దిశ దశ, కరీంనగర్:
శ్రీనివాస్ అన్న పేరు హిందువుల్లో అత్యంత కామన్ నేమ్… తిరుమలలో వెలిసిన వడ్డికాసుల వెంకన్నకు ఉన్న మరో పేరు శ్రీనివాస్. ఈ పేరు పెట్టాలని చాలా మంది తల్లిదండ్రులు ఆసక్తి చూపుతుంటారు. ఈ క్రేజీ ఉమ్మడి రెండు తెలుగు రాష్ట్రాలలో మరీ ఎక్కువగానే ఉంటుందని చెప్పాలి. శ్రీనివాస్ అనే పేరుకు ఎంత క్రేజీ ఉంటుందంటే… శివయ్య వెలిసిన రాజన్న క్షేత్రమైన కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని వేములవాడలో రాజన్న పేరుతో ఉన్నవారికంటే ఎక్కువగా శ్రీనివాసులే ఉంటారు. ఇక్కడ ప్రతి పది మందిలో ఆరుగురు శ్రీనివాసులు ఉంటారంటే ఆ సప్తగిరిలో వెలిసిన వెంకన్నపై ఎంత భక్తి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మరో అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. కరీంనగర్ విద్యానగర్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఓ ఆత్మీయ కలియక జరిగింది. ఆచార్య శ్రీనివాస్ ఆలయానికి వచ్చే భక్తుల్లో ఒకరైన ఉట్కూరి శ్రీనివాస్ రెడ్డి ముందు ఓ ప్రతిపాదన ఉంచారు. సప్తగిరులలో వెలిసిన శ్రీనివాసుని పేరున్న వారంతా కూడా ఒకే వేదికపై కలవాలని సూచించారు. ఇందుకోసం సోషల్ మీడియా వేదికగా శ్రీనివాస్ పేరిట ఉన్న వారిని గ్రూపులో జాయిన్ చేసుకోవడం మొదలు పెట్టారు. ఇప్పటికి మొత్తం మూడు వాట్సప్ గ్రూపుల్లో 2300 మందికి పైగా శ్రీనివాస్ అనే పేరున్న వారంతా కూడా చేరారు. అయితే తామంతా వ్యక్తిగతంగా కలిస్తే బావుంటుందన్న ఆలోచనతో విద్యానగర్ లోని వెంకటేశ్వర ఆలయంలో తొలి సమావేశం ఏర్పాటు చేసుకోగా సుమారు 150 మంది హాజరయ్యారు.
సీనయ్యల ట్రైన్…
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న వారిలో శ్రీనివాస్ అనే పేరున్న వారందరిని ఒకే వేదికపైకి తీసుకవచ్చే ప్రయత్నం చేయాలని నిర్ణయించుకున్నారు. ఏడాదికి ఒక సారి ఒక్క శ్రీనివాస్ అనే పేరు కలిగిన వారందరితో కలిసి తిరుమల వెంకన్న దర్శనానికి వెళ్లాలని నిర్ణయించారు. ఆ ట్రైన్ లో వెల్లే వారందరి పేరు కూడా శ్రీనివాస్ అని ఉండాల్సిందేనని నిర్ణయించుకున్నారు.
సేవా కార్యక్రమాలు…
ఆధ్యాత్మిక భావజాలంతోనే కాదు… సేవా కార్యక్రమాల్లో కూడా తమవంతు పాత్ర పోషించాలని భావిస్తున్నారు వీరంతా. తరుచూ రక్తదానాలు చేయడం, అనాథలను అక్కున చేర్చుకోవడం వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని కూడా తొలి సమావేశంలో నిర్ణయించారు. ధార్మిక చింతనతో పాటు సేవా చింతన ముఖ్యమని భావించిన శ్రీనివాసులంతా కూడా తరుచూ కలుకుంటూ ప్రపంచంలోనే అరుదైన రికార్డు సాధించాలని తపన పడుతున్నారు.