దిశ దశ, రామగుండం:
వాడిన ఫోనే కదా… సెకండ్ సేల్స్ కింద అమ్మేస్తే డబ్బులు వస్తాయని ఆశించి ఎవరికి పడితే వారికి అమ్మినా… పూర్తిగా నాశనం అయిపోయింది కదా స్క్రాప్ కింద అమ్మితే తప్పేంటి అని అనుకున్నా ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త. ఫోన్లు పూర్తిగా ధ్వంసం చేయడమో లేక ఇంట్లోనే స్టోర్ చేసుకుని పెట్టుకోవడమో చేయండి. లేనట్టయితే అవి సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి ఆ ఫోన్లు మళ్లీ వినియోగంలోకి వచ్చి మోసాలకు పాల్పడుతున్నాయి. దీంతో మొదటగా ఫోన్లను వినియోగించిన వారిపై పోలీసుల దృష్టి పెట్టే ప్రమాదం కూడా ఉంటుంది. తాజాగా రామగుండం కమిషనరేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కొత్త కోణాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. స్క్రాప్ కొనుగోలు చేసే వారి ముసుగులో పాత ఫోన్లను సేకరిస్తున్న ముఠాను పట్టుకుని వారి నుండి ఏకంగా 4 వేల మొబైల్ ఫోన్లను, మూడు బైకులను స్వాధీనం చేసుకుంది సైబర్ టీమ్. సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్సె పెక్టర్ కృష్ణమూర్తి నేతృత్వంలోని టీమ్ ఇన్వెస్టిగేషన్ తో వెలుగులోకి వచ్చిన ఈ విషయం సంచలనంగా మారింది.
ఇంతకీ ఏం జరిగిందంటే…?
రామగుండం కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి, ఎన్టీపీసీ పరిసర ప్రాంతాల్లో కొందరు అనుమానిత వ్యక్తులు సంచరిస్తున్నారు. అనుమానితుల కదలికలపై అనుమానం వచ్చిన పోలీసులు వారిపై ఓ కన్నెసి ఉంచారు. సైబర్ నేరాలకు పాల్పడేందుకు పాత మొబైల్ ఫోన్లను తక్కువ ధరలో సేకరించేందుకు స్క్రాప్ కొనుగోలు దారుల వేషంలో సంచరించారు. అయితే వీరు స్క్రాప్ రూపంలో కొన్న ప్లాస్టిక్, ఇనుప వస్తువులను మాత్రం ఎగుమతి చేస్తూ… సెల్ ఫోన్లను మాత్రం తమ వద్ద భద్రపర్చుకుంటున్నారు. దీంతో రంగంలోకి దిగిన రామగుండం సైబర్ సెక్యూరిటీ బ్యూర్ ఎస్ హెచ్ ఓ కృష్ణమూర్తి టీం ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తే అసలు గుట్టు వెలుగులోకి వచ్చింది. వీరి జార్ఖండ్, జమ్తారా, దియోఘర్ తదితర ప్రాంతాలకు చెందిన సైబర్ క్రిమినల్స్ కు సరఫరా చేస్తున్నారు. అయితే స్క్రాప్ పేరిట కొనుగోలు చేసిన ఈ మొబైల్ ఫోన్లను ముందుగా ఈ ముఠా సభ్యుడు అక్తర్ రిపేరు చేస్తాడు. వాటి సాఫ్ట్ వేర్, మథర్ బోర్డు, ఇతరాత్ర టెక్నికల్ ప్రాబ్రెమ్స్ ఉన్నట్టయితే వాటిని బాగు చేసి సాధారణ మొబైల్ పనిచేసే విధంగా బాగు చేస్తున్నాడు. వీటిని ఝార్ఖండ్ లోని సైబర్ క్రిమినల్స్ ముఠాలకు చేరవేసిన తరువాత వివిధ ప్రాంతాల్లోని వారికి ఫోన్లు చేసి అకౌంట్ల నుండి డబ్బులు బదిలీ చేయించుకోవడం వంటి నేరాలకు పాల్పడుతున్నారు. ఇలా వచ్చిన డబ్బులను స్క్రాప్ కొనుగోలు దారుల రూపంలో తిరుగుతున్న వారి నుండి రిపేర్ చేసిన వారు, ఫ్రాడ్ కాల్స్ చేసే వారు అంతా కలిసి పంచుకుంటున్నారు. అయితే ఫ్రాడ్ కాల్స్ చేస్తున్న మొబైల్ ఫోన్లకు సంబంధించిన ఐఎంఈఐ నంబర్లను పోలీసులు ట్రేస్ చేసినప్పుడు ప్రివియస్ హిస్టరీ అంతా కూడా మొదట మొబైల్స్ ను వినియోగించిన వారికి సంబంధించినదే వస్తుంది. దీంతో సైబర్ సెక్యూరిటీ పోలీసుల దృష్టిని మరల్చేందుకు సులువు అవుతుందని భావించి స్క్రాప్ రూపంలో మొబైల్ ఫోన్లను కొనుగోలు చేసే ముఠాలు రంగంలోకి దిగాయని అనుమానిస్తున్నారు. సెకండ్ సేల్స్ కింద అమ్మిన తరువాత కానీ, స్క్రాప్ పేరిట విక్రయించిన ఫోన్ల ద్వారా సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాలతో పాటు క్రిమినల్ గా పరిగణించే ప్రమాదం ఉంటుందని రామగుండం సైబర్ సెక్యూరిటీ వింగ్ సీఐ కృష్ణమూర్తి స్పష్టం చేస్తున్నారు. డివైజ్ ఐడెంటీటీ ద్వారా మొత్తం డాటా సేకరించినప్పుడు సెకండ్ సేల్స్ విక్రయించిన వారు కూడా బాధ్యులు అవుతారని వెల్లడించారు. మొబైల్ ఫోన్లను స్క్రాప్ ద్వారా కానీ, సెకండ్ సేల్స్ ద్వారా కానీ విక్రయించేప్పుడు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
నిందితులు వీరే…
రామగుండం సైబర్ సెక్యూరిటీ బ్యూరో స్టేషన్ లో Cr.No.30/2024, Sec. 318(4), 319(2), 61(2) BNS, Sec. 106 BNSS యాక్ట్, Sec. 66 (D) IT act-2008 ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో బీహార్ రాష్ట్రంలోని భోగభట్గామ జిల్లా భోగకారియాత్ పోస్ట్ ఛతియాకు చెందిన మహమ్మద్ షమీమ్ (30), కతిహార్ జిల్లా రౌతారా పోస్ట్ కోరా(ఎం), హతియాడియారాకు చెందిన అబ్దుల్ సలాం (28), మొహమ్మద్ ఇఫ్తికార్ (32), మొబైల్ ఫోన్లు రిపేర్ చేసే అక్తర్ అలీ (37)లను అరెస్ట్ చేశామని ఎస్ హెచ్ ఓ కృష్ణమూర్తి తెలిపారు.
ఆపరేషన్ జముత్రా…
ఫ్రాడ్ కాల్స్ చేస్తూ నేరాలకు పాల్పడే విధానానికి ఆపరేషన్ జముత్రా అని పిలుస్తుంటారని తెలుస్తోంది. జముత్రా పేరిట సైబర్ నేరగాళ్లు దేశంలోని వివిధ ప్రాంతంలోని బాధితుల నుండి డబ్బులు గుంజుతున్నారని తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు దేశంలో లోకేషన్స్ మార్చడం, రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న వారు పొరుగు రాష్ట్రానికి వెల్లి నేరాలకు పాల్పడిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. కానీ తాజాగా రామగుండం సైబర్ సెక్యూరిటీ బ్యూరో టీమ్ సరికొత్త విషయాన్ని వెలుగులోకి తెచ్చినట్టయింది. పాత ఫోన్లను స్క్రాప్ పేరిట కొనుగోలు చేసి సైబర్ నేరాలకు పాల్పుడుతున్న విషయం వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. దేశంలోనే రామగుండం సైబర్ వింగ్ పోలీసులు ట్రేస్ చేసిన ఈ ముఠా అత్యంత అరుదైన ఘటనల్లో ఒకటిగా చెప్పవచ్చు.