దిశ దశ, హైదరాబాద్:
తనకు సాఫ్ట్ వేర్ జాబ్ వచ్చిందన్న సంతోషాన్ని తన చిన్ననాటి స్నేహితునితో షేర్ చేసుకోవాలని సంబరపడిపోయిందా యువతి. ఈ సందర్భంగా పార్టీ ఇచ్చి తన ఆనందాన్ని పంచుకోవాలని భావిస్తే మద్యం మత్తులో ఆమె జీవితాన్ని బుగ్గిపాలు చేశాడు. హైదరాబాద్ లోని వనస్థలిపురం బొమ్మరిల్లు బార్ అండ్ రెస్టారెంట్ లో చోటు చేసుకున్న ఈఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా వివరాల్లోకి వెల్తే… సాఫ్ట్ వేర్ ఉద్యోగం వచ్చిన ఓ యువతి తనతో 2వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువiకున్న స్నేహితుడు గౌతం రెడ్డికి పార్టీ ఇవ్వాలని భావించింది. అయితే గౌతం రెడ్డితో పాటు మరో కామన్ ఫ్రెండ్ కూడా ఈ పార్టీలో జాయిన్ అయి మద్యం సేవించాడు. మద్యం మత్తులో సదరు యువతిని బార్ అండ్ రెస్టారెంట్ లోని ఓ గదిలోకి తీసుకెళ్లి ఆమెపై ఆత్యాచారం చేశారు. సోమవారం రాత్రి 7.30 గంటలకు జరిగిన ఈ ఘటనపై స్థానిక పోలీసులు గ్యాంగ్ రేప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వ్యూహమేనా..?
బాధితురాలితో గౌతం రెడ్డి తరుచూ మాట్లాడుతుండే వాడని… కలుస్తుండేవాడని కూడా పోలీసులు చెప్తున్నారు. 8 తరగతులు కలిసి చదువుకోవడంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం కూడా ఎక్కువగా ఏర్పడి ఉంటుందని తెలుస్తోంది. ఈ క్రమంలో తనకు ఉద్యోగం వచ్చిన విషయం కూడా స్నేహితుడైన గౌతం రెడ్డికి చెప్పి అతనికి ట్రీట్ ఇద్దామని భావించిన ఆమెపై అఘాయిత్యానికి పాల్పడిన తీరు విస్మయానికి గురి చేస్తోంది. పోలీసులు చెప్తున్న కథనాన్ని బట్టి… తనతో పాటు మరో స్నేహితుడిని కూడా పార్టీకి తీసుకరావడం వెనక ఆంతర్యం ఏమైనా దాగి ఉందా అన్న అనుమానం కూడా వస్తోంది. స్నేహితురాలు పార్టీ ఇచ్చేందుకు వెల్లిన తరువాత బార్ రూంలోకి ఆమెను తీసుకెళ్లారంటే వారు అప్పటికే ఆ గదిని బుక్ చేసుకుని ఉండే అవకాశాలు లేకపోలేదు. ఒక వేళ అప్పటికప్పుడు ఆమెను గదిలోకి తీసుకెళ్లేంత సాహసం చేశారంటే ఆ గదిని బార్ యాజమాన్యం వీరి కోసమే ఖాళీగా ఎందుకు ఉంచారు అన్న కోణంలో ఆరా తీయాల్సి ఉంది. మరో వైపున యువతిని బార్ రూంలోకి తీసుకెల్తుంటే అక్కడ పనిచేస్తున్న సిబ్బంది ఎందుకు నిలువరించలేకపోయారన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఒకే గదిలో ఇద్దరు యువకులు ఒక యువతి ఉండడంపై యాజమాన్యానికి ఎందుకు అనుమానం రాలేదన్నది కూడా అంతుచిక్కకుండా పోతోంది. బార్ అండ్ రెస్టారెంట్ లో సపరేట్ క్యాబిన్లు ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఉంటుంది కానీ… ప్రత్యేకంగా గదులు కూడా ఉండడం ఏంటన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఒక వేళ బార్ అండ్ రెస్టారెంట్ యాజమాన్యం స్టోర్ రూంగానో లేక స్టాఫ్ రూం గానో మేనేజ్ మెంట్ కోసం ఏర్పాటు చేసుకున్నట్టయితే ఆ గదిని వీరికి ఎందుకు అలాట్ చేశారో కూడా తెలియాల్సి ఉంది. ఆ భనంలో లాడ్జ్ కూడా నిర్వహిస్తున్నట్టయితే గదిని ముందుగా బుక్ చేసుకున్నారా లేక అప్పటికప్పుడు ఆ గదిని తీసుకున్నారా అన్న విషయం కూడా తేలాల్సి ఉంది. ఒక వేళ లాడ్జ్ కూడా ఏర్పాటు చేసినట్టయితే ఒకే గదిలోకి అంతమందిని ఎలా అనుమతించారో కూడా తెలుసుకోవల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా నిబంధనల మేరకే ఒకే భవనంలో బార్ అండ్ రెస్టారెంట్ అనుమతులు తీసుకున్నారా, నిబంధనలు పాటించారా అన్న విషయాలపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. బార్ అండ్ రెస్టారెంట్ కోసం ఎక్సైజ్ అధికారులు ఇచ్చిన లైసెన్స్ బార్ యాజమాన్యంతో చేసుకున్న అగ్రిమెంట్, ఎక్సైజ్ యాక్ట్ తదితర అంశాలను కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. దీనివల్ల బార్ యాజమాన్యం తప్పిదాలు ఏంటో కూడా వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. కేవలం నిందితులనే లక్ష్యం చేసుకుని కేసు దర్యాప్తు కొనసాగిస్తే బార్ అండ్ రెస్టారెంట్లలో ఇలాంటి అకృత్యాలకు బ్రేకులు పడే అవకాశం ఉండదని గమనించాలి. పోలీసు ఉన్నతాధికారులు కూడా యాజమాన్యం నిర్లక్ష్యంపై ఆరా తీయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. యువతిని అంత స్వేచ్ఛగా ఓ గదిలోకి తీసుకెళ్లగలిగారంటే బార్ అండ్ రెస్టారెంట్లో ఇలాంటి ఘటనలు కామన్ అన్నట్టుగా వ్యవహరించారా లేక మరేదైనా కారణం ఉందా అన్న అంశంపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం అయితే ఉంది. ఇలాంటి నేరాలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఎక్సైజ్ అధికారులు కూడా చట్టాలకు పని చెప్పాల్సిన అవసరం ఉంది.