిని అద్దెకు తీసుకున్న వారిని కలిసేందుకు వచ్చేవారు ఒకరో ఇద్దరో ఉంటారు కానీ ఒకే గదిలో పదకొండు మంది ఉన్నా మేనేజ్ మెంట్ స్టాఫ్ ఎందుకు పట్టించుకోలేదన్నదే అంతుచిక్కకుండా పోయింది. పేకాట ఆడడం చట్టరిత్యా నేరమన్న విషయం తెలిసీ హోటల్ మేనేజ్ మెంట్ వారు ఎందుకు ప్రోత్సహించారన్నదే ప్రశ్నార్థకంగా మారింది. తమ వ్యాపారం కోసం గేమింగ్  యాక్టును ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు ఇంతకాలం వినిపించినా ప్రముఖుల అండదండలు ఉండడం వల్లే అటువైపు పోలీసులు కన్నెత్తి చూడలేదన్న చర్చ కూడా సాగుతోంది. సామాన్యుడి విషయంలో కఠినంగా అమలైన చట్టం పెద్దల విషయంలో మమకారాన్ని ప్రదర్శించేలా చేసిందా అన్న ప్రశ్నలు కూడా తలెత్తాయి. అయితే ఇంతకాలం కఠినంగా వ్యవహరించాల్సిన కాఖీలు స్తబ్దంగా ఉండిపోవడంతో సామాన్యుడు ఎదురు తిరిగి ప్రశ్నించలేని పరిస్థితి తయారైంది. చాలా కాలం తరువాత కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో పోలిసింగ్ సిస్టం దూకుడు ప్రదర్శిస్తుండడంతో ఒక్కో విషయం వెలుగులోకి వస్తోంది. 

You cannot copy content of this page