విచిత్రంగా ఆ నేత తీరు
దిశ దశ, హుజురాబాద్:
ఉప ఎన్నికల్లో ఓడిపోయిన ఆ నేతకు అనూహ్యంగా పదవి వరించింది. కార్పోరేషన్ ఛైర్మన్ అయిన ఆయన సొంత ప్రాంతం వైపు కన్నెత్తి చూడడం లేదు. అయితే ఆ స్థానాన్ని భర్తీ చేస్తున్నట్టుగా ఆయన సతీమణి ప్రజలతో మమేకం అవుతున్నారు. అందలమెక్కిన నేత కానరావడం లేదని అనుచరులు చర్చించుకుంటుంటే ఆశీర్వదించాలంటూ ప్రజలను అభ్యర్థిస్తున్నారావిడ. వైవిద్యంగా సాగుతున్న హుజురాబాద్ రాజకీయాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
ఆయన ఏడి..?
రాష్ట్ర టూరిజం కార్పోరేషన్ ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన గెల్లు శ్రీనివాస్ సొంత ప్రాంతం వైపు కన్నెత్తి చూడడం లేదు. ఉప ఎన్నికల్లో ఓడినా గెలిచినా ఇక్కడి ప్రజలతోనే కలిసి నడుస్తానని ప్రకటనలు చేసిన ఆయన నామినేటెడ్ పోస్టు అందుకున్న తరువాత హుజురాబాద్ కు రావడం లేదు. పార్టీ పరంగా ఉన్న కారణాలా లేక ఇతరాత్ర అంశాలో తెలియదు కానీ తమ నేత ఎందుకు రావడం లేదని తర్జనభర్జన పడుతున్నారు. ఓ సారి భారీ మీటింగ్ ఏర్పాటు చేసినప్పటికీ అనూహ్యంగా ఈ ప్రోగ్రాంను రద్దు చేసుకున్నారు. దీంతో గెల్లు శ్రీనివాస్ అనుచరులు తమ నేత కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో గెల్లు శ్రీనివాస్ వచ్చే ఎన్నికల్లో ఈటలను ఓడించడమే తన లక్ష్యమని, తాను అతనిపై గెలిచి తీరుతానన్నారు. అయితే నియోజకవర్గ ప్రజలతో టచ్ లో లేకుండా ఉంటే ప్రజలు ఎలా ఆదరిస్తారోనన్న భయం ఆయన అనుచరుల్లో వ్యక్తమవుతోంది.
ఆమె ఎంట్రీ…
గెల్లు శ్రీనివాస్ నియోజకవర్గానికి రాకపోవడంతో ఆ స్థానాన్ని భర్తీ చేసే బాధ్యతలను ఆయన సతీమణి గెల్లు శ్వేత తన భుజాలపై వేసుకున్నట్టుగా అర్థమవుతోంది. ఇటీవల కాలంలో నియోజకవర్గాన్ని చుట్టి వస్తున్న శ్వేత అందరి ఆశీర్వాదాలు ఇవ్వాలంటూ అభ్యర్థిస్తున్నారు. నెల రోజులుగా ఊరువాడా కలియ తిరుగుతూ ప్రతి కార్యక్రామానికీ హాజరవుతూ ప్రజల్లో కలిసి పోయేందుకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు శ్వేత. ప్రభుత్వ వాహనం అని రాసి ఉన్న వెహికిల్ లోనే ఆమె టూర్లు సాగుతుండగా కొంతకాలం గెల్లు శ్రీనివాస్ వచ్చాడని ఆశించినప్పటికీ ఆయన సతీమణిని చూసి ఖంగుతున్నారు. నెల రోజులకు పైగా హుజురాబాద్ ప్రజలతో టచ్ లో ఉంటుండడంతో స్థానికులకు కూడా గెల్లు శ్రీనివాస్ స్థానంలో ఆయన భార్య శ్వేతను రిసీవ్ చేసుకోవడం మొదలు పెట్టారు. ఎన్నికల తరువాత నుండి కొద్ది రోజుల క్రితం వరకూ అంటీముట్టనట్టుగా ఉన్న శ్వేత ఇటీవల కాలంలో పర్యటనలు చేస్తూ ప్రజలతో కలిసిపోతున్న తీరు చర్చనీయాంశంగా మారింది.
ఎందుకిలా..?
అయితే గెల్లు శ్రీనివాస్ హుజురాబాద్ ఏరియాలో పర్యటనలకు దూరంగా ఉండడం… ఆయన సతీమణి శ్వేత నియోజకవర్గాన్ని చుట్టేస్తుండడం వెనక కారణాలు ఏంటీ అన్నదే హాట్ టాపిక్ గా మారింది. శ్వేత గెల్లు హుజురాబాద్ నియోజకవర్గానికి రాలేకపోతున్న పరిస్థితుల దృష్ట్యా ఇక్కడి ప్రజలతో మమేకం అవుతున్నారా లేక వచ్చే ఎన్నికల్లో అవకాశం వస్తే అందిపుచ్చుకుని ఫలితాన్ని సానుకూలంగా మల్చుకోవాలని చూస్తున్నారా అన్న చర్చలు సాగుతున్నాయి.