దిశ దశ, రాజన్న సిరిసిల్ల:
బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన గంటల వ్యవథిలోనే అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పౌరసత్వ వివాదం కారణంగా దక్కకుండా పోయిన వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబుకు కమలం పార్టీ గాలం వేసే పనిలో పడింది. ఆయన్ని పార్టీలో చేర్పించుకుంనేదుకు బీజేపీ నేతలు మంతనాలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. బుధవారం జర్మని నుండి ఇండియాకు రానున్న చెన్నమనేని రమేష్ బాబు తన హితులు, సన్నిహితులు, అనుచరులతో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆయన ఇండియాకు చేరుకునే సరికే ఒప్పించాలన్న సంకల్పంతో బీజేపీ నాయకులు పావులు కదపడం ఆరంభించారు. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చెన్నమనేని రమేష్ బాబుతో మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. ఇప్పటికే పలు మార్లు ఫోన్లో చర్చలు జరిపిన బీజేపీ నాయకులతో రమేష్ బాబు కూడా సానుకూలత వ్యక్తం చేసినట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో వేములవాడ నుండి బీజేపీ టికెట్ ఇవ్వాలని బీజేపీ నాయకులు యోచిస్తున్నట్టుగా సమాచారం. దీంతో వేములవాడలో రాజకీయ సమీకరణాలు ఒక్క సారిగా మారిపోయే అవకాశం లేకపోలేదు.
Disha Dasha
1884 posts