రామగుండం సీపీ ఎం శ్రీనివాస్ వెల్లడి…
దిశ దశ, రామగుండం:
అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే వినాయక నవరాత్రుల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. గణేష్ మండపాల వద్ద బందోబస్తు చర్యలు చేపట్టడంతో పాటు శాంతియుత వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించే విధంగా పకడ్భందీగా వ్యవహరిస్తున్నారు. తాజాగా సాంకేతికతను అందిపుచ్చుకుని జియో ట్యాగింగ్ విధానం అమలు చేయాలని పోలీసు అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. వినాయక మండపాలు, శోభాయాత్ర పూర్తయ్యే వరకూ కూడా జియో ట్యాగింగ్ విధానం అమలు చేస్తున్నామని వెల్లడించారు. కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్లలో 4,656 విగ్రాహాలను ఏర్పాటు చేశారని వివరించారు. అయితే ఆన్ లైన్ తో పాటు ఆఫ్ లైన్లో కూడా గణేష్ ఉత్సవ కమిటీలకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నామని, వీటన్నింటిని క్షేత్ర స్థాయిలో పోలీసు యంత్రాంగం పరిశీలించి వివరాలను నమోదు చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టాని సీపీ వివరించారు. కమిషనరేట్ పరిధిలో రిజిస్టర్ అయిన మండపాలతో పాటు దరఖాస్తు చేసుకోని వాటి వివరాలను కూడా సేకరించి జియో ట్యాగింగ్ కు అనుసంధానం చేసే ప్రక్రియ చేపట్టామన్నారు. మండపాల వద్ద అనుకోని ఘటనలు సంభవించినట్టయితే అప్లికేషన్ లోని లోకేషన్ బటన్ ప్రెస్ చేయగానే మండపం ఎక్కడ ఏర్పాటు చేశారో తెలుస్తోందని దీంతో పోలీసు సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకునే అవకాశం ఉంటుదన్నారు. శాంతి భద్రతల సమస్యలు ఎదురయినప్పుడు జియో ట్యాగింగ్ విధానం వల్ల వెంటనే అక్కడకు చేరకుని వాటిని పరిష్కరించే అవకాశం ఉంటుందని సీపీ శ్రీనివాస్ తెలిపారు.